Share News

ఆశావహుల పైరవీలు

ABN , Publish Date - Jan 19 , 2026 | 11:10 PM

పురపోరుకు నేడో.. రేపో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉండటంతో పట్టణ రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ఎక్కడ చూసినా డివిజన్‌, వార్డుల రిజర్వేషన్‌లపైనే చర్చ జరుగుతోంది. రిజర్వేషషన్‌లలో అవకాశం కోల్పోయిన నాయకులు చాలామంది సైలెంట్‌ అవగా, రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారు ఇప్పటికే గల్లీల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్ల మద్దతు కోరుతున్నారు.

ఆశావహుల పైరవీలు
మహబూబ్‌నగర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌

టికెట్ల కోసం నాయకుల చుట్టూ ప్రదక్షిణ

ముఖ్యులకు దగ్గరగా ఉన్నవారితో మంతనాలు

పోటీకి డివిజన్లలో చర్చలు

టికెట్‌ ధీమా ఉన్నవారు ప్రచారం షురూ

గెలుపు గుర్రాల కోసం పార్టీల అన్వేషణ

మహబూబ్‌నగర్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): పురపోరుకు నేడో.. రేపో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉండటంతో పట్టణ రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ఎక్కడ చూసినా డివిజన్‌, వార్డుల రిజర్వేషన్‌లపైనే చర్చ జరుగుతోంది. రిజర్వేషషన్‌లలో అవకాశం కోల్పోయిన నాయకులు చాలామంది సైలెంట్‌ అవగా, రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారు ఇప్పటికే గల్లీల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్ల మద్దతు కోరుతున్నారు. పాలమూరు కార్పొరేషన్‌ పరిధిలో 60 డివిజన్‌లు ఉండగా అన్నిచోట్ల రాజకీయ సందడి నెలకొంది. రిజర్వ్‌ స్థానాలలోనే తీవ్ర పోటీ నెలకొంది. టికెట్‌ తమకే వస్తుందనుకున్న నాయకులు ధీమాతో ప్ర చారం మొదలుపెట్టగా, పోటీ ఉన్న చోట మాత్రం ఆయా పార్టీల ముఖ్య నాయకుల అనుగ్రహం కోసం ఆశావహులు తిరుగుతున్నారు. టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీ కార్యాలయాల వద్ద సందడి మొదలైంది. టికెట్‌ కోసం ముఖ్య నాయకులకకు దగ్గరగా ఉన్న వారితో లాబీయింగ్‌ చేస్తున్నారు. అనుకూలంగా ఉన్నవారితో మాట్లాడించి టికెట్‌ వచ్చేలా చేయాలని కోరుతున్నారు. అన్ని డివిజన్‌లలో ఇప్పటికే ప్రచారం షురూ అయింది. కాంగ్రెస్‌ పార్టీలో మైనారిటీలు ఎక్కువగా టికెట్‌ ఆశిస్తున్నారు. మైనారిటీలకు చెందిన డివిజన్‌లు 15-18 వరకు ఉండగా, అక్కడ టికెట్‌ కోసం ఆ వర్గాల్లో గట్టి పోటీనే ఉంది. పార్టీలో ఉన్న ముఖ్య నాయకుల ఆశీస్సుల కోసం ఆశావహులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇన్నాళ్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న నాయకులు కూడా తెరపైకి వచ్చి టికెట్‌ కోసం పైరవీలు సాగిస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉన్న డివిజన్‌లలో అభ్యర్థుల ఎంపిక నాయకులకు తలనొప్పిగా మారుతోంది.

ఎవరు గెలుస్తారు?

పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు కూడా డివిజన్‌ల వారీగా గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు. ఆయా డివిజన్‌లలో ఉన్న సామాజిక వర్గాల బలం, పోటీలో ఉండే అభ్యర్థి సామాజిక వర్గంతోపాటు ఆ వర్గంలో అతనికి ఉన్న ఆదరణను పరిశీలిస్తున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలో ఇప్పటికే సగం డివిజన్‌లకు అభ్యర్థులను ముఖ్య నాయకులు దాదాపుగా ఎంపిక చేసుకోగా, మిగతా సగం డివిజన్‌లలో మాత్రం ఒక్కో డివిజన్‌ నుంచి రెండు, పేర్లు పరిశీలిస్తున్నారు. అందులో ఎవరైతే గెలుస్తారని ద్వితీయ శ్రేణి నాయకులతో సంప్రదింపులు చేస్తున్నారు. పార్టీల నాయకులు కొన్నిచోట్ల డమ్మీలను కూడా బరిలో దించే అవకాశం లేకపోలేదు. అవతలి పార్టీలో తమకు కావలసిన నాయకుడి కోసం తమ పార్టీ నుంచి డమ్మీలను కూడా దించుతున్నారన్న ప్రచారం సాగుతోంది.

Updated Date - Jan 19 , 2026 | 11:10 PM