నీటి తరలింపు ప్రతిపాదన విరమించుకోవాలి
ABN , Publish Date - Oct 27 , 2026 | 11:22 PM
మండలంలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి లగచర్లకు నీటి తరలింపు ప్రతిపాదనను విరమించుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.
- మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
దేవరకద్ర, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి లగచర్లకు నీటి తరలింపు ప్రతిపాదనను విరమించుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని డోకూర్‌లో ఎండిన వరి పంటలను కార్యకర్తలతో కలిసి పరిశీలించి, మాట్లాడారు. గతంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు రెండు పంటలకు సాగునీరు ఇచ్చామని గుర్తు చేశారు. జూరాలకు పై నుంచి వరద వచ్చిన వెంటనే లిప్టులను ప్రారంభించి కోయిల్‌సాగర్‌కు నీరు పంపింగ్ చేసేవారమని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూరాలకు నీరు వచ్చిన 40 రోజుల తర్వాత కోయిల్‌సాగర్‌కు నీటి పంపింగ్ చేశారన్నారు. పాలకుల నిర్లక్ష్యంతో పెద్దవాగులో కృష్ణా జలాలు పారించలేదన్నారు. దీంతో వర్షకాలంలోనే పెద్దవాగు పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు వెనుక నుంచి లగచర్లకు నీటిని తీసుకెళ్లేందుకు సర్వే చేస్తుంటే ఇక్కడి ప్రజాప్రతినిధులు నిద్ర మబ్బులో ఉన్నారన్నారు. వెంటనే నీటి తరలింపు సర్వేను నిలిపివేయాలన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను కరువు మండలంగా ప్రకటించి, పంట ఎండిపోయిన రైతులకు ఎకరాలకు రూ.50 వేల పరిహారం అందజేయాలన్నారు. కౌన్సిలర్ మాధవి, మండల అధ్యక్షుడు నరసింహరెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డి, కొండారెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, ప్రభాకర్‌గౌడ్, చల్మారెడ్డి ఉన్నారు.
ఎమ్మెల్సీ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుందాం
భూత్పూర్ : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నియోజవర్గంలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాన్ని మరోమారు కైవసం చేసుకుందామని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పట్టభద్రులను కోరారు. మంగళవారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో ఆయన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సహ్నక సమావేశానికి ఎన్నికల ఇన్‌చార్జి కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. గ్రామ స్థాయిల్లో ఇంకా నమోదు కాని ఓటర్లను వెంటనే నమోదు చేసుకొనే విధంగా శ్రద్ధ తీసుకోవాలన్నారు. అంతకుముందు మాజీ సర్పంచు ఆల బాలవర్ధన్‌రెడ్డి వర్ధంతి వేడుకల్లో పాల్గొని, ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. సర్పంచు ఆల శ్రీకాంత్‌రెడ్డి, మునిసిపల్ మాజీ చైర్మన్ బస్వరాజుగౌడ్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.