‘ఉపాధి’ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:06 PM
ఉపాధిహామి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు.
-సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
అచ్చంపేట, జనవరి 8 (ఆంధ్రజ్యోతి) : ఉపాధిహామి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో గురువారం ఏర్పాటు చేసిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధి హామీ పథకానికి గతంలో 90 శాతం నిధులు కేంద్రం, 10 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవని తెలిపారు. ప్రస్తుతం 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించేలా నిబంధనలను మార్చడం దుర్మార్గమన్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పేద కూలీలు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. పథకం పేరులో నుంచి మహాత్మా గాంధీని తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. విద్యుత్ వ్యవస్థను కూడా ప్రైవేటుపరం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలపై చర్చ జరగలేదని, ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారిని పోరాటాలు చేయాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, నాయకులు దేశనాయక్, శంకర్, మల్లేశ్, సైతులు పాల్గొన్నారు.