ఇసుక రీచ్‌పై పోరు
ABN , Publish Date - Jan 02 , 2026 | 11:14 PM
నాగర్‌కర్నూల్ జిల్లా, తాడూరు మండలంలోని ఎట్టిధార్‌పల్లి గ్రామ సమీపంలోని దుందుభీ నది వద్ద ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ రద్దు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
- రద్దు చేయాలని ఎట్టిధార్‌పల్లి గ్రామస్థుల డిమాండ్
- భూగర్భ జలం అడుగంటుతుందని ఆందోళన
- కలెక్టర్, ఎమ్మార్వోలకు రైతుల వినతులు
తాడూరు, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్ జిల్లా, తాడూరు మండలంలోని ఎట్టిధార్‌పల్లి గ్రామ సమీపంలోని దుందుభీ నది వద్ద ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ రద్దు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. రీచ్ పేరుతో నది నుంచి ఇసుకను తరలిస్తే భూగర్భ జలం అడుగంటుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మన ఇసుక - మన వాహనం’లో భాగంగా గ్రామంలోని దుందుభీ నది వద్ద మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేసింది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి నది నుంచి ఇసుకను రవాణా చేస్తున్నారు. దీంతో నదిలో ఇసుక ఖాళీ అవుతుండటంతో భూగర్భ జలం తగ్గిపోయి, సాగు చేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు మళ్లీ వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇసుక రీచ్‌ను రద్దు చేయాలని కోరుతూ ఇటీవల నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్‌కు వినతి పత్రం ఇచ్చారు. తహసీల్దార్ రామకృష్ణయ్యను కలిసి సమస్యను వివరించారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డిల దృష్టికి సమస్యను తీసుకెళ్లి రీచ్ రద్దుకు ప్రయత్నిస్తామని గ్రామస్థులు చెప్తున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. గత రెండు, మూడు రోజులుగా పోలీసు బందోబస్తు మధ్య ఇసుక రవాణాను కొనసాగిస్తున్నారు. ఇలా రీచ్ పేరుతో ఇసుకను తరలిస్తే నది నీటినే నమ్ముకొని జీవిస్తున్న తమ పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది కూడా ఇసుక రవాణాకు వ్యతిరేకంగా గ్రామస్థులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో ఇసుక తరలింపును నిలిపివేశారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎవరైనా ఇసుక తరలింపును అడ్డుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీంతో తమ ఆవేదనను అర్థం చేసుకొని, ఇసుక రీచ్‌ను రద్దు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
రీచ్‌ను రద్దు చేయాలి
ప్రభుత్వం స్పందించి ఇసుక రీచ్‌ను రద్దు చేయాలి. లేకపోతే గ్రామ రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉంది. స్థానిక రతులందరూ భూగర్భ జలంపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఇసుకను తరలిస్తే రైతులు, రైతు కూలీల జీవితాలు అధ్వాన్నంగా మారే పరిస్థితి ఉంది.
- అర్జున్, ఎట్టిధార్‌పల్లి
ఇసుక పోతే వలసలే దిక్కు
నదిలో ఇసుక లేకపోతే భూగర్భ జలాలు అడుగంటుతాయి. దీంతో పంటల సాగుకు అవకాశం లేక అందరమూ వలస వెళ్తే పరిస్థితి నెలకొంటుంది. ఈ విషయంపై కలెక్టర్, ప్రజాప్రతినిధులు స్పందించి, ఎట్టిధార్‌పల్లి ఇసుక రీచ్‌ను రద్దు చేయాలి. పోలీసు బందోబస్తు మధ్య ఇసుకను తరలిస్తుంటే బాధగా ఉంది.
- శేఖర్‌గౌడ్, ఎట్టిధార్‌పల్లి
ఇసుక లేకపోతే బతుకుదెరువు లేదు
దుందుభి నదిలో ఇసుక లేకపోతే భూగర్భ జలాలు ఉండవు. అవి లేకపోతే వ్యవసాయం చేయడం కష్టం. రైతులు, రైతు కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ పెద్దలు, అధికారులు సానుకూలంగా స్పందించి ఇసుక రీచ్‌ను రద్దు చేస్తే బాగుంటుంది.
- మనోహర్‌రెడ్డి, మాజీ సర్పంచ్