Share News

టిక్‌.. టిక్‌.. టిక్‌...!

ABN , Publish Date - Feb 12 , 2026 | 11:22 PM

కార్పొరేషన్‌, మునిసిపాలిటీల ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో తేలనున్నాయి.

టిక్‌.. టిక్‌.. టిక్‌...!
పాలమూరు యూనివర్సిటీలో సిద్ధమైన కౌంటింగ్‌ కేంద్రం

- మరికొద్ది గంటల్లో తేలనున్న కార్పొరేషన్‌, మునిసిపాలిటీల ఫలితాలు

- కార్పొరేషన్‌ మేయర్‌, పుర చైర్మన్‌ పోటీదారుల వార్డులపై అందరిచూపు

- ఇప్పటికే మెజారిటీ స్థానాలు కాంగ్రెస్‌కే వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా

- ఉమ్మడి పాలమూరులో కొన్ని మునిసిపాలిటీల్లో హంగ్‌ ఏర్పడే అవకాశం

- అన్ని పార్టీలకు గెలుపుపై ధీమా.. నేటి రాత్రి నుంచే క్యాంపులకు విజేతలు

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కార్పొరేషన్‌, మునిసిపాలిటీల ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో తేలనున్నాయి. చాలా వ్యయ ప్రయాసలకు ఓర్చిన అభ్యర్థుల భవితవ్యం ఇప్పటికే బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమై ఉండగా.. నేటి ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండటంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మునిసిపాలిటీ, కార్పొరేషన్‌ ఎన్నికలపై పలు సంస్థలు తమ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను వెల్లడించగా.. కాంగ్రెస్‌ పార్టీకే మహబూబ్‌నగర్‌ పీఠం సహ మెజారిటీ మునిసిపాలిటీలు దక్కుతాయని పేర్కొన్నాయి. అయితే పోటీ మాత్రం అంత సులభంగా ఉన్నట్లు కనిపించడం లేదు. మేయర్‌, చైర్మన్‌ పీఠాల్లో మెజారిటీ కాంగ్రెస్‌కే దక్కే అవకాశం ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్‌, బీజేపీ సీట్ల సంఖ్యను మెరుగ్గానే తెచ్చుకోవడంతో పాటు.. ఓట్ల శాతాన్ని పెంచుకోకున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య చీలిపోవడం కూడా కాంగ్రెస్‌ పార్టీకి పలుచోట్ల కలిసి రావొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కార్పొరేషన్‌, 18 మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. ఒక్క కార్పొరేషన్‌ మినహా మిగతా అన్ని మునిసిపాలిటీల్లో 70 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది. అందులో ఎవరికి ఎన్ని పడ్డాయనే అంచనాలను అభ్యర్థులు, పార్టీలు ఇప్పటికే అంచనా వేసుకున్నాయి. కానీ నేడు బ్యాలెట్‌ బాక్సులు తెరిస్తే కానీ ఎవరి అదృష్టం పనిచేస్తుందో చెప్పలేని పరిస్థితి ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలుచోట్ల హంగ్‌ ఏర్పడే అవకాశం ఉంది. రెండుచోట్ల బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య హంగ్‌ ఏర్పడనుండగా.. రెండుచోట్ల బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య టఫ్‌ ఫైట్‌ రావడంతో హంగ్‌ ఏర్పడే అవకాశం ఉంది. మరో చోట ఫార్వార్డ్‌ బ్లాక్‌ కారణంగా హంగ్‌ ఏర్పడుతుందనే అంచనాలు ఉన్నాయి. మిగతా అన్నిచోట్ల కాంగ్రెస్‌కే మెజారిటీ కనిపిస్తోంది. అయితే సమయం దగ్గర పడుతున్నా కొద్ది అభ్యర్థులకు గడియారం శబ్దం.. టిక్‌.. టిక్‌.. టిక్‌ అని వినిపిస్తోంది.

వారి వార్డులపైనే కన్ను...

