విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగుపర్చాలి
ABN , Publish Date - Nov 16 , 2026 | 11:29 PM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచి, సంఖ్యా పరిజ్ఞానాన్ని బలోపేతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ ఉపాధ్యాయులకు సూచించారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
ప్రతీ విద్యార్థి అభ్యసన ప్రగతి పర్యవేక్షణ
ప్రోగ్రెస్ నమోదు బుక్‌లెట్స్ విడుదల
గద్వాల, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచి, సంఖ్యా పరిజ్ఞానాన్ని బలోపేతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ ఉపాధ్యాయులకు సూచించారు. సోమవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకమైన పాఠశాలల విద్యార్థుల ప్రగతి ప్రోగ్రెస్ నమోదు చేసేందుకు రూపొందించిన ప్రత్యేక బుక్‌లెట్స్‌ను కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు జిల్లాలోని 87ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో ప్రత్యేకంగా విద్యా బోధకులను నియమించామన్నారు. విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలను చదవడమే కాకుండా, వాటిని అర్థం చేసుకుని స్వయంగా చదవడం, రాయడం, గణిత సమస్యలను పరిష్కరించే సామర్థ్యాలను పెంపొందించుకునేలా ఆయా పాఠశాలల్లో బోధన చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈవో విజయలక్ష్మి, ఏఎంవో వినోద్‌కుమార్, ఎఫ్‌ఎల్‌ఎన్‌సెల్ బృందం మురళీధర్‌రెడ్డి, రాఘవేంద్ర, రామన్‌గౌడ్, షేక్షావలి పాల్గొన్నారు.