ఇసుక తీయరు.. నీరు రానివ్వరు....!
ABN , Publish Date - Jul 09 , 2026 | 11:28 PM
ఆర్డీఎస్ విషయంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎదురవుతున్న నీటి కష్టాల విషయంలో కుట్రకోణం బయటపడుతోంది. కావాలనే 70 ఏళ్లుగా మూడు రాష్ర్టాల మధ్య ఉన్న ప్రాజెక్టుకు మరమ్మతులు జరగనివ్వకుండా అడ్డుకోవడమే కాక.. అక్రమంగా తమ ప్రాంతాలకు నీటిని తరలించేలా కర్ణాటక ఎత్తుగడలు కనిపిస్తున్నాయి.
- కర్ణాటక తీరుతో ఆర్డీఎస్‌లో నడిగడ్డ హక్కులకు తిలోదకాలు
- కుట్రతో ఆర్డీఎస్ ఎడమ కాలువ షట్టర్ల వద్ద ఇసుకపై ఆంక్షలు
- నది బేస్ లెవల్‌కు సమానంగా అక్రమంగా కురిడి ఎత్తిపోతలు
- 70 ఏళ్లుగా మరమ్మతులు లేక ధ్వంసమైన కాలువలు, షట్టర్లు
- నీరు రాకున్నా హక్కులు కాపాడతామని నాయకుల ప్రగల్భాలు
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఆర్డీఎస్ విషయంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎదురవుతున్న నీటి కష్టాల విషయంలో కుట్రకోణం బయటపడుతోంది. కావాలనే 70 ఏళ్లుగా మూడు రాష్ర్టాల మధ్య ఉన్న ప్రాజెక్టుకు మరమ్మతులు జరగనివ్వకుండా అడ్డుకోవడమే కాక.. అక్రమంగా తమ ప్రాంతాలకు నీటిని తరలించేలా కర్ణాటక ఎత్తుగడలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పల్లంవైపు ఉండటం.. గతంలో బాంబులతో ఆనకట్టను పేల్చడంతో పాటు స్లూయిజ్‌ల నుంచి నీరు యతాతథంగా వెళ్తుండటంతో వారికి ఇబ్బందులు ఏర్పడటం లేదు. కానీ తెలంగాణవైపు కాలువలు ధ్వంసం కావడం, షట్టర్ల వద్ద 10 ఫీట్ల వరకు ఇసుక మేటలు పేరుకుపోవడం, షట్టర్లు ధ్వంసం కావడంతో నీటి హక్కులను పొందలేని పరిస్థితి ఉంది. పైపెచ్చు షట్టర్ల వద్ద పేరుకుపోయిన ఇసుకను స్థానిక రాజోలిబండ గ్రామ ప్రజలు తీద్దామనుకున్నా అధికారులు ఆంక్షలు విధించి.. ఎక్కడైనా తవ్వుకోండి.. కానీ షట్టర్ల వద్ద తవ్వొద్దని చెబుతున్నారు. ఒకవేళ ఆ ఇసుక తీస్తే నీరు సాఫీగా ఎడమ కాలువలోకి చేరుతుంది. కేవలం వరద వచ్చినప్పుడు మాత్రమే నీరు కాలువలో పారేలా చేస్తున్నారు. కాలువలోకి వచ్చిన నీరంతా తెలంగాణలోకి వస్తుందా? అంటే అదీ లేదు. తమ పరిధిలో ఉన్న 42.6 కిలోమీటర్ల పరిధిలో 10 హెచ్‌పీ సామర్థ్యంతో ఉన్న వేలాది బోర్లను ఏర్పాటు చేసుకుని తరలిస్తున్నారు. ఇప్పుడు తాజాగా 2 టీఎంసీల నీటిని తరలించేందుకు తాగునీటి పేరుతో కురుడి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. 50 శాతం పనులు పూర్తికాగా.. ఆ మేరకు రిజర్వాయర్లు కూడా సిద్ధమయ్యాయి. అయితే ఇలా నీరు రాకుండా కర్ణాటక చేస్తున్నా కూడా హక్కులు కాపాడతామని నాయకులు ప్రగల్భాలు పలుకుతుండటం గమనార్హం.
ఆర్డీఎస్ స్వరూపం ఇదీ..
