Share News

లెక్క తేలింది...!

ABN , Publish Date - Apr 16 , 2026 | 11:46 PM

గతేడాది రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేను చేపట్టిన విషయం తెలిసిందే.. ఈ సర్వేలో వచ్చిన వివరాలను ప్రభుత్వం క్రోడీకరించి బుధవారం జిల్లాలు, కులాలు, వర్గాల వారీగా వివరాలను వెల్లడించింది.

లెక్క తేలింది...!
మహబూబ్‌నగర్‌ జిల్లా

- సామాజిక, ఆర్థిక, కులగణన వివరాలను వెల్లడించిన ప్రభుత్వం

- ఉమ్మడి పాలమూరు జిల్లాలో కులాలవారీగా 37,01,074 జనాభా

- మొత్తం బీసీలు 54.82 శాతం.. అందులో ముదిరాజ్‌లది పైచేయి

- 20.09 శాతం ఎస్సీ జనాభా.. అందులో మాదిగ జనాభా అత్యధికం

- ఎస్టీలు 9.37 శాతం.. లంబాడాలు అధికం.. తర్వాత ఎరుకలి వారే..

- ఓసీలు 8.03 శాతం మాత్రమే.. అందులో రెడ్డీలదే ఆధిపత్య కులం

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : గతేడాది రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేను చేపట్టిన విషయం తెలిసిందే.. ఈ సర్వేలో వచ్చిన వివరాలను ప్రభుత్వం క్రోడీకరించి బుధవారం జిల్లాలు, కులాలు, వర్గాల వారీగా వివరాలను వెల్లడించింది. ఇందులో మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 37,01,074 మంది జనాభా ఉందని ప్రభుత్వం పేర్కొన్నది. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో 4023028 జనాభా ఉంది. జిల్లాల విభజన తర్వాత కల్వకుర్తి, కొడంగల్‌లో సింహభాగం, షాద్‌నగర్‌ నియోజకవర్గం మొత్తం వేరే జిల్లాల్లోకి వెళ్లిపోవడంతో చాలావరకు జనాభా ఇతర జిల్లాల్లో నమోదైంది. అలాగే కొంతమంది ఈ సర్వేలో ఉద్దేశపూర్వకంగా పాల్గొనకపోవడంతో 2011తో పోల్చితే తక్కువ జనాభా నమోదైనట్లు తెలుస్తోంది. ప్రధానంగా బీసీ కులాల లెక్కలను తీయడం ప్రభుత్వం ఉద్దేశం కాగా.. దాంతో పాటు ఇతర కులాలు, అంశాలను కూడా క్రోడికరించడంతో రాష్ట్ర సమగ్ర స్వరూపం ఒక్క హ్యాండ్‌బుక్‌ రూపంలో అందుబాటులో ఉండనుంది. అయితే ఓసీల్లో కొంత మంది కులం పేరు వెల్లడించకపోవడం, బీసీల జాబితాలో ముస్లీం బీసీలను వేరుగా లెక్కించడం, ఓసీ ముస్లీంలను ఓసీ జాబితాలో చేర్చడం వంటివి కొంత ప్రత్యేక విషయాలుగా చెప్పుకోవచ్చు. వచ్చే జనగణన కంటే ముందే దాదాపుగా పూర్తి వివరాలు దీని వల్ల ప్రభుత్వం వద్ద ఉన్నట్లయ్యింది. అధికారులకు కూడా జనగణన చేయడం ఈ సర్వే వివరాల వల్ల కొంత సులభంగా మారవచ్చు.

బీసీలదే పైచేయి

రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ మొత్తం జనాభాలో బీసీలదే పైచేయి అని చెప్పవచ్చు. ఈ సర్వేలో లెక్కించిన జనాభా మొత్తం 37,010,74 కాగా.. అందులో 20,29,001 జనాభా ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీసీలు ఉన్నారు. అత్యధిక శాతం బీసీలు గద్వాల జిల్లాలో 61.76 శాతం ఉండగా.. జనాభా పరంగా ఎక్కువగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో 4,76,910 మంది ఉన్నారు. అత్యల్ప శాతం నాగర్‌కర్నూలు జిల్లాలో 48.26 శాతం బీసీలు మొత్తం జనాభాలో ఉన్నారు. ఇక బీసీల్లో ముదిరాజ్‌లదే పైచేయిగా చెప్పవచ్చు. మొత్తం బీసీ జనాభా 20,29001 కాగా.. 4,88,003 మంది ముదిరాజ్‌లే ఉన్నారు. ఉమ్మడి జిల్లా మొత్తం బీసీల్లో 24.05 శాతం ముదిరాజ్‌లే ఉన్నారు. యాదవుల ప్రాబల్యం కూడా ఉమ్మడి జిల్లాలో అధికంగా ఉంది. మొత్తం బీసీల్లో 3,34,070 మంది యాదవులు ఉన్నారు. వీరి శాతం 16.46గా నమోదైంది. ఇక వాల్మీకి బోయలు అత్యధికంగా ఉమ్మడి జిల్లా పరిధిలోనే ఉన్న విషయం తెలిసిందే.. వీరి జనాభా 2,77,676 ఉండగా.. మొత్తం బీసీల్లో 13.68 శాతం వీరి వాటాగా ఉంది. ఆ తర్వాత కురువలు 1,70,962 మంది ఉండగా.. 8.42 శాతం బీసీల్లో వీరి వాటా ఉంది. ఇక గౌడ/ఈడిగ సామాజికవర్గం వారు ఉమ్మడి జిల్లాలో 1,29,065 మంది ఉండగా.. వీరి వాటా 6.36 శాతంగా ఉంది. వీరు కాకుండా బీసీల్లో ఉమ్మడి జిల్లా పరిధిలో సగర, రజక, మున్నూరుకాపు, వడ్డెర, నాయిబ్రహ్మణ, పద్మశాలి వంటి కులాల వారి జనాభా కూడా అధికంగానే ఉంది.

