Share News

ప్రారంభమైన పది పరీక్షలు

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:32 PM

పదవ తరగతి బోర్డు పరీక్షలు నాగర్‌కర్నూల్‌ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైనట్లు డీఈవో రమేష్‌ కుమార్‌ తెలిపారు.

ప్రారంభమైన పది పరీక్షలు
నాగర్‌కర్నూల్‌లో పరీక్ష కేంద్రం వద్ద నెంబర్లు చూసుకుంటున్న విద్యార్థులు

- నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 10,651 మందికి గాను 21 మంది గైర్హాజరు

- మన్ననూర్‌లో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌

- నాగర్‌కర్నూల్‌, పాలెంలో డీఈవో కేంద్రాల పరిశీలన

బిజినేపల్లి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి) : పదవ తరగతి బోర్డు పరీక్షలు నాగర్‌కర్నూల్‌ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైనట్లు డీఈవో రమేష్‌ కుమార్‌ తెలిపారు. శనివారం జిల్లాలో పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేసిన 60 కేంద్రాల్లో 10,651 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 10,630 మంది హాజరయ్యారు. 20 మంది గైర్హాజరు కాగా, 98.80 శాతం హాజరైనట్లు ఆయన తెలిపారు. అమ్రాబాద్‌ మండలంలోని మన్ననూర్‌లోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన తాగునీటి వసతి, ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేశారా అని పరీక్ష కేంద్రం ఇన్‌చార్జిని అడిగి తెలుసుకున్నారు. ప్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు 34 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. అలాగే నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని చైతన్య హైస్కూల్‌, సీఎన్‌ఆర్‌ హైస్కూల్‌ పరీక్ష కేంద్రాలను, బిజినేపల్లి మండలంలోని పాలెం జడ్పీహెచ్‌ఎస్‌ పరీక్ష కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్‌ కుమార్‌ తనిఖీ చేసి మాట్లాడారు. బిజినేపల్లిలో మండల కేంద్రంలో మూడు, పాలెంలో ఒక పరీక్ష కేంద్రంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు 718 మంది విద్యార్థులకు గాను 717 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరైనట్లు ఎంఈవో రఘునందన్‌ శర్మ తెలిపారు.

Updated Date - Mar 14 , 2026 | 11:32 PM