మహిషాసుర మర్దినిగా అమ్మవారు
ABN , Publish Date - Oct 18 , 2026 | 11:29 PM
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని పలు ఆలయాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు.
మహబూబ్‌నగర్ న్యూటౌన్/భూత్పూర్/బాలానగర్/జడ్చర్ల/ మహబూబ్‌నగర్ రూరల్ /హన్వాడ/చిన్నచింతకుంట/కోయిలకొండ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని పలు ఆలయాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు. వాసవీకన్యకా పరమేశ్వరి ఆలయంలో మహిషాసుర మర్ధినిగా, వీరన్నపేట చౌడేశ్వరి ఆలయంలో దర్గామాతగా దర్శనమిచ్చారు. చౌడేశ్వరి ఆలయంలో 108 కళశాలతో అభిషేకాలు నిర్వహించారు. రేణుక ఎల్లమ్మ ఆలయం, పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భూత్పూర్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. మునిసిపాలిటీలోని 10వ వార్డు ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అమ్మవారి వద్ద సామూహిక మహా చండీహోమం నిర్వహించారు. బాలానగర్ మండలం గౌతాపూర్‌లో అమ్మవారిని బాలాత్రిపురసుందరీ దేవిగా అలంకరించారు. జడ్చర్ల వాసవీకన్యకాపరమేశ్వరీ ఆలయంలో అమ్మవారు మహిషాసురమర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలం ధర్మాపూర్, ఫత్తేపూర్, కోడూర్, మణికొండ, గాజులపేట, కోటకదిర, జిమిస్తాపూర్, ఇప్పలపల్లి గ్రామాలతో పాటు హన్వాడ మండలం కిష్టంపల్లిలో అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. చిన్నచింతకుంట మండల కేంద్రంలోని గంగాభవాని అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన దర్గామాతను మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు శాంతికుమార్, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, నంబిరాజు, జిల్లా నాయకుడు కుర్వ రమేష్, మండల అధ్యక్షుడు దశరత్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోయిలకొండ మండలంలోని ఆయా గ్రామాల్లో దుర్గామాత మంటపాల్లో మహిళలు కుంకుమార్చన నిర్వహించారు.