వరి రైతు వ్యథ
ABN , Publish Date - May 19 , 2026 | 11:26 PM
ధాన్యం కొనుగోలు వ్యవహారం జిల్లాలో వివాదాస్పదంగానే కొనసాగుతున్నది.
- కొనుగోలు కేంద్రాల్లో అధికారులు, సిబ్బంది చేతివాటం
- 40కిలోల బస్తాకు సంచి తూకంపోను 900 గ్రాముల చొప్పున అదనంగా తూకం
- ఫిర్యాదులు వెల్లువెత్తినా పట్టించుకోని ఉన్నతాధికారులు
నాగర్‌కర్నూల్, మే 19 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం కొనుగోలు వ్యవహారం జిల్లాలో వివాదాస్పదంగానే కొనసాగుతున్నది. మొక్కజొన్న కొనుగోలు అంశంలో యంత్రాంగం దారుణంగా విఫలం కాగా వరి కొనుగోలు వ్యవహారం కూడా అన్నదాతలకు ఆశనీపాతంగా మారింది. వరి కొనుగోలు కేంద్రాల్లో అధికారులు, సిబ్బంది మిలాఖత్ అయి రైతాంగాన్ని నిండా ముంచుతున్న వైనం ‘ఆంధ్రజ్యోతి’ దృష్టికి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా రైతుల నుంచి అదనంగా వసూలు చేస్తున్న వ్యవహారం జిల్లాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
75,823 ఎకరాల్లో వరి సాగు
యాసంగి సీజన్‌లో జిలాల్లో మొక్కజొన్న తర్వాత వరి అధిక విస్తీర్ణంలో సాగైంది. నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లో దాదాపు 75,823 ఎకరాల్లో వరి సాగు కాగా, 2లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందనే అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 200 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఐకేపీ ఆధ్వర్యంలో 71, సింగిల్ విండోల నుంచి 123, మెప్మా ద్వారా 6, మిగతావి వ్యవసాయ మార్కెట్‌యార్డుల ద్వారా కొనుగోలును ప్రారంభించాయి.
అన్ని కేంద్రాల్లోనూ అవినీతే...
సూక్ష్మస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా జిల్లా అంతటా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవినీతి తాండవిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా తూకాలు చేస్తూ రైతులను నిండా ముంచుతున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ ఉప్పునుంతలలోని వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించగా 40కిలోల సంచికి సంచి తూకంపోను 900గ్రాములు అధికంగా వసూలు చేస్తున్నట్లు క్షేత్రస్థాయిలో తెలిసింది. ఈ అంశం గురించి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ప్రశ్నించగా ఇతిమిద్దమైన సమాచారం లభించకపోగా అంశాన్ని దాటవేస్తున్నారు. ఉన్నతాధికారులు చెప్పినట్లు తరుగు తీస్తున్నామని ఏది బయటకు చెప్పే పరిస్థితి లేదంటూ తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 200 వరి కొనుగోలు కేంద్రాల్లో అన్ని చోట్ల ఫిర్యాదులు ఉన్నప్పటికీ జిల్లా పౌరసరఫరాల శాఖ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గ్రేడ్-1 ధాన్యానికి 2389 రూపాయలు, ఆ తర్వాత రకానికి రూ.2,369 ఇవ్వాల్సి ఉండగా రాజకీయంగా పలుకుబడి కలిగిన వాళ్లకు నాణ్యత లేకున్నా కూడా మొదటి గ్రేడ్ రకానికి సిఫారసు చేస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. జిల్లాలో సాగు చేసిన 75,823 ఎకరాల్లో వరి దిగుబడి 2లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నప్పటికీ జిల్లాలో ఇప్పటి వరకు కొనుగోలు చేసిన వరి 7,062 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉండడం గమనార్హం.