రూ.లక్షలు కొట్టు.. బెల్ట్‌షాపు పెట్టు!
ABN , Publish Date - Nov 04 , 2026 | 11:21 PM
నల్లమల ప్రాంతంలో శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై విచ్చలవిడిగా నాటుసారా, మద్యం అమ్మకాలు జరుగుతున్నా పోలీస్, ఎక్సైజ్‌శాఖ అధికారులు కన్నెత్తి చూడటంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
- విచ్చలవిడిగా సారా, మద్యం అమ్మకాలు
- బ్రహ్మగిరి, పాతాళగంగ, మత్స్యకారుల కాలనీలో బెల్ట్‌షాపు ఏర్పాటుకు రూ. 2లక్షల చెల్లింపు!
- మద్యం షాపు బినామీ యజమానికి ఇప్పటికే నలుగురు అడ్వాన్స్
- తూతూ మంత్రంగా ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎక్సైజ్‌శాఖ తనిఖీలు
బ్రహ్మగిరి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): నల్లమల ప్రాంతంలో శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై విచ్చలవిడిగా నాటుసారా, మద్యం అమ్మకాలు జరుగుతున్నా పోలీస్, ఎక్సైజ్‌శాఖ అధికారులు కన్నెత్తి చూడటంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని బ్రహ్మగిరి, వటువర్లపల్లి, ఈగలపెంట, పాతాళంగంగ గ్రామాల్లో నాటుసారా, బెల్ట్‌షాపుల ద్వారా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ అనుమతి కలిగిన మద్యం షాపు బ్రహ్మగిరిలో ఉన్నప్పటికీ పైగ్రామాల్లో 40 వరకు బెల్ట్‌షాపులు కొనసాగుతున్నాయి. బ్రహ్మగిరి మద్యం దుకాణదారులు స్వయంగా వటువర్లపల్లి, ఈగలపెంట, పాతాళగంగ గ్రామాల్లో ఉన్న షాపులకు ప్రత్యేక వాహనంలో మద్యం సరఫరా చేస్తున్నారు. లక్కీ డ్రాలో మద్యం దుకాణదారుడు రూ.లక్షల్లో గుడ్‌విల్ తీసుకుని అచ్చంపేటకు చెందిన సిండికేట్ వ్యాపారులుకు అప్పచెప్పడంతో వీరి తీరు ‘రూ. లక్ష కొట్టు- బెల్ట్‌షాపు పెట్టు’ అన్నట్లుగా మారింది. ఇక్కడ అనుమతి లేకున్నా బ్రహ్మగిరిలో పర్మిట్ రూం నడిపిస్తున్నారు. బ్రహ్మగిరి, ఈగలపెంట, పాతాళగంగ, ఇన్‌క్లాండ్ టన్నెల్‌లో (మత్స్యకారుల కాలనీ) బెల్ట్‌షాపులలో అడ్వాన్స్ రూ. 2లక్షల వరకు చెల్లించి అమ్మకాలు జరుపుతున్నారు. ఇలా చేయడం మద్యం అమ్మకాలకు విరుద్ధమైనప్పటికీ వీరికి ఎక్సైజ్ శాఖ అండదండలు మెండుగా ఉన్నాయని స్థానికలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా బ్రహ్మగిరి మద్యం దుకాణంలో మాత్రమే మద్యం తెచ్చుకుని అమ్ముకోవాలని బెల్టుషాపుల వారిపై ఎక్సైజ్‌శాఖ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని చిరువ్యాపారులు చర్చించుకుంటున్నారు. కాగా, మద్యం షాపులో వ్యాపారి క్వార్టర్‌పై అదనంగా రూ. 20 అమ్ముతుండగా, బెల్ట్‌షాపుల వారు మరో రూ.30 అధికంగా అమ్ముతున్నారు. పూర్తిగా నాటుసారా, మద్యం అమ్మకాలు నిషేధించాలని గతంలో యువజన సంఘాలు, చెంచు యువకులు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వటువర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతలబైలు గ్రామాల యువకులు వాపొతున్నారు.
- కఠిన చర్యలు తప్పవు
- నర్సిరెడ్డి, ఎక్సైజ్ సీఐ, అచ్చంపేట
నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేని చోట మద్యం అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. సారాయి కాచేవారిపైన ఇప్పటికే చాలా కేసులు నమోదు చేశాం. డిపాజిట్ తీసుకొని బెల్టుషాపులు నడిపిస్తున్న విషయం తమకు తెలియదు. అటువంటిది వాస్తవమని తేలితే మద్యం టెండర్ దుకాణ దారునిపై కేసులు నమోదు చేస్తాం.