అన్నదాత.. అవస్థ..!
ABN , Publish Date - Jun 30 , 2026 | 11:33 PM
ఆరుగాలం శ్రమించి పంటలు పండించే అన్నదాతలు మొన్నటివరకు ధాన్యం అమ్ముకోవడానికి కల్లాల వద్ద పడిగాపులు కాస్తే... ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిన యూరియా యాప్‌ను ఉపయోగించి బస్తాలు బుకింగ్ చేసుకునేందుకు అవస్థలు పడుతున్నారు.
- మొన్నటివరకు ధాన్యం అమ్మకాలకు..
- నేడు యూరియా కోసం తప్పని తిప్పలు
- ఫర్టిలైజర్ యాప్ అర్థంకాక ఇబ్బందులు
- యూరియా స్టాక్ ఉన్నా.. రెండు బస్తాల సీలింగ్
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఆరుగాలం శ్రమించి పంటలు పండించే అన్నదాతలు మొన్నటివరకు ధాన్యం అమ్ముకోవడానికి కల్లాల వద్ద పడిగాపులు కాస్తే... ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిన యూరియా యాప్‌ను ఉపయోగించి బస్తాలు బుకింగ్ చేసుకునేందుకు అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారు. వారిలో కనీసం ఫోన్ వాడటం తెలియని వారి సంఖ్య, స్మార్ట్ ఫోన్ లేనివారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంటుంది. కానీ వారికి అవగాహన కల్పించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా యాప్‌ను రైతులపై రుద్దడం వల్ల దాన్ని ఉపయోగించడం రాక.. ప్రతీసారి ఇతరులను అడగలేక... తెలిసిన వారి ఇళ్లకు తిరుగుతున్నారు. తీరా బుకింగ్ చేసుకునేలోపే దుకాణాల్లో స్టాక్ అయిపోతుండటంతో మళ్లీ బాధలు తప్పడం లేదు. బుకింగ్ చేసుకోవడం ఒక ఎత్తయితే.. సీలింగ్ పెట్టడంతో ఎరువులు సరిపోక ఇబ్బందులు పడటం కూడా రైతుల వంతే అవుతోంది. గత సీజన్‌లోనే నామమాత్రంగా ఫెర్టిలైజర్ యాప్ ద్వారా ఎరువులు అందజేసినా.. ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో దానినే వినియోగిస్తున్నారు. కొంత అవగాహన ఉన్న రైతులు, డీలర్లతో పరిచయాలు ఉన్నవారు నెట్టుకొస్తుండగా.. నిరుపేద రైతులకే కష్టకాలం వచ్చిందని చెప్పవచ్చు.
రెండు బస్తాల వరకే సీలింగ్
ప్రస్తుతం ఫెర్టిలైజర్ యాప్‌లో యూరియా విషయంలో రెండు బస్తాల వరకే సీలింగ్ ఉంది. ఎకరాకు ఒక్కోసారి ఒక్కో బస్తా యూరియా అందుతుంది. ఇలా రెండు సార్లు 15 రోజుల వ్యవధి తర్వాత ఇస్తారు. అంటే ఎకరాకు 2 బస్తాల యూరియా మాత్రమే అందుతుంది. పత్తిలాంటి పంటలకు ఇంత మోతాదు యూరియా దాదాపు సరిపోతుంది. కానీ మొక్కజొన్నకు 3 బస్తాలు, వరికి నాలుగు బస్తాల యూరియా అవసరం. పంటలను బట్టి యూరియా ఇస్తామని చెబుతున్నప్పటికీ ఆ విధమైన ఏర్పాట్లు కనిపించడం లేదు. దీనివల్ల రైతులకు యూరియా సరిపోక ఇబ్బందులు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కౌలు రైతులకు ఎరువులు కావాలంటే.. ప్రతీసారి పట్టాదారుకు ఓటీపీ కోసం ఫోన్లు చేయడం లేదా ఇంటికి వెళ్లి రావడం పరిపాటిగా మారింది. సదరు పట్టాదారు ఊర్లో ఉంటే పర్వాలేదు కానీ చాలామంది పట్టణాల్లో సెటిల్ అయ్యి.. ఊర్లలో కౌలుకు ఇస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మరింత ఇబ్బంది అవుతోంది. యూరియా వాడకం తగ్గించడానికి ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నం చేస్తోందని అధికారిక వర్గాలు చెబుతుండగా.. కొరత లేదని చూపేందుకు యాప్ ఒక ఎత్తుగడ అని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా యూరియా విషయంలోనే రైతులు ఇబ్బందులు పడుతుండగా.. ఇప్పటికే ఏంఓపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరగడంతో అవి కూడా ఆర్థికంగా నడ్డి విరిచే అవకాశం కనిపిస్తోంది.
ఆయినవారికి ఆకుల్లో...
