రెచ్చగొడుతున్న ఆ వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 25 , 2026 | 11:11 PM
డిండి ప్రాజెక్టుపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పదేపదే మాట్లాడి పాలమూరు ప్రజలను రెచ్చగొడుతున్నారని... ఇది సరికాదని, డిండి నుంచి 0.6 టీఎంసీ నీరు తీసుకోవడాన్ని తీవ్రంగా వ్వతిరేకిస్తున్నట్లు రెండు జిల్లాల ప్రజలను కొట్టుకునే పరిస్థితి తేవద్దని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు.
- డిండి ప్రాజెక్టు రద్దు చేయాలన్న డిమాండ్ రైతుల్లో బలంగా ఉంది
- గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నా
- మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): డిండి ప్రాజెక్టుపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పదేపదే మాట్లాడి పాలమూరు ప్రజలను రెచ్చగొడుతున్నారని... ఇది సరికాదని, డిండి నుంచి 0.6 టీఎంసీ నీరు తీసుకోవడాన్ని తీవ్రంగా వ్వతిరేకిస్తున్నట్లు రెండు జిల్లాల ప్రజలను కొట్టుకునే పరిస్థితి తేవద్దని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మహబూబ్‌నగర్‌లోని ఆమె నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ డిండి ప్రాజెక్టు రద్దు చేయాలని పాలమూరు ప్రజలు, రైతాంగం డిమాండ్ చేస్తున్నారన్నారు. నల్గొండ ప్రయోజనాల కోసం గుత్తా మాట్లాడుతుంటే పాలమూరు ప్రాంతానికి చెందిన రేంవంత్‌రెడ్డి, మంత్రులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడానికి కేంద్రం సానుకూలంగా స్పందించినా రాష్ట్ర మంత్రులు పట్టించుకోవడం లేదన్నారు. ఢిల్లీ వేదికగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియా ముఖంగా చెప్పిన మాటలు ఏమయ్యాయన్నారు. మూడేళ్లలో పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారని, అవి ఏమయ్యాయన్నారు. జూరాల ప్రాజెక్టు మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం నిఽధులు కూడా విడుదల చేయడం లేదన్నారు. ప్రాజెక్టులపై మీకు చిత్తశుద్ధి ఏంటో అర్థం అవుతుందన్నారు. కాంట్రాక్టర్లు, కమీషన్లు తప్ప వేరే ద్యాస మీకు లేదన్నారు. ఏ జిల్లా నీరు ఆ జిల్లా తీసుకోవాలని తను ఎప్పుడూ చెప్పలేదన్నారు. నల్గొండ నాయకులు ఫ్లోరైడ్ సమస్య పేరుతో రాజకీయాలు చేయవద్దన్నారు. పాలమూరుకు కేసీఆర్, రేవంత్‌రెడ్డిలు చేసింది ఏమిలేదన్నారు. మూడేళ్ల పాలనలో పాలమూరుకు ఏంచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలోనే పాలమూరులోని పెండింగ్ ప్రాజెక్టుల సందర్శన చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ అందిరితో చర్చిస్తున్నట్లు చెప్పారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు, పాలమూరు పెండింగ్ ప్రాజెక్టు పోరాట కమిటీ అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, అయ్యాగారి ప్రభాకర్‌రెడ్డి, ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి, కార్పొరేటర్స్ మర్రిజ్యోతి, పాండురంగారెడ్డి, నాయకులు నందిపేట రాజు, శివనాయక్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.