Share News

ఆ తేళ్లు కుట్టవు!

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:37 PM

నాగుల పంచిమిని భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం సర్వ సాధారణం. దేశ వ్యాప్తంగా సోమవారం నాగుల పంచమి వేడుకలను నిర్వహించుకునేందుకు ప్రజలు సిద్ధమౌతున్నారు.

ఆ తేళ్లు కుట్టవు!

- కర్ణాటక రాష్ట్రం కందుకూరులో తేళ్ల పంచమి

- కొండమవ్వ గుట్టపై పూజలు చేయనున్న గ్రామస్థులు

నారాయణపేట, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): నాగుల పంచిమిని భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం సర్వ సాధారణం. దేశ వ్యాప్తంగా సోమవారం నాగుల పంచమి వేడుకలను నిర్వహించుకునేందుకు ప్రజలు సిద్ధమౌతున్నారు. అయితే, నారాయణపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని కర్ణాటక రాష్ట్రం యాదగిరి తాలూకా కందుకూరు గ్రామస్థులు మాత్రం తేళ్ల పంచమి వేడుకలను నిర్వహించుకుంటారు. ఈ ఆచారం ప్రతీ ఏటా కొనసాగుతూ వస్తున్నది. కందుకూరు గ్రామస్థులు గ్రామంలో కొండమవ్వ గుట్టపై కొలువుదీరిన తేళ్ల దేవతను ఆరాదిస్తూ తేళ్ల పంచమిని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. విషప్రాణులు, క్రిమి కీటకాలంటేనే భయపడే సామాన్యులకు విరుద్ధంగా ఈ ప్రాంత వాసులు తేళ్లతో సావాసం చేస్తూ పండుగలా ఉత్సవాన్ని నిర్వహించుకోవడం విశేషం. ఈ వింత ఆచారాన్ని చూసేందుకు సోమవారం జరిగే తేళ్ల పంచమి వేడుకలకు కందుకూరు గ్రామంలోని కొండమవ్వ గుట్టపై కొలువుదీరిన తేళ్లదేవత ఆలయానికి వెళ్లాల్సిందే.

పాలుపోసి పూజలు...

అక్కడ తేళ్ల దేవతకు పాలుపోసి పూజలు నిర్వహిస్తారు. కొండపై రాళ్లను కదిపితే వచ్చే తేళ్లను పట్టుకొని వాటితో సరదాగా ఆడుకుంటారు. అయితే ఈ తేళ్లు కుట్టవు. ఒకవేళ కుట్టినా ఆలయంలోని విభూతిని అంటించుకుంటే ఏమీ కాదని గ్రామస్థులు చెప్తుంటారు. చేతులు, నాలుక, తలపై తేళ్లను వేసుకొని ఆనందోత్సవాల మధ్య తేళ్ల పంచమిని జరుపుకుంటారు. నాగుల పంచమికి బదులు కందుకూరులో తేళ్ల పంచమిని జరుపుకోవడం చాలా కాలంగా ఆచారంగా వస్తుందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. అయితే, నారాయణపేట జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటక యాదగిరికి వెళ్లే ప్రధాన రహదారిపై కందుకూర్‌ గ్రామం ఉంది. తేళ్ల పంచమిని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివెళ్తారు. గ్రామంలోని కొండమవ్వ గుట్టపై ఉన్న తేళ్ల దేవత ఆలయంలో తేళ్ల పంచమిని ప్రతీ ఏటా నాగుల పంచమి రోజే గ్రామస్థులు జరుపుకోవడం వింత ఆచారంగా కొనసాగుతూ వస్తుంది.

Updated Date - Aug 16 , 2026 | 11:37 PM