చేసిన పనికి బిల్లులు ఇవ్వడంలేదని పాఠశాల గేటుకు తాళం
ABN , Publish Date - Feb 25 , 2026 | 11:20 PM
మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కంచనపల్లి గ్రామంలోని మన ఊరు, మనబడి కార్యక్రమంలో చేసిన పనులకు బిల్లులు రావడంలేదని విసుగుచెందిన గుత్తేదారు ఆంజనేయులు బుధవారం పాఠశాల గేటుకు తాళం వేశారు.
మిడ్జిల్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కంచనపల్లి గ్రామంలోని మన ఊరు, మనబడి కార్యక్రమంలో చేసిన పనులకు బిల్లులు రావడంలేదని విసుగుచెందిన గుత్తేదారు ఆంజనేయులు బుధవారం పాఠశాల గేటుకు తాళం వేశారు. చాలా సేపటి వరకు ఉపాధ్యాయులు, విద్యార్థులు చేసేదిలేక పాఠశాల బయట నిలుచున్నారు. పాఠశాల ప్రహరీ, వాష్‌రూంలతో పాటు పలు పనులకు సంబంధించి రూ. 23 లక్షల మంజూరుకాగా మొదట విడత రూ. 19 లక్షలు విడుదల చేశారు. మిగతా డబ్బులు ఇవ్వడంలేదని ఆరోపించారు. తాను అప్పులు తెచ్చి పనులు చేయించానని, తనకు వచ్చే బిల్లుల కన్నా తెచ్చిన అప్పులకు వడ్డీలు ఎక్కువగా చెల్లించానని గుత్తేదారు ఆవేదన వ్యక్తంచేశారు. చేసేదిలేక ఉపాధ్యాయులు పక్కన ఉన్న చిన్న గేటు తాళం తొలగించడంతో లోపలికి వెళ్లారు. అధికారుల సూచనలతో గేటుకు వేసిన తాళం తీశారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో గీతాంజలి, ఎస్సై శివనాగేశ్వర్‌నాయుడు పాఠశాల వద్దకు చేరుకొని ఎంబీ రికార్డుల ప్రకారం బిల్లులు వచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.