ప్రత్యేక అధికారులు ఆకస్మిక తనిఖీ చేయాలి
ABN , Publish Date - Sep 28 , 2026 | 11:21 PM
సంక్షేమ వసతి గృహాలను, పాఠశాలలను విద్యాశాఖ అధికారులు, ప్రత్యేకాధికారులు తరచూ క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు ఆదేశించారు.
జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు
గద్వాల, సెప్టెంబరు 28 (ఆంధ్ర జ్యోతి): సంక్షేమ వసతి గృహాలను, పాఠశాలలను విద్యాశాఖ అధికారులు, ప్రత్యేకాధికారులు తరచూ క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు ఆదేశించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు హైదరాబాద్ నుంచి విద్యాశాఖకు సంబంధించిన అంశాలపై ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, విద్యతో పాటు వారికి అందుతున్న మౌలిక వసతులపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కలెక్టర్లు క్రమం తప్పకుండా రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేసి, క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించాలని సూచించారు. ముఖ్యమంత్రి ఇటీవల నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ కొన్నిచోట్ల ఆహార విషబాధ, ఎలుకలు, పాముకాటు వంటి ఘటనలు చోటుచేసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని సీఎస్ ప్రస్తావించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యాసంస్థలోని సౌకర్యాలు, లోపాలు, చేపట్టిన పరిష్కార చర్యల వివరాలను ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. తద్వారా క్షేత్రస్థాయిలో చేపట్టిన మార్పులను ఉన్నతస్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుందని తెలిపారు. జిల్లాలో రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు సంబంధించి ప్రతికూల నివేదికలు వచ్చినప్పుడు అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని సూచించారు. తప్పుడు ప్రచారంగా ఉన్నట్లు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, వాస్తవంగా సమస్యలు ఉన్నట్లు తేలితే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రానున్న శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు స్నానానికి వెచ్చని నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన దుప్పట్లు ముందుగానే సమకూర్చాలని ఆదేశించారు. గద్వాల ఐడీవోసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్‌తో పాటు డీఈవో విజయలక్ష్మి, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి అక్బర్‌బాషా, గిరిజన అభివృద్ధి శాఖ అధికారి యాదమ్మ పాల్గొన్నారు.