ఆ గ్రామం అంతర్రాష్ట్ర కార్మికులకు ఆశ్రయం
ABN , Publish Date - Nov 01 , 2026 | 11:11 PM
మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామం ఉపాధి నిమిత్తం వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే కార్మికులకు ఆశ్రయం కల్పిస్తోంది.
- తక్కువ ధరకే అద్దె సౌకర్యం
- వ్యాపారాలతో ఉపాధి పొందుతున్న గ్రామస్థులు
రాజాపూర్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామం ఉపాధి నిమిత్తం వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే కార్మికులకు ఆశ్రయం కల్పిస్తోంది. ముఖ్యంగా పోలెపల్లి సెజ్ కిలో మీటరు దూరంలో ఉండటంతో అన్ని రకాల కార్మికులకు ఉపాధి పనులతో పాటు నివాసం, నిత్యావసరాలు, రవాణా వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో బీహర్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, చత్తీస్‌గడ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఇక్కడికి వేల సంఖ్యలో వస్తున్నారు. కొందరు కుటుంబాలతో సహా గ్రామంలోనే నివాసం ఉంటున్నారు. అంతర్రాష్ట్ర కార్మికుల రాకతో గ్రామంలో కిరాణా దుకాణాలు, హోటళ్లు, కూరగాయల వ్యాపారుల కార్యకలాపాలు కూడా పెరుగుతున్నాయి. కొందరు గ్రామస్థులు తమకున్న స్థలంలో భవనాలు నిర్మించి అద్దెకు ఇస్తూ ఉపాధి పొందుతున్నారు. అంతర్రాష్ట్ర కార్మికులకు ఉపాధి కల్పిస్తూ.. స్థానికులకు జీవనోపాధికి తోడ్పటునిస్తూ ముదిరెడ్డిపల్లి గ్రామం రోజురోజుకూ ఉపాధి కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది.