Share News

వీడనున్న గ్రహణం

ABN , Publish Date - Mar 15 , 2026 | 11:29 PM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ ఏర్పాటు చేసిన 167వ జాతీయ రహదారి నిర్మాణంలో ఏర్పడిన పనులకు ఎట్టకేలకు గ్రహణం వీడనుంది.

వీడనున్న గ్రహణం
జడ్చర్ల పట్టణంలో తొలగించాల్సిన పాత బ్రిడ్జి

- ప్రారంభం కానున్న నూతన బ్రిడ్జి నిర్మాణం పనులు

- జడ్చర్ల సిగ్నల్‌గడ్డ ప్రాంతంలో పాత బ్రిడ్జిని తొలగించే పనులు ప్రారంభం

జడ్చర్ల, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ ఏర్పాటు చేసిన 167వ జాతీయ రహదారి నిర్మాణంలో ఏర్పడిన పనులకు ఎట్టకేలకు గ్రహణం వీడనుంది. మూడు రాష్ట్రాలకు కేంద్ర బిందువుగా పట్టణంలోని సిగ్నల్‌గడ్డ ప్రాంతంలో పాత బ్రిడ్జి స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన పనులను ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ప్రారంభించారు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మునిసిపాలిటీలోని ఎల్‌ఐసీ కార్యాలయం నుంచి సాయినగర్‌కాలనీ వరకు సుమారు 1.5 కిలో మీటర్ల మేర రోడ్డు వెడల్పుతో పాటు అంబేడ్కర్‌, నెహ్రూ చౌరస్తాలు, పాత బ్రిడ్జి స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టాల్సి ఉంది. కాగా ఈ పనులు నత్తనడకన సాగడం, బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే శాఖ నుంచి అనుమతులు రావల్సి ఉండడంతో పట్టణ ప్రజలు పలు సందర్భాల్లో అసహనం వ్యక్తం చేయడం, ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన సందర్భాలున్నాయి. జాతీయ రహదారి నాలుగు లేన్ల రోడ్డులో భాగంగా రెండు లేన్లతో కూడిన నూతన బ్రిడ్జి నిర్మాణం పూర్తికాగా, మరో రెండు లేన్లతో పాత బ్రిడ్జి స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటే రైల్వేలైను ఉన్న కారణంగా రైల్వేశాఖ నుంచి అనుమతులు తప్పనిసరి. అందుకు సంబంశొంచి ప్రక్రియ దాదాపుగా పూర్తి కావచ్చింది. అందుకు సంబంధించి రైల్వేశాఖ నుంచి రెండు, మూడు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులను జారీ చేయనున్నారు. అందులో భాగంగా రైల్వేశాఖలోని బ్రిడ్జి నిర్మాణాల విభాగానికి సంబంధించి సీనియర్‌ సెక్షనల్‌ ఇంజనీరింగ్‌ (ఎస్‌ఎస్‌ఈ) బృందం పరిశీలించారు. ఉత్తర్వులు వచ్చేలోపు నూతన బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ముందస్తు పనులను ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ప్రారంభించారు. అందులో భాగంగా పాత బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేసారు. బ్రిడ్జిపై ఉన్న బీటీని తొలగించే పనులు చేపడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణంలో రోడ్డు ఊష్ణోగ్రత మార్పులతో వ్యాకోచం, సంకోచం, కదలికలను తట్టుకోవడానికి చేపట్టాల్సిన ముందస్తు చర్యలను చేపట్టారు. బ్రిడ్జి నిర్మాణానికి రైల్వేశాఖ నుంచి ప్రతీ రోజు కేవలం గంట నుంచి రెండు గంటలు మాత్రమే పనులకు చేపట్టేందుకు అమనుతులు ఇవ్వనున్నారు. నిత్యం రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడకుండా, విద్యుత్‌లైన్‌తో ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ఉండేలా అనుమతులు జారీ చేసేందుకు రైల్వేశాఖ అధికారులు ప్రస్తుతం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు.

Updated Date - Mar 15 , 2026 | 11:29 PM