పేలుతున్నాయ్..!
ABN , Publish Date - Nov 06 , 2026 | 11:23 PM
ఈ ఏడాది దీపావళి సంబురాలపై బాణసంచా ధరల పెరుగుదల ప్రభావం చూపుతోంది. దీంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు కొనుగోలు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు.
- దీపావళి బాణసంచా ధరలు
- గత ఏడాది కంటే 30 శాతం అధికం
- సామాన్యులకు భారంగా పండుగ సంబురాలు
- పెరిగిన ధరలతో తగ్గుతున్న కొనుగోళ్లు
నాగర్‌కర్నూల్ టౌన్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది దీపావళి సంబురాలపై బాణసంచా ధరల పెరుగుదల ప్రభావం చూపుతోంది. దీంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు కొనుగోలు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ఇతర గృహ ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు దీపావళి పండుగ అదనపు భారంగా మారుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బాణసంచా ధరలు సుమారు 30 శాతం పెరిగినట్లు వినియోగదారులు చెబుతున్నారు. గతంలో రూ.500తో సంచినిండా టపాకాయలు కొనుగోలు చేసే పరిస్ధితి ఉండగా, ప్రస్తుతం అదే మొత్తానికి పరిమితమైన బాణసంచా మాత్రమే లభిస్తోందని కొనుగోలుదారులు వాపోతున్నారు. ప్యాకెట్ సైజును బట్టి చిచ్చుబుడ్లు రూ.150 నుంచి రూ.300 వరకు, వంకాయ బాంబు రూ.100 నుంచి రూ.200, రాకెట్స్ రూ.100 నుంచి రూ.150, అదేవిధంగా 100వాల రూ.100 నుంచి రూ.150 వరకు, భూచక్రాలు రూ.100 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారు. పిల్లల సంతోషం కోసం బాణసంచా కొనాలనుకున్నా ధరలు చూసి అవసరమైన మేరకే తీసుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు.
కొనలేకపోతున్నాం.
- నరసింహ, కొనుగోలుదారుడు, బండరావిపాకుల
ప్రతీ ఏడాది దీపావళికి పిల్లల కోసం బాణసంచా కొనుగోలు చేస్తాం. గత ఏడాది కొనుగోలు చేసిన ధరలతో పోలిస్తే ఈసారి ప్రతీ రకం టపాసు ధర ఎక్కువగా ఉంది. పెరిగిన ధరలతో కొనలేకపోతున్నాం. పిల్లుల ఆనందం కోసం కొద్దిపాటితోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది.
ఈసారి పెద్దగా గిరాకీ లేదు
ఎస్.కుమారస్వామి, టపాసుల వ్యాపారి, నాగర్‌కర్నూల్
ఈసారి పెద్దగా గిరాకీ లేదు. దయారీదారుల వద్ద కొనుగోలు ధరలు, రవాణా, ప్యాకింగ్ తదితర ఖర్చులు పెరగడంతో ఆ ప్రభావం రిటైల్ ధరలపై పడింది. వినియోగదారులు ధరలు అడిగి తెలుసుకుంటున్నారు కానీ గతంలో మాదిరిగా ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం లేదు.