పాలమూరుకు పట్టిన శని కాంగ్రెస్
ABN , Publish Date - Oct 14 , 2026 | 11:56 PM
ఉమ్మడి పాలమూరు జిల్లాకు పట్టిన శని కాంగ్రెస్ పార్టీ అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
- రేవంత్ వదిలిండు చంద్రబాబు ఒడిసి పడుతున్నడు
- మళ్లీ వలసలు ప్రారంభం, రేవంత్‌రెడ్డి పాలన వైఫల్యం
- రోడ్డు ప్రమాద బాధిత దళిత కుటుంబాల పరామర్శలో మాజీ మంత్రి హరీశ్‌రావు
గట్టు, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి పాలమూరు జిల్లాకు పట్టిన శని కాంగ్రెస్ పార్టీ అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పాల మూరు బిడ్డను అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరు ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇటీవల జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని ఇందువాసి గ్రామానికి చెందిన వలస కూలీలు కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. బుధవారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిలతో కలిసి ఇందువాసికి వెళ్లిన ఆయన బాధిత కుటుంబ సభ్యులను పరామర్షించారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. మృతి చెందన నాగన్న, ఏసేపు కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం అందిం చారు. అనంత రం ఆయన విలేకరులతో మా ట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. బడా కాంట్రాక్టర్ల బిల్లులకు, ఫ్యూచర్ సిటీకి, మూసికి, ఢిల్లీకి కప్పం కట్టడానికి వేల కోట్లుం టాయి.. కానీ, దళిత, గిరిజన బలహీన వర్గాల కూలీలకు రూ. 12,000 ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావడం లేదా అని ప్రశ్నించారు. ఆనాడు కేసీఆర్ పాలమూరు జిల్లాలో రూ. 4 వేల కోట్లతో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 10 లక్షల ఎకరాలకు సాగునీరు, 24 గంటల కరెంటు ఇచ్చి వలసలను వాపస్ తెచ్చారన్నా రు. రేవంత్‌రెడ్డి తన చేతకాని తనంతో పాలమూరు బిడ్డలను మళ్లీ వలసల పాలు చేశారన్నారు. రేవంత్ తెచ్చిన జీవో నంబర్ 17 రైతులకు 2 గంటల ఉచిత కరెంటుకు ఉరితాడని అన్నారు. మన నీళ్లను రేవంత్ రెడ్డి వదిలిండు, చంద్రబాబు 700 కిలోమీటర్లు తీసుకువెళ్లి ఒడిసి పడుతున్నడని బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి టీ. హరీశ్‌రావు విమర్శించారు. సోలార్ విద్యుత్ పేరుతో రైతులకు పగటి పూట కేవలం 6-7 గంటల కరెంటుకే పరిమితం చేస్తూ శాశ్వతంగా రాత్రి కరెంటును ఎగొట్టే కుట్ర చేస్తున్నారన్నారు. కృష్ణ ట్రైబ్యునల్ వాదనల్లో ఘోర వైఫల్యం, తాత్కాలిక వాటా 34 శాతం నీటిని కూడా పంట పొలాలకు మళ్లించలేని దద్దమ్మ ప్రభుత్వం అన్నారు. రేవంత్ రెడ్డి పాలమూరు పులి కాదు, పాలమూరు పిల్లి అని అన్నారు. కొడంగల్‌లో రైతులకు బేడీలు వేసి , మక్తల్‌లో పంటలు కాపాడుకునేందుకు నీళ్లు అడిగిన 14 మంది రైతులపై నాన్‌బెయిల్‌బుల్ కేసులు పెట్టడమేనా సొంత జిల్లాకు రేవంత్ ఇచ్చిన బహుమానం అని ప్రశ్నించారు. ఎండిపోతున్న పంటలకు తక్షణమే సాగునీరు, 24 గంటల విద్యుత్ ఇచ్చి ఆదుకోకపోతే బీఅర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తుందన్నారు. అనంతరం తిరుగు ప్రయాణంలో రాయపురం శివారులో ఎం డిన పంటలను హరీశ్‌రావు పరిశీలించారు. ఇది కరువు కాదు, పచ్చిగా కాంగ్రెస్ పాలకులు తెచ్చిన ఎల్ కాంగో కరువు అన్నారు. ఈ సందర్భం గా అక్కడే ఉన్న రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు. తాము సాగు చేసుకుంటున్న 50 ఎకరాల భూములను ప్రభుత్వం వ్వవసాయ పరిశోధన కేంద్రం కోసం సేకరిస్తున్నారని, ఈ భూములను తీసుకుంటే తమ బతుకుదేరువు కష్టంగా మారుతుందని వాపోయా రు. తాను అండగా ఉంటానని, రైతులు ధైర్యంగా ఉండాలని రైతులకు భరోసా ఇచ్చారు. అనంతరం గట్టు విద్యుత్ సబ్‌స్టేషన్‌లోని లాగ్‌బుక్‌ను పరీశీలించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టం రామ్మోహన్‌రెడ్డి, బీఅర్ఎస్ నాయకుడు హన్మంతునాయుడు, మునిసిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ ఉన్నారు.