హాస్టల్ భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత
ABN , Publish Date - Oct 08 , 2026 | 11:40 PM
వనపర్తి జిల్లా పెబ్బేరు మునిసిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలోని వసతి గృహంలో విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన గురువారం కలకలం రేపింది.
- పెబ్బేరు ప్రభుత్వ బాలికల వసతిగృహంలో ఘటన
పెబ్బేరు, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) : వనపర్తి జిల్లా పెబ్బేరు మునిసిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలోని వసతి గృహంలో విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన గురువారం కలకలం రేపింది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి చికెన్, సాంబార్‌తో అన్నం తిన్న తరువాత మధ్యరాత్రి సమయంలో జ్వరంతో కొంత మంది విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయాన్ని గురువారం తెల్లవారుజామున ఫోన్ ద్వారా వసతి గృహం వార్డెన్ జీవితకు విద్యార్థులు తెలిపారు. వెంటనే అక్కడికి వచ్చిన ఆమె కొంత మంది విద్యార్థులకు ఓఆర్‌ఎస్ ఫ్యాకెట్లు, జ్వరం ట్యాబ్లెట్లు ఇచ్చి విషయాన్ని గుట్టుగా ఉంచేందుకు ప్రయత్నం చేసినట్లు ఆరోపనలు ఉన్నాయి. విద్యార్థులకు జ్వరం తీవ్రత ఎక్కువ కావడంతో వార్డెన్ భర్త వాహనాల ద్వారా దాదాపుగా 20 మందికి పైగా విద్యార్థులను ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వారిలో నలుగురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వైద్యులు అప్రమత్తమై మెరుగైన వైద్యం అందించారు. ఆరోగ్యపరిస్థితి మెరుగుపడటంతో వారిని తల్లిదండ్రులు తమ ఇళ్లకు తీసుకెళ్లారు. విషయం తెలుకున్న అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ వసతి గృహంలోని వంటశాల, ఆహార పదార్థాలు, బస చేసే గదులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి భాస్కర్ నాయక్, మునిసిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. విద్యార్థులు అస్వస్థతకు గురికావడానికి గల కారణాలను వార్డెన్ జీవితతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం వల్లే అస్వస్థతకు గురయ్యారన్నారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ, బీఆర్‌ఎస్, బీజేపీ కోరారు.