ఆర్డీఎస్ తుంగభద్ర నదిపై కట్టిన ఒక డైవర్షన్ స్కీం.. 1956 ఇది నిర్మాణం పూర్తి చేసుకోగా.. దీనిపై తెలంగాణలోని నడిగడ్డ (ప్రస్తుత గద్వాల జిల్లా)లో 87,400 ఎకరాలకు నీరందించాలని ఉద్దేశంతో ఎడమ కాలువను నిర్మించారు. ఈ కాలువ మొత్తం 143 కిలోమీటర్లు ప్రయాణిస్తుండగా.. ఇందులో 42.6 కిలోమీటర్లు కర్ణాటకలో.. మిగతాది తెలంగాణలో ప్రవహిస్తుంది. బచావత్ ట్రైబ్యునల్ దీనికి 17.1 టీఎంసీల నీటిని కేటాయిస్తే.. అందులో తెలంగాణ వాటా 15.9 టీఎంసీలు కాగా.. కర్ణాటక వాటా 1.2 టీఎంసీలు మాత్రమే... కానీ ఏళ్లుగా ఆర్డీఎస్ ఎడమ కాలువలో కర్ణాటకనే ఎక్కువ నీటి దోపిడీకి పాల్పడుతోంది. 70 ఏళ్లుగా పూడికతీత చేపట్టలేదు. ఆనకట్ట పొడవున ఇసుక మేటలు పేరుకుపోయి.. ఫుల్ లెవల్ ఉన్నప్పుడు మినహా షట్టర్ల వద్దకు నీరందే పరిస్థితి లేదు. కర్ణాటక కుయుక్తులతో షట్టర్ల వద్ద మరమ్మతు పనులు చేపట్టడం లేదు. అలాగే అక్కడ పేరుకుపోయిన ఇసుకను కూడా తీయడం లేదు. మొత్తం 15.9 టీఎంసీల కేటాయింపుల్లో తెలంగాణకు కనీసం 5 టీఎంసీలు కూడా రావడం లేదు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నీటి దోపిడీని అడ్డుకుని.. ఆర్డీఎస్ ఎడమ కాలువకు ప్రత్యామ్నాయంగా గత ప్రభుత్వంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డిజైన్ చేశారు. దాని ద్వారా 24వ డిస్ర్టిబ్యూటరీ వద్ద ఆర్డీఎస్ కాలువలోకి నీటిని వదలి దాదాపు 50వేల ఎకరాలను స్థిరీకరించారు. వాస్తవంగా ఇప్పుడు ఆర్డీఎస్ ద్వారా 12 డిస్ర్టిబ్యూటరీ నుంచి 24 వరకు మాత్రమే నీరు అది ఫుల్ లెవల్ ఉన్నప్పుడే వస్తోంది. అది కూడా రాకుండా తాజాగా కర్ణాటక ప్రభుత్వం తెలంగాణ షట్టర్లకు 100 మీటర్లలోపు డ్రింకింగ్ వాటర్ పేరుతో నది లెవల్ కంటే లోతుకు అప్రోచ్ కెనాల్ తీసి.. 2 టీఎంసీల నీటిని తరలించేలా కురిడి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు.
అక్రమంగా నీటి వినియోగం
కర్ణాటకలో ఎడమ కాలువ ప్రవహించేది 42.6 కిలోమీటర్లు.. ఇందుకు గాను బచావత్ ట్రైబ్యునల్ 1.2 టీఎంసీల నీటిని కేటాయించింది. అయినప్పటికీ తెలంగాణకు నీరు రాకుండా సుమారు 10 టీఎంసీల వరకు వాడుకుంటున్నారు. ఉమ్మడి ప్రాజెక్టు అయినప్పుడు కచ్చితంగా ఇతర రాష్ర్టాలకు సమాచారం ఇవ్వాలి. కానీ ఇక్కడ సమాచారం ఇవ్వకపోగా.. సీడబ్ల్యూసీ, కేంద్ర జలశక్తిశాఖ, కేఆర్‌ఎంబీ అనుమతులు కూడా తీసుకోలేదు. కేవలం కర్ణాటక ఇరిగేషన్ శాఖ ఇచ్చిన అనుమతులతో పనులు చేస్తున్నారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఆర్డీఎస్‌లో తెలంగాణ హక్కులను కాపాడుకుంటామనే మాట తప్పా.. కర్ణాటక నిర్మాణాలపై ఒక్క విమర్శ చేయలేని పరిస్థితి.. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం తన నీటి హక్కుల కంటే ఎక్కువగానే కృష్ణా, తుంగభద్రలో నీటిని వాడుకుంటోంది. ఆలమట్టి ఎత్తు పెంపు, పూడిక పేరుకుపోయిందనే సాకుతో తుంగభద్ర ఎత్తు పెంపు, చిక్కలమర్రి వద్ద ప్రాజెక్టు, కృష్ణానదిపై రోడ్ కం బ్యారేజీలు ఏకధాటిగా నిర్మిస్తోంది. ఏపీ ఆర్డీఎస్ రైట్ కెనాల్, గుండ్రేవుల ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ప్రయోజనాలను కాల రాస్తోందనే విమర్శలు ఉన్నాయి. కర్ణాటక ప్రభుత్వం ప్రస్తుత ఆలోచనలు అమల్లోకి వస్తే.. కృష్ణా, తుంగభద్ర నుంచి నీరు రాక కేవలం ఉమ్మడి పాలమూరు మాత్రమే కాదు నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు కూడా తీవ్ర అన్యాయం జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
షట్టర్ల వద్ద ఇసుకతీతపై నిషేధం
మాది రాయిచూరు జిల్లా, మాన్వి నియోజకవర్గం రాజోలిబండ గ్రామం.. నేను పుట్టక ముందే ఇక్కడ ప్రాజెక్టు ఉంది. కానీ కట్టినప్పటి నుంచి ఇప్పటివరకు 70 ఏళ్లుగా కాలువలకు, షట్టర్లకు మరమ్మతు చేయలేదు. షట్టర్ల వద్ద ఆరు నెలలపాటు ఇసుక తీసుకోవడానికి వీలు ఉంటుంది. అలాగే బండ్ పక్కన కూడా తీసుకోవచ్చు. కానీ బండ్ పక్కన, షట్టర్ల వద్ద ఇసుక తీయడంపై అధికారులు నిషేధం విధించారు. ఎక్కడైనా తీసుకోండి కానీ అక్కడ మాత్రం తీయొద్దని అంటారు. మా ఊర్లో 150 ట్రాక్టర్లు ఉన్నాయి.. అధికారులు అడ్డుకోకపోతే ఇసుక మేటలను వారంలో తొలగించవచ్చు.
- హన్మేష్ నాయక్, రైతు, రాజోలిబండ, కర్ణాటక