Share News

ఊకచెట్టు వాగును తోడేస్తున్నారు

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:35 PM

ప్రజలకు సాగు, తాగు నీటికి కల్పతరువుగా ఉన్న ఊకచెట్టు వాగుపై ఇసుక మాఫియా కన్ను పడింది.

ఊకచెట్టు వాగును తోడేస్తున్నారు
బండర్‌పల్లి శివారులో ఊకచెట్టువాగులో ఏర్పడిన గుంతలు

- బండర్‌పల్లి వాగు నుంచి ఇసుక తరలింపు

- ఏడు టిప్పర్లను పట్టుకొని పోలీసులకు అప్పగింత

చిన్నచింతకుంట, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు సాగు, తాగు నీటికి కల్పతరువుగా ఉన్న ఊకచెట్టు వాగుపై ఇసుక మాఫియా కన్ను పడింది. నిత్యం రాత్రి వేళ అక్రమంగా ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. రెండు నెలల క్రితం ట్రాక్టర్ల సాయంతో డంపు చేసి, టిప్పర్ల తరలించిన ఇసుక మాఫియా రూట్‌ మార్చింది. ఇప్పుడు ఏకంగా భారత్‌బెంజ్‌లతో తరలించి మరికల్‌, మహబూబ్‌నగర్‌కు కానులు దండుకుం టున్నారు. జిల్లా కేంద్రానికి తరలిస్తే ఒక్కో టిప్పర్‌కు రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు వసూలు చేస్తున్నారు. మరికల్‌ తరలిస్తే రూ.30 వేలు వసూలు చేస్తున్నారు. బండర్‌పల్లి, లాల్‌కోట శివారు మధ్య గల రైల్వే ట్రాక్‌ వద్ద మంగళవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న ఏడు భారత్‌బెంజ్‌ టిప్పర్లను రైతులు, గ్రామస్థులు పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న మండల బీఆర్‌ఎస్‌ నాయకులు కోట రాములు, బండర్‌పల్లి మాజీ సర్పంచు సతీశ్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కోట రాములు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంటే, మరో పక్క ఇసుక మాఫియా నిత్యం టిప్పర్ల ద్వారా ఇసుకను తరలించడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు మోహన్‌గౌడు, సంతోష్‌రెడ్డి, నరసింహ, రియాజ్‌ తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2026 | 11:35 PM