ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి
ABN , Publish Date - Feb 15 , 2026 | 11:20 PM
సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఆదివారం మునిసిపాలిటీలోని బొంగురాలగుట్ట, తుల్జాభవానీ ఆలయం వద్ద లంబాడీల ఐక్య వేదిక ఆధ్వర్యంలో, మండలంలోని లక్ష్మీనాయక్‌తండా సమీపంలోని గుట్టపై సర్పంచ్ మాంజ్యా ఆధ్వర్యంలో, మర్రిచెట్టుతండా వద్ద నాయకులు శ్రీనివాస్‌నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
జడ్చర్ల/రాజాపూర్/గండీడ్/మిడ్జిల్/పాలమూరు/మూసాపేట/నవాబ్‌పేట/హన్వాడ, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి) : సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఆదివారం మునిసిపాలిటీలోని బొంగురాలగుట్ట, తుల్జాభవానీ ఆలయం వద్ద లంబాడీల ఐక్య వేదిక ఆధ్వర్యంలో, మండలంలోని లక్ష్మీనాయక్‌తండా సమీపంలోని గుట్టపై సర్పంచ్ మాంజ్యా ఆధ్వర్యంలో, మర్రిచెట్టుతండా వద్ద నాయకులు శ్రీనివాస్‌నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం భోగ్ బండార్ నిర్వహించారు. రాజాపూర్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న సేవాలాల్ మహారాజ్ ఆలయం వద్ద మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటాన్ని ఊరేగించారు. గండీడ్ మండలం బల్సురుగొండ తండాలో సేవాలాల్ మహారాజ్ జయంతి సందరభంగా ప్రత్యేక పూజల అనంతర పల్లకీ ఊరేగింపు నిర్వహించారు. మిడ్జిల్ మండల కేంద్రంలో ఉత్సవ కమిటీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌నాయక్, పూజారి లక్ష్మణ్‌నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ చిత్ర పటాన్ని ఊరేగించారు. అనంతరం క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అంతకుముందు భక్తులకు అన్నదానం చేశారు. జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ నుంచి జయంతి ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గిరిజన భవన్ డెవలప్‌మెంట్ కమిటీ చైర్మన్ శేఖర్‌నాయక్, కన్వీనర్ శేఖర్‌నాయక్ పాల్గొని సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. మూసాపేట మండలంలోని కనకాపూర్, స్పూర్తితండాలో సేవాలాల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ర్యాలీగా మూసాపేటకు చేరుకున్నారు. నవాబ్‌పేట మండలం రేకులచౌడాపూర్ తండాలో మార్కెట్ డైరెక్టర్ శంకర్‌నాయక్, సర్పంచ్ రత్నమ్మ ఆధ్వర్యంలో సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. హన్వాడ మండలం అమ్మాపూర్, ఎర్రగట్టుతండా, పలుగుతండా, కారంతండా, దొర్రితండాలో సేవాలాల్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు.