గోల్‌మాల్..!
ABN , Publish Date - Aug 12 , 2026 | 11:39 PM
ఇటీవల విజిలెన్స్ అధికారులు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రైస్‌మిల్లుల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే..
- ధాన్యం కొనుగోలు సమయం నుంచే అక్రమాల పర్వం
- కొనుగోలు కేంద్రాల్లో కాకుండా మిల్లుల్లోనే ధాన్యం తూకం
- మిల్లర్ల నాటకాలు.. పౌరసరఫరాల సంస్థ అధికారుల వత్తాసు
- ట్రక్‌షీట్లు కూడా వారి కనుసన్నల్లోనే తయారవుతున్న వైనం
- మిల్లుల్లో విజిలెన్స్ అధికారుల ముమ్మర తనిఖీల్లో వెల్లడి
మహబూబ్‌నగర్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి,) : ఇటీవల విజిలెన్స్ అధికారులు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రైస్‌మిల్లుల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ తనిఖీల్లో ప్రభుత్వం మిల్లర్లకు కేటాయించిన ధాన్యం.. అందుబాటులో ఉన్న ధాన్యం లెక్కల్లో భారీగా తేడాలు వెలుగులోకి వస్తున్నాయి. మిల్లర్లు గడిచిన కొన్ని సీజన్లుగా ధాన్యాన్ని పక్కదారి పట్టించి.. ప్రభుత్వానికి రూ. వెయ్యికోట్ల మేర బురిడీ కొట్టించారనే విషయం తేటతెల్లమవుతోంది. ఒక్కో అక్రమానికి చెక్ పెట్టుకుంటూ వస్తున్నా.. మిల్లర్లు కొత్త పంథాల్లో రైతులను, ప్రభుత్వాన్ని మోసం చేస్తూనే ఉన్నారు. పైపెచ్చు వారికే నష్టం వచ్చినట్లు చెబుతూ మొసలి కన్నీరు కారుస్తుండటం గమనార్హం. ఈ నెలలో మహబూబ్‌నగర్ జిల్లాలో మూడుచోట్ల విజిలెన్స్ దాడులు జరగ్గా.. దాదాపు రూ. 40 కోట్లకు పైగా విలువ చేసే ధాన్యం మాయమైందని అధికారులు వెల్లడించారు. అయితే ఈ ధాన్యం మోసం కేవలం ప్రభుత్వం కేటాయించిన తర్వాతనే కాకుండా, కొనుగోలు సమయం నుంచే జరుగుతోందని తేటతెల్లమవుతోంది. పేరుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ, తూకం మొత్తం మిల్లుల్లో నేరుగా చేస్తున్నట్లు నిరూపణ అవుతోంది. ఇది అధికారులు, మిల్లర్ల కుమ్మక్కుతోనే జరుగుతుండటం గమనార్హం. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇటీవల విజిలెన్స్ అధికారులు దాడులు చేసిన రెండు మిల్లుల్లో కొనుగోలు కేంద్రాల పేరుతో నేరుగా తూకం వేసుకున్నట్లు స్పష్టమవుతోంది. రైతుల నుంచి సేకరించడం, ట్రక్ షీట్లు కొనుగోలు కేంద్రాల పేరుతో తయారుచేయడం, వాటిని బయటకు అమ్ముకోవడం, తేడా వచ్చినప్పుడు బుకాయించడం మొత్తం మిల్లర్ల కనుసన్నల్లోనే జరుగుతోంది.
ఇదీ అక్రమాల తీరు..
రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తారు. అక్కడ నుంచి అధికారులు ధాన్యం ట్రాన్స్‌పోర్ట్ టెండర్లు దక్కించుకున్న వారి లారీల ద్వారా మిల్లులకు తరలిస్తారు. వారు ధాన్యాన్ని బియ్యం చేసి తిరిగి పౌరసరఫరాల శాఖకు అప్పగించాలి. కానీ మహబూబ్‌నగర్ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయకుండా నేరుగా మిల్లులకు తరలించి.. అక్కడే తూకం వేసుకుంటున్నట్లు వెలుగులోకి వస్తోంది. మిల్లులో తూకం వేసిన తర్వాత సమీపంలోని కొనుగోలు కేంద్రం పేరుతో ట్రక్ షీట్లు తయారు చేయించి.. అధికారులకు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా నవాబుపేట మండలం తీగలపల్లిలోని శ్రీ కనకదుర్గ రైస్‌మిల్లులో తనిఖీల సందర్భంగా 2022-23 రబీ సీజన్‌కు సంబంధించి 4661.76 మెట్రిక్ టన్నులు, 2024-25 రబీకి సంబంధించి 1965.970 మెట్రిక్ టన్నుల ధాన్యం తేడా వచ్చినట్లు గుర్తించారు. అయితే తమ మిల్లులో ధాన్యం తేడాలు లేవని మిల్లర్ వాదిస్తుండటం గమనార్హం. ఒక్కో బస్తాలో 46 కిలోల ధాన్యం ఉందని, అధికారులు 40 కిలోలకు లెక్క వేసుకుని తేడా ఉందని చూపించారని ఆరోపిస్తున్నాడు. అయితే ఏ కొనుగోలు కేంద్రం నుంచి కూడా 46 కిలోల చొప్పున ధాన్యం బస్తాలు మిల్లుకు రావు.. కేవలం 40 కిలోల నుంచి 41 కిలోల మధ్యలోనే తూకం వేసి మిల్లుకు పంపిస్తారు. మరి ఈ 46 కిలోల బస్తాలు ఎక్కడివంటే నేరుగా ప్రభుత్వ కొనుగోలు పేరుతో మిల్లుల్లోనే అక్రమంగా తూకాలు వేసినట్లు తెలుస్తోంది. ట్రక్ షీట్లు కూడా ఆ తర్వాతే తయారయినట్లు వెల్లడవుతోంది.
మిల్లర్ చీటింగ్
ప్రభుత్వం ప్రతీఏటా ధాన్యం కొనుగోలు వల్ల నష్టం వాటిల్లుతున్నప్పటికీ... రైతుల పంటకు గిట్టుబాటు ఇవ్వడం, ప్రజల ఆహార అవసరాలకు నిల్వ ఉంచుకోవడం కోసం అప్పులు తెచ్చి మరీ ధాన్యం సేకరిస్తోంది. ఇతర రాష్ర్టాల నుంచి ధాన్యం రాకుండా చర్యలు తీసుకుంటోంది. కానీ మిల్లర్లు ఎక్కడెక్కడో కొనుగోలు చేసిన ధాన్యాన్ని తీసుకువచ్చి.. నేరుగా ప్రభుత్వ కొనుగోలు పేరుతో మిల్లుల్లోనే తూకం వేసుకోవడం చీటింగ్ కిందికే వస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా హమాలీలు, ఐకేపీ, పీఏసీఎస్ వ్యవస్థ ద్వారా కొనుగోలు చేస్తుంటే నేరుగా మిల్లర్ మిల్లులో తూకం వేసుకోవడం, అధికారులు దానికి వత్తాసు పలకడం కుమ్మక్కుకు సంకేతమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు మిల్లుల్లో మాయం అయిన ధాన్యం ఉమ్మడి జిల్లాలోని ఒక లిక్కర్ ఫ్యాక్టరీకి విక్రయిస్తున్నట్లు సమాచారం. దానిపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించాలనే డిమాండ్ వస్తోంది.