ఎస్సీల్లో మదిగలు.. ఎస్టీల్లో లంబాడీలు...

షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్‌ తెగలు జనాభా కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో బలంగానే ఉంది. ఎస్సీలు ఉమ్మడి జిల్లా జనాభాలో 7,43,606 మంది ఉండగా.. మొత్తంలో వీరి వాటా 20.09 శాతంగా నమోదైంది. ఇందులో మాదిగల వాటానే అధికంగా ఉందని చెప్పవచ్చు. ఆ తర్వాత మాలలు ఉన్నారు. మిగతా కులాలవారు చాలా తక్కువగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మాదిగలు 5,39,849 మంది ఉండగా.. మొత్తం ఎస్సీల్లో వీరివాటా 72.60శాతంగా ఉంది. ఆ తర్వాత మాలలు 99,238 మంది ఉన్నారు. మొత్తం ఎస్సీల్లో వీరివాటా 13.34 శాతం ఉంది. ఎస్సీల్లో మాదిగ, మాలల వాటా 85.94 శాతం పోను మిగతా కులాల వారి సంఖ్య 1,045,19 గా నమోదైంది. వీరివాటా 14.05 అని చెప్పవచ్చు. ఇక ఎస్టీలు ఉమ్మడి జిల్లాలో 3,42,055 మంది ఉండగా.. మొత్తం జనాభాలో వీరి వాటా 9.37 శాతంగా నమోదైంది. ఇందులో లంబాడీల శాతమే అధికంగా ఉంది. మొత్తం ఎస్టీల్లో 2,96,642 మంది 86.72 శాతం లంబాడీలే ఉన్నారు. ఆ తర్వాత ఎరుకలి వారు 26,530 మంది ఉండగా.. వీరి వాటా ఎస్టీల్లో 7.75 శాతంగా ఉంది. ఉమ్మడి జిల్లాకే ప్రత్యేకమైన చెంచులు 11,293 మంది ఉండగా.. ఎస్టీల్లో వీరి వాటా 3.30 శాతంగా ఉంది. మిగతా ఎస్టీ కులాల వారు ఉమ్మడి జిల్లాలో 7,590 మంది ఉండగా.. వారి వాటా 2.21 శాతంగా ఉంది.

ఓసీల్లో రెడ్డీలదే ఆధిపత్యం...

ఇతర కులాలు (ఓసీ) జాబితాలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 2,97,408 మంది ఉండగా.. మొత్తం లెక్కించిన కులాల జనాభాలో వీరివాటా 8.03 శాతంగా నమోదైంది. అయితే ఇందులో రెడ్డిలే ఆధిపత్య కులంగా ఉన్నారు. మొత్తం ఓసీ జనాభాలో రెడ్డీల జనాభా 1,81,490గా ఉంది. మొత్తం ఓసీల్లో వీరివాటా 61.02 శాతమని చెప్పవచ్చు. ఆ తర్వాత కోమట్లు/ ఆర్యవైశ్యుల అధికంగా ఉన్నారు. వీరి జనాభా ఉమ్మడి పాలమూరులో 39,690గా ఉంది. మొత్తం ఓసీల్లో వీరివాటా 13.34శాతంగా ఉంది. ఇక ఓసీల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ మంది తమ కులాన్ని వెల్లడించలేదు. వారి సంఖ్య ఉమ్మడి జిల్లాలో 14,317గా ఉంది. కులాన్ని వెల్లడించని వారి వాటా ఓసీల్లో 4.81 శాతంగా ఉంది. ఇక బ్రాహ్మణులు ఉమ్మడి జిల్లాలో 9,617 మంది ఉండగా.. వీరి వాటా ఓసీల్లో 3.23 శాతంగా ఉంది. ఇక ఓసీ ముస్లీంల శాతం గణనీయంగా ఉంది. ఉమ్మడి జిల్లాలో ఓసీ ముస్లీంలు 26,959 మంది ఉన్నారు. వీరి వాటా 9.06శాతంగా ఉంది. ఓసీల్లో బౌద్ధ మతస్తులు, క్రైస్తవులు, కమ్మ, కాపు, క్షత్రియ, లింగాయత్‌, మార్వాడీలు, పట్నాయక్‌లు, సిక్కులు, వెలమలు, వర్మలు కలిపి ఉమ్మడి జిల్లాలో 28,334 మంది ఉన్నారు. వీరి వాటా ఓసీల్లో 9.52 శాతంగా ఉంది.

Updated Date - Apr 16 , 2026 | 11:46 PM