శునకాలతో బెంబేలు
ABN , Publish Date - Sep 27 , 2026 | 11:28 PM
జడ్చర్ల మునిసిపాలిటీలో కుక్కల అరుపులు వింటేనే బెంబేలెత్తుతున్నారు.
- రక్షించాలని కోరుతున్న జడ్చర్ల పట్టణ వాసులు
జడ్చర్ల, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : జడ్చర్ల మునిసిపాలిటీలో కుక్కల అరుపులు వింటేనే బెంబేలెత్తుతున్నారు. గుంపులుగా తిరగడంతో ఇంట్లో నుంచి కాలు బయటికి పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. బాదేపల్లి పాతబజారులో దాదాపు 20 కుక్కలు, పట్టణంలోని క్లబ్‌రోడ్డులో సైతం దాదాపు 15 కుక్కలు గుంపులుగా తిరగడంతో పాటు ఆ దారి గుండా వెళ్తున్న వాహనాలపైకి ఎగబడుతున్నాయి. ఇటీవల ఓ ద్విచక్రవాహన దారుడిపై కుక్కలు ఎగబడగా కిందపడి గాయాలపాలయ్యాడు. అదే సందర్భంలో ఆ వ్యక్తిని కరిచేందుకు కుక్కలు ఎగబడగా, సమీపంలోని కొందరు తరమడంతో కుక్కల బారి నుంచి బయటపడ్డాడు. పట్టణంలోని నేతాజీరోడ్డు, నేతాజీచౌరస్తా, గౌరీశంకర్‌కాలనీ, వెంకటేశ్వరకాలనీ, సరస్వతికాలనీ, నిమ్మబావిగడ్డ, సిగ్నల్‌గడ్డ ప్రాంతంతో పాటు కావేరమ్మపేట, జడ్చర్లలోని పలు ప్రాంతాల్లో మార్కింగ్ వాక్‌కు వెళ్లే వారంతా చేతిలో కర్ర పట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గౌరీశంకర్‌కాలనీ, విద్యానగర్‌కాలనీలో స్కూల్ బస్సుల కోసం వేచి ఉన్న విద్యార్థులు భయపడుతున్నారు. జడ్చర్ల నుంచి గంగాపురం వెళ్లే దారిలో రోడ్డుకు ఒక వైపు చెత్తాచెదారంతో పాటు కుళ్లిన తినుబండారాలు, పండ్లు పారబోయడంతో కుక్కల బెడత మరీ ఎక్కువగా ఉంది. మునిసిపాలిటీ పరిధిలో ప్రస్తుతం దాదాపు రెండు వేలకుపైగా కుక్కలు యథేచ్ఛగా తిరుగుతున్నాయని పట్టణ ప్రజలు వాపోతున్నారు. కుక్కల దాడికి గురికాకముండే రక్షణ చర్యలు చేట్టాలని ప్రజలు కోరుతున్నారు.