Share News

జోగుళాంబ నిజరూప దర్శనం

ABN , Publish Date - Jan 23 , 2026 | 11:32 PM

జోగుళాంబ గద్వాల జిల్లా, అలంపూర్‌ క్షేత్రంలో జోగుళాంబ అమ్మవారు శుక్రవారం భక్తులకు నిజరూపంలో దర్శనమిచ్చారు.

జోగుళాంబ నిజరూప దర్శనం
అమ్మవారికి అభిషేకం చేస్తున్న అర్చకులు

- అలంపూర్‌ పుర వీధుల్లో జనసంద్రం

- డప్పుల చప్పుడుతో మారుమోగిన పురం

- కనులపండువగా కల్యాణ మహోత్సవం

- ధ్వజావరోహణంతో ముగిసిన బ్రహ్మోత్సవం

అలంపూర్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి) : జోగుళాంబ గద్వాల జిల్లా, అలంపూర్‌ క్షేత్రంలో జోగుళాంబ అమ్మవారు శుక్రవారం భక్తులకు నిజరూపంలో దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సహస్ర ఘటాభిషేకంలో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు కళశాలతో అమ్మవారి సన్నిధికి తరలివచ్చారు. అంతకు ముందు జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి సేవా సమితి అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌రావు, ప్రధాన కార్యదర్శి ఆనంద్‌ శర్మ హరిశ్చంద్రఘాట్‌లోని గంటలేశ్వర ఆలయం వద్ద కలశాల ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా డప్పుల చప్పుడుతో హేమలాపురం మారుమోగింది. ఏపీలోని ఏలూరు, హైదరాబాదుల నుంచి తరలివచ్చిన కళాకారులు జోగుళాంబ, సుంకులమ్మ, రేణుకా ఎల్లమ్మ, మైసమ్మ, పార్వతీదేవి, పోలేరమ్మ తదితర వేషధారణలో పాల్గొన్నారు. హరితటూరిజం, గాంధీ సర్కిల్‌, పోలీస్‌స్టేషన్‌ మీదుగా ఊరేగింపు ఆలయానికి చేరుకున్నది. అనంతరం అమ్మవారి కుంకుమార్చన మండపంలో 1008 కలశాలకు ప్రత్యేక పూజలు చేసి సహస్ర ఘటాభిషేకం ప్రారంభించారు. భక్తులు తీసుకొచ్చిన పవిత్ర జలం, పంచామృతం, గోక్షీరంతో నిజరూపంలో ఉన్న అమ్మవారికి అభిషేకం చేశారు. ఆ తర్వాత అర్చకులు జోగుళాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి శాంతి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. సాయంత్రం ధ్వజావరోహణతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల నిర్వహణకు సహకరించిన అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఈఓ దీప్తి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

ప్రముఖుల ప్రత్యేక పూజలు

వసంత పంచమిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, ఎంపీ మల్లు రవి, ఎఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌ స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ సరిత, వసనపర్తి జిల్లా న్యాయాధికారి కమలాపురం కవిత, కర్నూలు డిఐజీ కోయ ప్రవీణ్‌ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

Updated Date - Jan 23 , 2026 | 11:32 PM