Share News

దేవుడి పేరుతో ఇసుక దందా?

ABN , Publish Date - Aug 23 , 2026 | 11:35 PM

దేవుడి పేరుతో ఇసుక అక్రమ దందాకు శ్రీకారం చుట్టిన అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది.

దేవుడి పేరుతో ఇసుక దందా?
పరషవేదీశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో డంపు చేసిన ఇసుక

-ఆలయ ప్రాంగణంలో ఇసుక డంపులు

- సీజ్‌ చేయాలని గ్రామస్థుల డిమాండ్‌

జడ్చర్ల, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి) : దేవుడి పేరుతో ఇసుక అక్రమ దందాకు శ్రీకారం చుట్టిన అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని కుర్వగడ్డపల్లి సమీపంలోని దుందుభీ నది పరివాహకంగా ఉన్న పరషవేదీశ్వర స్వామి ఆలయ ప్రహరీ వద్ద ఇసుకను డంపు చేశారు. ఆలయ అభివృద్ధి పనులకు ఉపయోగించేందుకు డంపు చేశారనే భావనతో ఎవరూ అటువైపు చూడరని భావించారో.? ఏమో కాని ఏకంగా వందలాది ట్రాక్టర్ల ఇసుకను డంపు చేశారు. డంపు చేసిన ఇసుకను రాత్రి వేళ ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మిడ్జిల్‌ మండలం భైరంపల్లి శివారులో ఉన్న ఇసుక అక్రమ రవాణా జరుగకుండా దుందుభీ నదిలో నిర్మించిన చెక్‌డ్యాంకు సమీపంలో కందకాన్ని గ్రామస్థులు తవ్వారు. పరషవేదీశ్వర స్వామి ఆలయం వరకు మట్టిరోడ్డు నిర్మిస్తున్నామంటూ ఓ ఇసుకాసురుడు గ్రామస్థులకు పిట్టకథ చెప్పి, తవ్విన కందకాన్ని పూడ్చారు. రాత్రికి రాత్రి వందలాది ట్రాక్టర్ల ఇసుకను ఆలయ ప్రహరీ, సమీపంలో డంపు చేశాడు. ఇది గమనించిన భైరంపల్లి గ్రామస్థులు డంపు చేసిన ఇసుకను సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అందుకు సంబంధించి జడ్చర్ల తహసీల్దార్‌ నర్సింగ్‌రావు, సీఐ కమలాకర్‌లకు వినతిపత్రం అందజేశారు. డంపు చేసిన ఇసుకను సీజ్‌ చేయని పక్షంలో ఆందోళన చేపడుతామంటూ గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు. డంపు చేసిన ఇసుకను సీజ్‌ చేస్తారా.? లేక ఇసుకాసురుడికే వదిలేస్తారా అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Aug 23 , 2026 | 11:36 PM