ప్రస్తుతం అమలు చేస్తున్న యాప్ విధానం కూడా పెద్ద రైతులకు పరోక్షంగా మేలు చేసేలా ఉంది. స్టాక్ అందుబాటులో ఉన్నా.. జిల్లా అంతటా వాటిని సరఫరా చేయకుండా అవసరాన్ని బట్టి, సదరు ఏరియాలో సాగును, పంటలను బట్టి దుకాణాలకు సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే కొద్దికొద్దిగా స్టాక్ చేయడం వల్ల సీజన్ డిమాండ్ సమయంలో కేవలం పెద్ద రైతులే ముందస్తుగా ఎరువులు పొందుతున్నారు. ఉదాహరణకు ఒక దుకాణానికి 200 బస్తాల స్టాక్ వచ్చిందంటే వెంటనే సదరు డీలర్ తన దగ్గర ఇతర ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు కొనే రైతులకు ముందస్తుగానే సమాచారం అందిస్తారు. కొన్నిసార్లు ఎప్పుడు స్టాక్ వస్తుందో కూడా చెప్పేస్తున్నారు. వారు వెంటనే యాప్‌లో బస్తాలు బుక్ చేస్తారు. ఆ తర్వాతి రోజో లేదా మరో సమయంలోనో ఏఓలు, ఏఈఓలు ఆయా ఊర్ల వాట్సప్ గ్రూప్‌ల్లో స్టాక్ వివరాలు పోస్ట్ చేస్తారు. కానీ చదువుకున్నవారు, డీలర్లకు అయిన వాళ్లు అప్పటికే బుకింగ్ చేసుకుని ఉంటారు. యాప్‌పై అవగాహన లేనివారు.. కౌలు రైతులకు మాత్రం ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. స్టాక్ ఉన్న విషయం యాప్‌లో చెక్ చేసుకోవడమో లేదా ఎవరైనా చెప్పడం ద్వారానే తెలుస్తోంది. ఈ రెండు జరగకపోతే రోజుల తరబడి నిరీక్షించక తప్పడం లేదు. యాప్‌లో ఉండే కష్టాలు, అవంతరాలపై ఒక సమీక్ష నిర్వహించి సరళంగా మార్చడమో లేదా అవగాహన లేనివారికి బుకింగ్ కోసం ఒక ప్రత్యేక ఫోన్ నెంబర్‌లాంటిది ఇవ్వడమో చేస్తే బాగుంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
అవసరం కన్నా తక్కువ నిల్వలు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రస్తుతం అవసరం కన్నా చాలా తక్కువ మోతాదులో నిల్వలు ఉన్నాయి. యూరియా 1,50,902 మెట్రిక్ టన్నుల అవసరం ఉండగా.. అందులో మూడింట ఒకటో వంతు కంటే తక్కువగా 45,819 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయి. డీఏపీ 44911 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా.. అత్యంత కనిష్ట స్థాయిలో కేవలం 1634 మెట్రిక్ టన్నుల నిల్వ మాత్రమే ఉంది. ఎంఓపీ 31251 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటే 4041 మెట్రిక్ టన్నులు, డీఏపీ 1,27,085 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటే 58,918 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయి. అవసరానికి తగ్గట్లుగా యూరియా, డీఏపీ నిల్వలు రాకపోతే రైతులు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది.
పాత పద్ధతే పాటించాలి
దశాబ్దాల కాలం నుంచి ఎరువుల దుకాణంలో నేరుగా కొనుగోలు చేసేవాళ్లం. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే బుకింగ్ చేసుకోవాలని అధికారులు అంటున్నారు. స్మార్ట్ ఫోన్ లేక, ఉన్నా ఎలా బుకింగ్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నాం. నాతోపాటు చాలామంది రైతులకు అవస్థలు తప్పడం లేదు. తక్షణమే ప్రభుత్వం కొత్త పద్ధతిని నిలిపివేసి.. పాత పద్ధతి ప్రకారమే ఎరువులు అమ్మాలి.
- రాయుడు, రైతు, మూలమల్ల, ఆత్మకూరు
చిన్న ఫోన్ ఉంది
నేను ఈ ఏడు పదెకరాలు కౌలుకు తీసుకున్నాను. అందులో వరి ఆరు ఎకరాలు, మిగతా భూమిలో మొక్కజొన్న సాగుచేసేందుకు భూమిని సిద్ధం చేసి ఉంచాను. గతంలో ఆవసరం ఉన్నన్ని యూరియా బస్తాలను షాపుకెళ్లి తెచ్చుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ఎదో యాప్ పెట్టారట. యురియా కోసం యాప్‌ను సందర్శిస్తే భూ యాజమానికి ఓటీపీ వెళ్తుంది. ఆ సమయంలో ఆయన ఫోన్ తీయకపోయినా ఇబ్బందే. పైగా నాకు భూమి కౌలుకు వేసిన యాజమాని వేరే ప్రాంతంలో ఉంటాడు.
- నరసింహులు, కౌలు రైతు, సుల్తానాపూర్, అలంపూర్
ఉమ్మడి జిల్లాలో వానాకాలం సీజన్‌కు ఎరువుల అవసరం, నిల్వ వివరాలు (మెట్రిక్ టన్నుల్లో)...:
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జిల్లా యూరియా అవసరం నిల్వ డీఏపీ అవసరం నిల్వ ఎంఓపీ అవసరం నిల్వ కాంప్లెక్స్ అవసరం నిల్వ
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మహబూబ్‌నగర్ 23196 8984 4802 309 16950 1987 21188 14830
వనపర్తి 29855 8062 4842 157 1796 457 18411 7683
నాగర్‌కర్నూలు 51148 9877 12354 112 1059 405 19428 8234
నారాయణపేట 27703 7016 18113 530 7846 357 32058 8006
గద్వాల 19000 11880 4800 526 3600 835 36000 20165
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మొత్తం 150902 45819 44911 1634 31251 4041 127085 5 8918