Share News

సలేశ్వరుడా.. సల్లంగ చూడు..

ABN , Publish Date - Apr 02 , 2026 | 11:18 PM

మహిమాన్విత సలేశ్వర లింగమయ్య దర్శనం కోసం రెండు తెలుగు ఉభయ రాష్టాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

 సలేశ్వరుడా.. సల్లంగ చూడు..
సలేశ్వరం లోయలోకి వెళ్తున్న భక్తులు

- పౌర్ణమి దర్శనానికి పోటెత్తిన భక్తులు

- రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తుల రాక

- దర్శనానికి 10 గంటల సమయం

-తరలివస్తున్న వృద్ధులు, చిన్నారులు

- భక్తుల రద్దీకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు : కలెక్టర్‌

అచ్చంపేట, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): మహిమాన్విత సలేశ్వర లింగమయ్య దర్శనం కోసం రెండు తెలుగు ఉభయ రాష్టాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. రెండో రోజైన గురువారం చైత్ర పౌర్ణమి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. స్వామి దర్శనానికి 10 నుంచి 11 గంటల సమయం పడుతుందని భక్తులు తెలిపారు. నాగర్‌క ర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సంగ్‌జీ పాటిల్‌ ఎప్పటికప్పుడు సలేశ్వరం ఉత్సవాలపై పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. పౌర్ణమి సందర్భంగా చెంచు పూజారులు ఆదివాసి చెంచు సంప్రదాయాలతో పూజలు నిర్వహించారు సలేశ్వరం లోయలో భక్తులు కిక్కిరిసిపోయారు. చిన్న పిల్లల నుంచి వయోవృద్ధుల వరకు భక్తులు తరలిరావడంతో వారు ఇబ్బందులకు గురయారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం స్వచ్ఛంద సంస్థలు ఉచిత అన్న ప్రసాదాలను అందించారు. పోలీసు, అటవీశాఖ, మిషన్‌ భగీరథ అధికారులు సలేశ్వరం తరలి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా చర్యలు చేపట్టారు. మండుటెండల్లో ఎతైన పర్వతాలను ఎక్కుతూ దిగుతూ స్వామి దర్శనం కోసం గంటల కొద్ది భక్తులు క్యూలైన్లో వేచి దర్శనం చేసుకుంటున్నారు.

నేను 5 ఏళ్లుగా వస్తున్నా..

- జములమ్మ, భక్తురాలు, రాయచూర్‌

నా వయస్సు 70. మాది రాయచూర్‌. నేను 5 ఏళ్లుగా లింగమయ్య స్వామి దర్శంచుకునేందుకు వస్తున్నాను. ఎంత కష్టమైనా స్వామిని దర్శంచుకుంటే మాకు అంత బాగా జరుగుతుంది.

దర్శనం కాకుండానే వెళ్లిపోతున్నా..

- బాలస్వామి, అమ్మపల్లి జడ్చర్ల

లింగమయ్య స్వామి దర్శనం కోసం మొదటిసారిగా వచ్చాను. కొండలోపలికి కష్టపడుతూ దిగాను. కానీ లోపల కాలు తీసి కాలు మోపేటట్లు లేదు. భయం వేసింది. అక్కడి నుంచే స్వామిని మొక్కుకున్నాను.

భక్తుల రద్దీకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు : కలెక్టర్‌

నల్లమల అటవీ ప్రాంతంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్‌ గురువారం పర్యటించారు. సలేశ్వరం జాతర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. లింగాల మండలంలోని సుందరమైన నల్లమల అడవుల మధ్య వెలసిన సలేశ్వరం లింగమయ్య జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఏర్పాట్లపై భక్తులతో కలెక్టర్‌ ఆరా తీశారు. క్యూలైన్లు, పార్కింగ్‌ ప్రాంతాలు, ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలను సమీక్షించారు. ఎస్పీ కూడా పోలీస్‌ సిబ్బందికి పలు సూచనలు చేస్తూ ట్రాఫిక్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అటవీశాఖ అధికారి రేవంత్‌చంద్ర, అదనపు కలెక్టర్‌ అమరేందర్‌, అచ్చంపేట ఆర్డీవో యాదగిరితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సాయంత్రం 7 గంటల తర్వాత నో ఎంట్రీ

అచ్చంపేటటౌన్‌, (ఆంధ్రజ్యోతి): సలేశ్వరం జాతరలో భక్తుల రద్దీ కారణంగా సాయంత్రం 7 గంటల తర్వాత నో ఎంట్రీ ప్రకటించినట్లు అచ్చంపేట డిఎస్పీ పల్లె శ్రీనివాసులు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని సృష్టం చేశారు. జాతర ముగింపు రోజు శుక్రవారం భారీగా రద్దీ ఉండే అవకాశం ఉన్నందున భక్తులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Updated Date - Apr 02 , 2026 | 11:18 PM