Share News

మూడు మండలాలు సస్యశ్యామలం

ABN , Publish Date - Oct 02 , 2026 | 11:29 PM

సింగోటం - గోపాల్‌దిన్నె అనుసంధాన కాలువ నిర్మాణాన్ని వచ్చే ఖరీఫ్‌ నాటికి పూర్తి చేసి సాగునీరు అందిస్తామని పర్యాటక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

మూడు మండలాలు సస్యశ్యామలం
ఎక్స్‌కవేటర్‌తో పనులను ప్రారంభిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

- ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

- గోపల్‌దిన్నె - సింగోటం అనుసంధాన కాలువ నిర్మాణానికి భూమి పూజ

వీపనగండ్ల, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి) : సింగోటం - గోపాల్‌దిన్నె అనుసంధాన కాలువ నిర్మాణాన్ని వచ్చే ఖరీఫ్‌ నాటికి పూర్తి చేసి సాగునీరు అందిస్తామని పర్యాటక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. దీంతో పాన్‌గల్‌, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలు సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. వనపర్తి జిల్లా, వీపనగండ్ల మండలంలోని వల్లభాపురం సమీపంలో అనుసంధాన కాలువ నిర్మాణానికి శుక్రవారం రాత్రి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఈ కాలువ నిర్మాణానికి 2018లో భూమి పూజ చేశామని, ఆ తర్వాత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పనులు ముందుకు సాగలేదన్నారు. తాజాగా రూ.147 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. కాలువ నిర్మాణంలో భూములను కోల్పోతున్న రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఎన్‌నినో ప్రభావంతో పంటలు ఎండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని, వాటిని కాపాడుకునేందుకు కర్ణాటకతో మాట్లాడి సాగునీటిని విడుదల చేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, సర్పంచులు సుదర్శన్‌రెడ్డి, పలుస రామన్‌గౌడ్‌, రాముడు, ధనుంజయుడు, బీసీ సెల్‌ మండల అధ్యక్షుడు బసవరాజుగౌడ్‌, మైనార్టీ సెల్‌ మండల అధ్యక్షుడు అఖిల్‌, బాషా, రామచంద్రారెడ్డి, కృష్ణప్రసాద్‌యాదవ్‌, రవీందర్‌రెడ్డి, గోపి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2026 | 11:29 PM