రాజ్యాంగాన్ని ఖననం చేశారు
ABN , Publish Date - Feb 25 , 2026 | 11:22 PM
పశువులు సైతం సిగ్గు పడేలా కాళ్లతో తన్ని పసిపాపతో పాటు భారత రాజ్యాంగాన్ని ఖననం చేశారని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరిశంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
- తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్
- కుమ్మెర బాధితుల దీక్షకు మద్దతు తెలిపిన ప్రజా సంఘాల నాయకులు
నాగర్‌కర్నూల్ టౌన్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి) : పశువులు సైతం సిగ్గు పడేలా కాళ్లతో తన్ని పసిపాపతో పాటు భారత రాజ్యాంగాన్ని ఖననం చేశారని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరిశంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో కొమ్మెర బాధితులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించారు. బాధితులను పరామర్శించి, వారి ఆందోళనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల దురహంకారంతో ఆధిపత్య పెత్తందారి తనాన్ని కూకటివేళ్లతో పెకలించేందుకు సాహిత్యరంగాన్ని సమాయత్తం చేస్తామన్నారు. కార్యక్రమంలో కవులు వనపట్ల సుబ్బయ్య, ఎదిరెపల్లి కాశన్న, రచయిత రమేశ్‌బాబు, వహీద్‌ఖాన్, కల్వకోలు మద్దిలేటి, పార్థసారథి, క్రాంతి పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి
కుమ్మెర ఘటనలో పసిపాప మరణానికి కారణమైన వారికి కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి డిమాండ్ చేశారు. కుమ్మెర బాధిత కుటంబం చేపట్టిన దీక్షా శిబిరాన్ని వేదిక సభ్యులు బుధవారం సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాఘవాచారి మాట్లాడుతూ కులం కారణంగా అవమానానికి గురైన వారి కోసం పాలకులు, పార్టీల దగ్గర ఏం ఎజెండా ఉందని ప్రశ్నించారు. అణగారిన వర్గాలపై దాడులు చేస్తే ప్రశ్నించే గొంతుకలు వస్తూనే ఉంటాయన్నారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ వెంకట్‌గౌడ్, అచ్చంపేట, కల్వకుర్తి కన్వీనర్లు లక్ష్మీనారాయణ, అశోక్, సభ్యులు శ్రీను, మల్లేశ్ పాల్గొన్నారు.