రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ABN , Publish Date - Sep 22 , 2026 | 11:33 PM
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ద్వారా ఎడమ కాల్వ ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్రస్థాయిలో మోసం చేస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి, అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
- నీరు విడుదల చేసే వరకు ఉద్యమిస్తూనే ఉంటాం
- బీజేపీ రాష్ట్ర నాయకులు బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి, అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి
ఆత్మకూరు/అమరచింత, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ద్వారా ఎడమ కాల్వ ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్రస్థాయిలో మోసం చేస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి, అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పర్యటనలో భాగంగా వనపర్తి జిల్లా బీజేపీ అధ్యక్షుడు నారాయణ ఆధ్వర్యంలో ఆత్మకూరు, అమరచింత మండలాల బీజేపీ నాయకులు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆనకట్టపైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం గరిష్ట స్థాయిలో ఉన్నా.. సాగుకు నీటిని విడుదల చేయకపోవడం ఎంత వరకు సమంజసమని ఆరోపించారు. ఎగువ నుండి ఆశించిన మేర ప్రాజెక్టుకు వరద వచ్చిన కారణంగా 45 రోజుల పాటు కుడి, ఎడమ కాల్వలకు సాగు నీటిని విడుదల చేశారు. దీంతో రైతులు వరి పంటలు సాగు చేసుకున్నారు. ప్రస్తుతం ఎగువ నుంచి వరద నిలిచిపోవడంతో ప్రస్తుతం సాగునీటిని నిలిపివేయడం సరైంది కాదన్నారు. వారబంధీ మాదిరిగానైనా నీటిని విడుదల చేస్తే రైతులు సద్వినియోగం చేసుకుని పంటలు పండించుకునే అవకాశం ఉందని వారు రాస్తారోకో చేపట్టారు. ఈ క్రమంలో గేట్లు తెరవడానికి వెళ్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. గంట పాటు పోలీసులకు బీజేపీ నాయకులకు తీవ్ర స్థాయిలో వాగ్వాదం నెలకొనడంతో పోలీసులు బీజేపీ నాయకులను అరెస్టు చేసి అమరచింత పోలీసు స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో అమరచింత బీజేపీ నాయకులు మేర్వ రాజు, నారాయణ, అశోక్, మంగ లావణ్యతో పాటు ఆత్మకూరు నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, ఆనంద్, మనోహర్‌గౌడ్, బాలకృష్ణ, సుమంత్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.
నీటిని విడుదల చేసే వరకు ఉద్యమాలు
జూరాల ప్రాజెక్టు నుంచి ఎడమ కాల్వల ద్వారా రైతులకు సాగునీటిని విడుదల చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రాజెక్టు సందర్శనలో భాగంగా సీపీఎం నాయకులు హాజరై ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు క్యాంపు చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. నీటిని విడుదల చేసే వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించి రాస్తారోకో నిర్వహించడంతో సీపీఎం నాయకులను అరెస్టు చేసి అమరచింత పోలీసుస్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో ఆత్మకూరు, అమరచింత సీపీఎం నాయకులు ఎస్.రాజు, వెంకటేశ్, అజయ్, రమేష్, రాఘవేందర్, రాఘవ, కురుమూర్తితో పాటు ఆత్మకూరు అమరచింత మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.