Share News

‘డంపింగ్‌’ డైలమా..!

ABN , Publish Date - Oct 19 , 2026 | 11:20 PM

పాలమూరు కార్పొరేషన్‌లో డంపింగ్‌యార్డ్‌ సమస్య కొలిక్కిరావడం లేదు.

‘డంపింగ్‌’ డైలమా..!
పాలమూరు కార్పొరేషన్‌ పరిధిలోని డంపింగ్‌యార్డ్‌

- ప్రస్తుతం ఉన్న యార్డ్‌ను మార్చేందుకు విఫలయత్నం

- మూడు చోట్ల స్థలాన్ని పరిశీలించినా ఫలితం శూన్యం

- ఉన్న చోటే యంత్రాల ఏర్పాటుకు అధికారుల నిర్ణయం

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : పాలమూరు కార్పొరేషన్‌లో డంపింగ్‌యార్డ్‌ సమస్య కొలిక్కిరావడం లేదు. అందుకోసం చేస్తున్న ప్రయత్నాలేవీ ఆశించిన ఫలితాలివ్వడం లేదు. రెండు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా డంపింగ్‌ యార్డ్‌ వ్యవహారం డైలమాలో పడింది. ఇటీవల నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశంలో పుణె మోడల్‌లో యత్రాలను ఏర్పాటుచేసి ‘డైలీ జీరో’ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. అందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినా, సానుకూల పరిస్థితులు లేకపోవడంతో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. పాలమూరు మునిసిపాలిటీ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ అయినా, అందుకు తగిన శానిటేషన్‌ సిబ్బందిని పెంచకపోవడం, యంత్రాలు, వాహనాలు ఏర్పాటు చేయకపోవడం సమస్యగా మారింది. కార్పొరేషన్‌ స్థాయిలో ఆదాయాన్ని పెంచుకోవడంపై కూడా అధికార యంత్రాంగం దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి.

ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు

కోయిలకొండ ఎక్స్‌రోడ్‌ సమీపంలో ప్రస్తుతం ఉన్న 25 ఎకరాల్లో ఉన్న డంపిగ్‌ యార్డును రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేశారు. ఇక్కడ తడి, పొడి చెత్తను వేరుచేయడం (సెగ్రిగేషన్‌) ఆశించిన స్థాయిలో జరగకపోవడం, బయో మైనింగ్‌ (డంపింగ్‌ యార్డులో తవ్వకాలు జరిపి చెత్త రీసైక్లింగ్‌, వ్యర్థాలను శుభ్రం చేయడం) యంత్రాలు లేకపోవడంతో రోజురోజుకూ చెత్త గుట్టలా పేరుకుపోతోంది. వాటిని తగులబెట్టినప్పుడు చుట్టుపక్కల కాలనీల్లో పొగ అలుముకొని తీవ్ర సమస్య ఎదురవుతోంది. దీంతో స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్‌యార్డును మార్చాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రయత్నాలు విఫలం

కొత్త డంపింగ్‌ యార్డు ఏర్పాటుకు కార్పొరేషన్‌ పరిధిలో మూడు చోట్ల స్థలాలను పరిశీలించారు. మహబూబ్‌నగర్‌ - భూత్పూర్‌ మధ్య హస్నాపూర్‌ వద్ద స్థలాన్ని పరిశీలించారు. కానీ, నియోజకవర్గం మారుతుండటంతో అభ్యంతరాలు వస్తాయని భావించిన అధికార యంత్రాంగం ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నది. తర్వాత చిన్నదర్పల్లి శివారులో 20 ఎకరాల స్థలాన్ని పరిశీలించి కలెక్టర్‌ అనుమతి కోసం ఫైల్‌ పంపించారు. ఆ స్థలం సమీపంలో కొత్తచెరువు ఉండటంతో నీరు కలుషితం అవుతుందని భావించడంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. చివరకు 11వ డివిజన్‌ శివారులో 40 ఎకరాల స్థలం ఉన్నదని, అక్కడ అవసరమైన యంత్రాలు ఏర్పాటు చేసి, ఏ రోజు సేకరించిన చెత్తను ఆ రోజే శుభ్రం చేసే ప్రక్రియ (జీరో డైలీ)ని అమలు చేయాలి నిర్ణయించారు. ఈ విధానాన్ని అమలుచేస్తున్న పుణెకు అధికారులు, కౌన్సిల్‌ సభ్యులు వెళ్ళి పరిశీలించారు. ఆ విధానాన్ని ఇక్కడా అమలు చేయాలని జూలై 8న జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయించారు. కానీ డంపింగ్‌యార్డ్‌ ఏర్పాటుకు కాలనీవాసుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అలాగే మౌలాలి గుట్టలో 10 ఎకరాల స్థలం ఉన్నా, రవాణాకు ఇబ్బందిగా మారుతుందని యంత్రాంగం భావిస్తోంది.

సమస్యగా స్థల సేకరణ

డంపింగ్‌యార్డ్‌ మార్పునకు స్థల సేకరణే ప్రధాన సమస్యగా మారడంతో ప్రస్తుత డంపింగ్‌యార్డ్‌లోనే యంత్రాలను ఏర్పాటుచేసి సెగ్రిగేషన్‌ చేయాలని యోచిస్తున్నారు. త్వరలోనే బయో మైనింగ్‌ ఏర్పాటు చేసి చెత్తను ఏ రోజుకారోజు సెగ్రిగేషన్‌ చేయాలని నిర్ణయించారు. కార్పొరేషన్‌ పరిధిలో ప్రతీ రోజు 110 మెట్రిక్‌ టన్నుల వరకు చెత్త ఉత్పత్తి అవుతుంది. సెగ్రిగేషన్‌ చేయకపోతే ప్రస్తుతం ఉన్న యార్డ్‌ సరిపోయే పరిస్థితి లేదు. ప్రతీ రోజు ఎక్స్‌కవేటర్‌తో చెత్తను నెట్టివేస్తున్నా అది ముందుకు వస్తోంది. సమస్య పరిష్కారానికి బయోమైనింగ్‌ ద్వారా ‘డైలీ జీరో’ విధానం అమలు చేయడమే మార్గం. లేకుండా డంపింగ్‌ యార్డ్‌ సమస్య పాలమూరు కార్పొరేషన్‌కు మరింత తలనొప్పిగా మారనున్నది.

Updated Date - Oct 19 , 2026 | 11:20 PM