మహిళలను అక్ష్యరాస్యులను చేయడమే లక్ష్యం
ABN , Publish Date - Sep 27 , 2026 | 11:29 PM
మహిళా సంఘాల్లోని నిరక్షరాస్యులైన వయోజన మహిళలను అక్ష్యరాస్యులుగా మార్చడమే ‘అమ్మకు అక్షరమాల, ఉల్లాస్’ కార్యక్రమాల లక్ష్యమని ఉల్లాస్ జోగుళాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ బీకే వెంకటేశ్వర్లు అన్నారు.
ఉల్లాస్ జోగుళాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు
గద్వాల టౌన్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మహిళా సంఘాల్లోని నిరక్షరాస్యులైన వయోజన మహిళలను అక్ష్యరాస్యులుగా మార్చడమే ‘అమ్మకు అక్షరమాల, ఉల్లాస్’ కార్యక్రమాల లక్ష్యమని ఉల్లాస్ జోగుళాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ బీకే వెంకటేశ్వర్లు అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని మునిసిపల్ కార్యాలయంలో నిరక్ష రాస్యులైన మహిళా సంఘాల సభ్యులకు అక్షరాభ్యాసం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకటేశ్వర్లు, మహిళా సంఘాల్లో అత్యధిక శాతం సభ్యులకు కేవలం సంతకం చేయడం మాత్రమే రావడం, మరికొంత మంది వేలిముద్రలు వేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందన్నారు. ఈ క్రమంలో ప్రతీ మహిళను అక్షరాస్యులుగా మార్చడంతో పాటు, మలి దశలో మధ్యలో బడి మానేసిన వారిని గుర్తించి ఓపెన్ స్కూల్ ద్వారా నేరుగా పదో తరగతితో పాటు వారి ఆసక్తి మేరకు ఓపెన్ డిగ్రీ వరకు విద్యను అందించే కార్యక్రమం ఉంటుందన్నారు. విద్యావంతులుగా మారిన మహిళలకు వారి నైపుణ్యం ఆధారంగా స్కిల్ డెవలప్‌మెంట్, టెక్నికల్ కోర్సులు నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ‘ఉల్లాస్’ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. దీంతోపాటు బ్యాంకింగ్ రంగంలో ఆర్థిక క్రమశిక్షణ, పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలపై శిక్షణ ఇస్తారన్నారు. కార్యక్రమంలో మెప్మా సిబ్బంది జి.వెంకటేశ్వర్లు, ఏడీఎంసీ తిమ్మన్న, మహాలక్ష్మి, రిసోర్స్‌పర్సన్లు ఉన్నారు.