Share News

జడ్చర్ల మార్కెట్‌యార్డ్‌ ఫుల్‌!

ABN , Publish Date - May 12 , 2026 | 11:25 PM

బాదేపల్లి పత్తి మార్కెట్‌లో, మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం మొక్కజొన్న సంచులతో నిండిపోయింది.

జడ్చర్ల మార్కెట్‌యార్డ్‌ ఫుల్‌!
బాదేపల్లి కొనుగోలు కేంద్రానికి విక్రయించేందుకు తెచ్చిన మొక్కజొన్న వర్షానికి తడవకుండా టార్పాలిన్‌ కవర్లు కప్పిన రైతులు

- ఆవరణలో 35,737 మొక్కజొన్న బస్తాలు

- రైతులు తెచ్చిన మరో 20 వేల సంచులు

- తాత్కాలికంగా నిలిచిపోయిన కొనుగోళ్లు

జడ్చర్ల, మే 12 (ఆంధ్రజ్యోతి) : బాదేపల్లి పత్తి మార్కెట్‌లో, మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం మొక్కజొన్న సంచులతో నిండిపోయింది. దీంతో కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక్కడ గత నెల 10న ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 72,967 మొక్కజొన్న బస్తాలను (ఒక్కోటి 50 కిలోలు) కొనుగోలు చేశారు. అందులో 37,230 బస్తాలను గోదాములకు తరలించారు. ప్రస్తుతం మార్కెట్‌ ఆవరణలో 35,737 బస్తాలు నిల్వ ఉన్నాయి. వీటితో పాటు రైతులు విక్రయానికి తీసుకొచ్చిన మరో 20వేల బస్తాలు కూడా ఉన్నాయి. దీంతో మార్కెట్‌ మొత్తం మొక్కజొన్న రాశులు, తూకం వేసిన బస్తాలతో నిండిపోయింది. కొనుగోలు చేసిన మొక్కజొన్నను గోదాములకు తరలించే వరకు రైతుదే బాధ్యత కావడంతో వారందరూ నెల రోజులుగా మార్కెట్‌లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొన్నది.

ఆందోళన చేపట్టిన రైతులు

మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేయాలని, బస్తాలను గోదాములకు తరలించాలని రైతులు పలు మార్లు ఆందోళన చేపట్టారు. 167వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వారికి మాజీ మంత్రి డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి మద్దతు పలికి, రైతులతో కలిసి బైఠాయించారు. అనంతరం సమస్య పరిష్కారానికి చొరవ చూపి, నిల్వ ఉన్న బస్తాలను మార్కెట్‌ ఆవరణలోని షెడ్‌లలో డంప్‌ చేయించే ప్రక్రియను చేపట్టారు. అయితే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన సంతోషంలో ఉన్న రైతులపై అదనపు భారం పడుతోంది. క్వింటాలు మొక్కజొన్నను రూ.2,400కు విక్రయించిన రైతులకు ప్రతీ క్వింటాలుపై రూ.100కుపైగా అదనపు భారం పడుతోంది. మొక్కజొన్నలను ట్రాక్టర్లు, లారీల్లో తీసుకొచ్చిన రైతుల నుంచి అన్‌లోడింగ్‌, బస్తాలలో నింపడం, తూకం వేయడం, బస్తాలను కుట్టడం తదితరాలకు 50 కిలోల బస్తాకు రూ.25.70 చొప్పున వసూలు చేస్తున్నారు. హమాలీలు, కూలీల కొరతతో తూకం వేసేందుకు, బస్తాలలో మొక్కజొన్న నింపేందుకు ప్రతి బస్తాకు రూ.10 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. మొక్కజొన్న విక్రయించేందుకు 15 రోజులు, గోదాములకు తరలించేవరకు మరో 15 రోజులు ఇలా దాదాపు నెల రోజుల పాటు రైతులు మార్కెట్‌లోనే గడపాల్సి వస్తోంది.

రైతులపై మరింత భారం

తూకం వేసిన బస్తాలను మార్కెట్‌ ఆవరణలోని షెడ్‌లలో డంపింగ్‌ చేసే ప్రక్రియను ప్రారంభించడంతో రైతులపై మరింత భారం పడింది. ట్రాక్టర్లలో లోడింగ్‌ చేసి, షెడ్‌లో అన్‌లోడ్‌ చేయించే బాఽధ్యత కూడా వారిపైనే పడింది. అందుకు ట్రాక్టర్‌ కిరాయి రూ.1500, లోడింగ్‌కు బస్తాకు రూ.10 చొప్పున చెల్లించాల్సి వస్తోంది. ట్రాక్టర్‌ వెయిటింగ్‌లో ఉంటే అదనంగా మరో రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రతీ బస్తాకు దాదాపు రూ.50కి పైగా, క్వింటాలుకు రూ.100కు పైగా రైతు నెత్తిన భారం పడుతోంది. ప్రస్తుతం కొనుగోలు కేంద్రంలో విక్రయానికి సిద్ధంగా దాదాపు 20 వేల బస్తాలున్నాయి. బస్తాలను షెడ్‌లో డంపింగ్‌ చేపడ్తుండడంతో కేంద్రంలో కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో రైతులు మరిన్ని రోజులు తిప్పలు పడాల్సిన దుస్థితి నెలకొంది.

డంపింగ్‌ పూర్తయ్యాక కొనుగోళ్లు

మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేశాం. ప్రస్తుతం కొనుగోలు చేసిన మొక్కజొన్న బస్తాలను షెడ్‌లో డంప్‌ చేయిస్తున్నాం. గడిచిన రెండు రోజులలో దాదాపు 10 వేల బస్తాలను షెడ్‌కు తరలించాం. మిగతా బస్తాలను డంపింగ్‌ తర్వాత కొనుగోళ్లను మళ్లీ ప్రారంభిస్తాం.

- కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి వెంకటేశ్‌

పడరాని పాట్లు పడుతున్నాం

కొనుగోలు కేంద్రంలో 160 బస్తాల మొక్కజొన్నలను విక్రయించేందుకు పడరాని పాట్లు పడుతున్నాం. మార్కెట్‌లో కుప్పలుగా పోసిన 15 రోజులుకు కొనుగోలు చేశారు. కూలీల కొరత ఉన్నందున బిహార్‌ నుంచి వచ్చిన కూలీలతో బస్తాల్లో మొక్కజొన్న నింపించాం. అందుకోసం బస్తాకు రూ.10 చొప్పున అదనంగా చెల్లించాం. అన్‌లోడ్‌ చేయని వాటికి కూడా హమాలీ చెల్లించాం. ఇలా ప్రతీ 50 కిలోల బస్తాకు రూ.50కిపైగా అదనపు భారం పడుతోంది.

- వెంకట్‌రెడ్డి, రైతు, గొల్లపల్లి

Updated Date - May 12 , 2026 | 11:25 PM