Share News

నిందితులను కఠినంగా శిక్షించాలి

ABN , Publish Date - Aug 10 , 2026 | 11:49 PM

వైద్య విద్యార్థిని ప్రియాంక మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్‌ చేశారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి

- పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

- వైద్య విద్యార్థిని ప్రియాంక అంతిమయాత్రకు హాజరు

అయిజ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి) : వైద్య విద్యార్థిని ప్రియాంక మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్‌ చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా, అయిజ పట్టణంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన ప్రియాంక అంతిమయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో జరిగిన ఈ సంఘటన అత్యంత దుర్మార్గమైనదన్నారు. ఇది ప్రమాదం కాదని, ప్రణాళికాబద్ధంగా చేసిన హత్య అని విమర్శించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. ఈ విషయంపై ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునా యుడుతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ఇలాంటి సంఘటనలు మరోమారు జరుగకుండా కఠినమైన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అంత్యక్రియలు పూర్తయిన అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. అనంతరం గద్వాల ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ మాట్లాడారు.

బాధిత కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం : ఆంధ్రప్రదేశ్‌ మంత్రి టీజీ భరత్‌

అయిజ (ఆంధ్రజ్యోతి) : వైద్య విద్యార్థిని ప్రియాంక అంతిమయాత్రలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తరపున వాణిజ్య, ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్‌ పాల్గొన్నారు. ఎక్లాస్‌పూర్‌లో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి రూ. 20 లక్షల పరిహారం అందించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజల పక్షాన, న్యాయం వైపు నిలబడతారని తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో ప్రియాంక చికిత్సకు అయిన ఖర్చులను సైతం భరిస్తామని చెప్పారు. దీంతో పాటు ప్రియాంక కళాశాల ఫీజు ఖర్చులను కూడా తిరిగి చెల్లిస్తామని తెలిపారు. బాధిత కుటుంబానికి తోడుగా ఉంటామని, ఎలాంటి కష్టమూ రాకుండా చూసుకుంటామని తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

Updated Date - Aug 10 , 2026 | 11:49 PM