నల్లమలలో ముగిసిన పులుల గణన
ABN , Publish Date - Jan 25 , 2026 | 11:32 PM
నాగర్‌కర్నూలు జిల్లా పరిధిలోని అమ్రాబాద్ అభయారణ్య ప్రాంతంలో ఎన్‌టీసీఏ వారి సౌజన్యంతో రాష్ట్ర అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20న ప్రారంభమైన పులుల గణన (ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2026) ఆదివారం సాయంత్రం ముగిసింది.
- 253 బీట్లలో 358 మంది గణకుల ద్వారా లెక్కింపు ప్రక్రియ
- పులుల గణనలో హైటీకాస్ సంస్థ సేవలు
మన్ననూర్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూలు జిల్లా పరిధిలోని అమ్రాబాద్ అభయారణ్య ప్రాంతంలో ఎన్‌టీసీఏ వారి సౌజన్యంతో రాష్ట్ర అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20న ప్రారంభమైన పులుల గణన (ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2026) ఆదివారం సాయంత్రం ముగిసింది. ఏటీఆర్‌లోని 253 బీట్లలలో 118 మంది అటవీశాఖ ఉద్యోగులు, 105 మంది పొరుగు సేవల సిబ్బంది, 153 మంది వలంటీర్లు, మరికొందరు శిక్షణ ఐఎఫ్‌ఎస్ అధికారులు పులులు, వన్యప్రాణుల గణనలో పాల్గొన్నారు. ఈ నెల 20 నుంచి వివిధ బీట్లలో గణకులకు కేటాయించిన బేస్ క్యాంపులలో బస చేస్తూ, ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు శాకాహార, మాంసాహార జంతువుల లెక్కింపు చేపట్టారు. ముఖ్యంగా పెద్ద పులుల పాదముద్రలు, పెంటికలు, మలం తదితరాలను ఫొటోలు తీసి అటవీశాఖకు సంబంధించిన యాప్‌లలో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేశారు. చెట్లు, మొక్కలు, పొదలు, గడ్డిక్షేత్రాలను సైతం లెక్కించారు. ఏటీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ డాక్టర్ సునిల్ సి.హిరామత్, డీఎఫ్‌ఓ రేవంత్ చంద్రలు లెక్కింపు ప్రక్రియను పరిశీలించి గణకులకు పలు సూచనలు చేశారు. గణనలో పాల్గొన్న వారికి అటవీశాఖ ద్వారా ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
సేవలు అందించిన హైటీకాస్ సంస్థ
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సహా అటవీ శాఖ పోస్టుల్లో ఉద్యోగాలు సాధించాలనే తపనతో వివిధ రాష్ట్రాలకు చెందిన యువకులు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ఇలా ఉద్యోగాలు సాధించాలనుకునే వారితో పాటుగా అడవులు, వన్యప్రాణులంటే ఆసక్తి ఉన్న వారు రాష్ట్రంలో నెల 20 నుంచి 25 వరకు పులుల గణన (ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2026)లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారిలో 65 మంది యువ విద్యార్థులను హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ (హైటీకాస్) స్వచ్ఛంధ సంస్థ వలంటీర్లుగా ఎంపిక చేసి, పులుల లెక్కింపు బృందంలో చేర్చారు. సమర్థవంతమైన సర్వే కోసం వారందరికీ పర్యావరణ మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగించే విధానంపై కేబీఆర్ పార్కుతో పాటు అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులో శిక్షణ ఇచ్చారు.
అనుభవం కోసం గణనకు వచ్చా
అటవీ శాఖలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నా. తనకు అడవులన్నా, వన్య ప్రాణులన్నా ఎంతో ఇష్టం. భవిష్యత్‌లో అటవీశాఖ ఉద్యోగం సాధిస్తే, తనకు అనుభవం వస్తుందనే ఉద్దేశంతో గణనలో పాల్గొన్నాను. వన్యప్రాణుల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను.
- ఎండీ తాహ నజీర్, విద్యార్థి, నిజామాబాద్
ఎంతో ఉత్సాహాన్నిచ్చింది.
ప్రతీ రోజూ ఉదయం సాయంత్రం నాలుగు కిలోమీటర్లు సహచర అటవీ అధికారులతో కలిసి నడుస్తూ, జంతువుల గణన చేపట్టడం చాలా ఉత్సాహాన్నిచ్చింది. ఐదు రోజులు అభయారణ్యంలోని బేస్ క్యాంపుల్లో ఉన్న తమకు అటవీశాఖ అధికారులు చక్కటి వసతులను సమకూర్చారు. అవకాశం వస్తే మరో సారి నల్లమలలో గణనకు వస్తాను.
- అనిల్ కుమార్, ఇండియన్ ఫారెస్ర్టీ కళాశాల విద్యార్థి, కామారెడ్డి