ఈసారి మెజారిటీ మునిసిపాలిటీల్లో త్రిముఖ పోరు నెలకొన్న విషయం తెలిసిందే.. బీఆర్‌ఎస్‌, బీజేపీల్లో ఆయా పార్టీల నాయకత్వం సూచించిన వారికే మేయర్‌ లేదా చైర్మన్లు కేటాయించే పరిస్థితి ఉండగా.. కాంగ్రెస్‌లో మాత్రం తీవ్ర పోటీ ఏర్పడింది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఓటు చీలిపోవద్దని, రెబల్స్‌ బలపడొద్దనే ఉద్దేశంతో ముందే చైర్మన్‌ అభ్యర్థులను ఖరారు చేయవద్దని సూచించారు. అందుకే ఎక్కడా వారిని ప్రకటించలేదు. కానీ మేయర్‌, చైర్మన్‌ పోస్టు ఆశిస్తున్న వారు మాత్రం ఒకరి కాళ్లలో మరొకరు కట్టెలు పెట్టుకున్నారు. వారు ఓడితే తనకు రూట్‌ క్లియర్‌ అని వీరు.. తాను ఓడితే మరొకరికి రూట్‌ క్లియర్‌ అని మరొకరు వ్యతిరేకంగా పనిచేశారు. కొందరు సొంత పార్టీలోనే వేరే వారికి ఓటు వేయాలని ప్రచారం చేశారు. టీపీసీసీ స్పోక్స్‌పర్సన్‌ హర్షవర్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌లో కొందరు పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని, ఆధారాలతో సహ ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. ఇలా దాదాపు అన్ని మునిసిపాలిటీల్లోనూ ఉంది. దీంతో మేయర్‌, పురపాలికల పీఠం ఆశావహుల వార్డులకు సంబంధించి ప్రత్యేక ఉత్కంఠ నెలకొంది. తాము మేయర్‌/చైర్‌పర్సన్‌ పోటీదారులమని చెప్పుకుని ఓడిపోతే ఎలా అని కొందరు టెన్షన్‌లో ఉంటే.. గెలిచిన తర్వాత పార్టీ ఏమంటుంది... పోటీదారులను ఎలా బుజ్జగించాలి అనే టెన్షన్‌లో కొందరు ఉన్నారు. కానీ కచ్చితంగా గెలవాలనే ఉద్దేశంతో చాలామంది మాత్రం తమ వార్డుల్లో తీవ్రంగా శ్రమించారు. మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌లో ఇప్పటికే కాంగ్రెస్‌కే మెజారిటీ వస్తుందని అంచనాలు ఉండగా.. ఒకవేళ తక్కువైతే స్వతంత్రుల మద్దతు, ఎంఐఎం మద్దతు కూడగట్టుకునే అవకాశం ఉంది. కానీ ఇతరుల మద్దతు అవసరమైనపక్షంలో వారు డిప్యూటీ మేయర్‌ కోరుతారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఎంఐఎం లేదా మైనారిటీ వార్డుల నుంచి డిప్యూటీ మేయర్‌ డిమాండ్‌ ఎక్కువగా వెలువడుతుందని చర్చ జరుగుతోంది.

నేటి రాత్రి నుంచే క్యాంపులకు...

మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌, భూత్పూరు, దేవరకద్ర మునిసిపాలిటీలకు సంబంధించి పాలమూరు యూనివర్సిటీలో కౌంటింగ్‌ కోసం ఏర్పాట్లు చేశారు. మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌ కోసం స్పోర్ట్స్‌ భవనం వెనుకాల ఉన్న షెడ్‌లో 20 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 60 వార్డులు ఉండగా.. మూడు రౌండ్‌లలో పూర్తి ఫలితాలు తేలనున్నాయి. దేవరకద్ర మునిసిపాలిటీకి సంబంధించి స్పోర్ట్స్‌ భవనం ఎదురుగా ఉన్న భవనంలో 12 టేబుళ్లు వార్డుకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయగా.. భూత్పూరు మునిసిపాలిటీకీ సంబంధించిన కౌంటింగ్‌ కేంద్రం ఫార్మసీ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఇందులో 10 టేబుళ్లు వార్డుకు ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు. కార్పొరేషన్‌ మినహా మిగతా రెండు మునిసిపాలిటీల్లో ఒకే రౌండ్‌లో పూర్తి ఫలితాలు తేలనున్నాయి. అయితే, కార్పొరేషన్‌ ఫలితాలు రావడమే ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వార్డుకో టేబుల్‌ చొప్పున ఏర్పాటు చేస్తే త్వరగా ఫలితం వచ్చేది. కానీ మూడు రౌండ్లలో కౌంటింగ్‌ జరగనుండటంతో కాస్త ఆలస్యమవుతుంది. ఇదిలా ఉంటే కార్పొరేషన్‌ సహ అన్ని మునిసిపాలిటీల్లో నేటి రాత్రికే విజేతలు క్యాంపులకు తరలిపోయేందుకు పార్టీలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఆలస్యం చేస్తే పోటాపోటీ ఉన్నచోట్ల విజేతలు అటూ ఇటూ జంప్‌ కొట్టే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. విజయోత్సవాలు, ర్యాలీలు, ఇతర సంబురాలు కూడా మేయర్‌ లేదా చైర్‌పర్సన్‌ ఎన్నిక తర్వాతనే చేసుకునే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ ఎన్నికకు రెండు రోజుల సమయం ఉండటంతో ఎంతమంది ఎక్కడెక్కడ జంపింగ్‌ జపాంగ్‌లు తేలుతారో వేచిచూడాలి.

Updated Date - Feb 12 , 2026 | 11:22 PM