Share News

ఆర్డీఎస్‌కు పెట్టిన ఇండెంట్‌ రేపటితో పూర్తి

ABN , Publish Date - Oct 23 , 2026 | 11:06 PM

తుంగభద్ర డ్యామ్‌ నుంచి దామాషా పద్ధతిలో ఆర్డీఎస్‌కు పెట్టిన ఇండెంట్‌ ఈనెల 25వ తేదీన పూర్తికానున్నది.

 ఆర్డీఎస్‌కు పెట్టిన ఇండెంట్‌   రేపటితో పూర్తి
గురువారం ఆర్డీఎస్‌ ఆనకట్ట వద్ద కాలువలో నీటి ప్రవాహం

- డిస్ట్రిబ్యూటరీ-20 వరకు చేరిన సాగునీరు

- నేడు సుంకేసులకు చేరే అవకాశం

గద్వాల, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర డ్యామ్‌ నుంచి దామాషా పద్ధతిలో ఆర్డీఎస్‌కు పెట్టిన ఇండెంట్‌ ఈనెల 25వ తేదీన పూర్తికానున్నది. తుంగభద్ర డ్యామ్‌లో 94 టీఎంసీల నీటి నిల్వ ఉండగా తెలంగాణకు ఆర్డీఎస్‌ వాటాగా 3 టీఎంసీలు వచ్చింది. దీంతో ఆర్డీఎస్‌ కింద ఖరీఫ్‌లో వరిపంటకు క్రాఫ్‌ హాలిడే ఇచ్చి ఆరుతడి పంటలనే సాగు చేశారు. అయితే, ఇప్పటికే పత్తిపంట చేతికందగా, ఇంకా మిరప ఇతర పంటల సాగు కొనసాగుతున్నది. వీటికి నీటి తడులు అవసరం ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌తో కలిసి ఇండెంట్‌ పెట్టాలని తెలంగాణ ఇరిగేషన్‌ అధికారులు ప్రయత్నించారు. ఉమ్మడి ఇండెంట్‌ పెట్టడానికి ఏపీ అధికారులు నో చెప్పడంతో తప్పని పరిస్థితిలో తెలంగాణ ఈనెల 10 నుంచి 25వ తేదీ వరకు నీటిని విడుదల చేసే విధంగా డ్యామ్‌ అధికారులకు ఇండెంట్‌ ఇచ్చింది. అయితే, 10 నుంచి 15వ తేదీ వరకు 2,600క్యూసెక్కులు విడుదల చేశారు. వీటిలో సింహాభాగం కర్ణాటక రైతులే ఎత్తిపోసుకోవడంతో ఆర్డీఎస్‌ ఆనకట్టకు నీళ్లు రావడానికి ఐదురోజులు పైననే పట్టింది. ఆ తర్వాత 16 నుంచి 20వ తేదీ వరకు 2,400 క్యూసెక్కుల చొప్పున విడుదల చేశారు. ఈ నీళ్లు రావడంతో ఆర్డీఎస్‌ నిండి ఎక్కిపారింది. అదే విధంగా ఆర్డీఎస్‌ తూముల ద్వారా కాలువలకు నీళ్లు వదలడంతో ఈ నీళ్లను కూడా మొదట కర్ణాటక రైతులు పారించుకున్నారు. ఆ తర్వాతనే మన బార్డర్‌కు చేరుకున్నాయి. దాదాపు 4 రోజులుగా ఆర్డీఎస్‌ నీళ్లు డిస్ర్టిబ్యూటరీ-20వ వరకు చేరడంతో రైతులు మిరప ఇతర పంటలకు ప్రాణం పోసినట్లు అయ్యింది. 20 నుంచి 25వ తేదీ వరకు 2వేల క్యూసెక్కుల చొప్పన నీటి విడుదల ప్రస్తుతం కొనసాగుతున్నది. ఇది రేపటి వరకు సాగినా మరో మూడు రోజుల వరకు ఆనకట్ట వద్ద ప్రవాహం ఉంటుంది. అప్పటి వరకు ఆర్డీఎస్‌ కాలువకు నీళ్లు వచ్చినా ప్రవాహ వేగం ఇప్పటికే తగ్గిపోవడంతో పూర్తిస్థాయిలో నీటి పారుదల ఉండకపోవచ్చు. ఇప్పటి వరకు ఆర టీఎంసీ నీటిని కూడా ఆర్డీఎస్‌ రైతులు వినియోగించుకోలేదని లెక్కలు చెబుతున్నాయి.

తుమ్మిళ్ల పంపులు ఆన్‌ అయ్యేనా...!

ఆర్డీఎస్‌ వాటా ఆనకట్టకు చేరడంతో పాటు కట్టనుంచి దిగువకు వెళ్లాయి. ప్రస్తుతం ఇవి తుంగభద్ర నదిలో మాన్‌దొడ్డి సమీపంలో పారుదల ఉన్నట్లు తెలుస్తుంది. నేటి సాయంత్రం వరకు సుంకేసుల డ్యాంకు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం సుంకేసుల డ్యాం 290.5మీటర్ల స్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయి. తుమ్మిళ్ల పంపులు 291మీటర్ల వద్ద ఉన్నప్పుడు ఎత్తిపోసే వీలు ఉంది. ప్రస్తుతం వస్తున్న నీళ్లు ఆర్డీఎస్‌ వాటా(ఇండెంట్‌) పూర్తిగా వినియోగించుకునే హక్కు ఆర్డీఎస్‌ రైతులకు ఉంది. రాజోలి, మానవపాడు మండలాల రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద 3 టీఎంసీల వాటాలో కనీసం ఒక టీఎంసీ నీళ్లు అయినా వినియోగించుకుంటామా లేదా అనేది తుమ్మిళ్ల పంపులు నడిచే రోజులను బట్టి తెలుస్తుంది.

Updated Date - Oct 23 , 2026 | 11:06 PM