Share News

వీధి కుక్కల బెడద నివారించాలి

ABN , Publish Date - Sep 29 , 2026 | 11:21 PM

గ్రామాల్లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని, వీధి కుక్కుల నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత తమతో పాటు అధికారులపై ఉందని మండలంలోని ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

వీధి కుక్కల బెడద నివారించాలి
మాట్లాడుతున్న ఎంపీవో రాజశేఖర్‌రెడ్డి

- గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి

- మండల ప్రత్యేకాధికారి విష్ణునందన్‌

మిడ్జిల్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని, వీధి కుక్కుల నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత తమతో పాటు అధికారులపై ఉందని మండలంలోని ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశానికి బాదేపల్లి ఏఎంసీ చైౖర్‌పర్సన్‌ జ్యోతిఅల్వాల్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి విష్ణునందన్‌ హజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామాల్లో చేపట్టిన, చేపట్టబోయే అభివృద్ధి పనులను అధికారులు ఏజెండాలో పొందుపర్చిన అంశాలను చదివి వినిపించారు. మిషన్‌ భగీరథ నీరు నిలిపి వేస్తూ సర్పంచులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ప్రజల నుంచి తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని దోనూర్‌ సర్పంచు శ్రీనివాస్‌గౌడ్‌ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అప్పటి అంచనా ప్రకారం తాగునీటి వనరులు ఏర్పాటు చేశారని, ప్రస్తుతం జనాభా పెరుగుతున్న దృష్యా గ్రామాల్లో తాగునీటి వనరులను పెంచుకోవాలని, కొత్త ట్యాంకులను ఏర్పాటు చేయాలని సర్పంచులు ఎడ్ల శంకర్‌, కావలి రాములు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ద్వారా బోధన కార్యక్రమాలు చేపడుతున్నామని విద్యార్థులను క్రమం తప్పకుండా తల్లిదండ్రులు పాఠశాలకు పంపించేలా ప్రజాప్రతినిధులు సహకరించాలని ఎంఈవో వెంకట్రాములు కోరారు. ఓపన్‌ స్కూల్‌ అడ్మిషన్‌లో మిడ్జిల్‌ మండలం మొదటి స్థానంలో ఉందని, పాఠశాలకు కావల్సిన మౌలిక వసతుల గురించి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మండల ప్రత్యేకాధికారి విష్ణునందన్‌ సూచించారు. తాగునీరు వృథా చేయకుండా ట్యాపులు ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపడతారని, అందుకు తగిన విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో లక్ష్మణ్‌రాథోడ్‌, తహసీల్దార్‌ రాఘవేందర్‌రెడ్డి, ఎంపీవో రాజశేఖర్‌రెడ్డి, ఏఈ నరేందర్‌గౌడ్‌, ఏవో సిద్ధార్థ, వెటర్నరీ డాక్టర్‌ అనుప శివరాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2026 | 11:21 PM