Share News

తెరపైకి పునర్విభజన

ABN , Publish Date - Jan 09 , 2026 | 10:50 PM

జిల్లాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వంలో జరిగిన విభజన శాస్ర్తీయంగా జరగలేదని, పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసినప్పటికీ ఒక్కో నియోజకవర్గం రెండేసి జిల్లాల్లో ఉండేసరికి మౌలిక లక్ష్యం నెరవేరలేదని ప్రస్తుత ప్రభుత్వం పదేపదే వాదిస్తోంది.

తెరపైకి పునర్విభజన
మహబూబ్‌నగర్‌ మ్యాప్‌

నియోజకవర్గ పరిధి మొత్తం ఒకే జిల్లాలో ఉండేలా కసరత్తు

జనగణన తర్వాత ఉంటుందా? అంతకుముందేనా సందేహం

5 జిల్లాలుగా ఉమ్మడి పాలమూరు..

రంగారెడ్డి, వికారాబాద్‌లలోకి నియోజకవర్గాలు, మండలాలు

షాద్‌నగర్‌ కేంద్రంగా జైపాల్‌రెడ్డి పేరుతో కొత్త జిల్లా ప్రచారం

జిల్లా యూనిట్‌గానే నియోజకవర్గాలు ఉంటే పాలనా సౌలభ్యం

మహబూబ్‌నగర్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వంలో జరిగిన విభజన శాస్ర్తీయంగా జరగలేదని, పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసినప్పటికీ ఒక్కో నియోజకవర్గం రెండేసి జిల్లాల్లో ఉండేసరికి మౌలిక లక్ష్యం నెరవేరలేదని ప్రస్తుత ప్రభుత్వం పదేపదే వాదిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి స్పందించి జిల్లాలను తిరిగి పునర్వ్యవస్థీకరిస్తామని అ సెంబ్లీ వేదికగా ప్రకటించారు. దీంతో కొత్త జిల్లాల ఆశావహులు.. ఒక నియోజకవర్గం రెండేసి జిల్లాల్లో ఉన్న ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే గతంలోనే కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన చేస్తామని తీర్మానం చే సింది. ఇందుకోసం జిల్లాల సరిహద్దులను మార్పులు, చేర్పులు చేయవద్దని సూచించిం ది. దానివల్ల జనగణనలో ఇబ్బందులు ఏర్పడి, జిల్లాల వారీగా లెక్కలు తీయడం సాధ్యం కాదనేది కేంద్ర ప్రభుత్వ వాదన. దాంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల ఏర్పాటు విషయంలో ముందుకెళ్లడానికి జనగణన అడ్డంకిగా మారనుంది. ఒకవేళ జనగణన తర్వాత పునర్విభజనను తీసుకునే పక్షంలో దానికి మరో రెండేళ్లు ఆగాల్సి ఉంటుంది. తర్వాత జిల్లాల వారీగా జనాభా లెక్కల్లో కూడా తేడాలు వస్తాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రస్తుతం అయిదు జిల్లాల పరిధిలో ఉంది. దీంతోపాటు రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లోకి పలు మండలాలు వెళ్లాయి. పాలనా సౌలభ్యపరంగా ఎమ్మెల్యేలకు రెండు లేదా మూడు జిల్లాల్లో పర్యటించడం, అధికారులతో సమన్వయం చేసుకోవడం చాలా ఇబ్బందిగా మారింది. నియోజకవర్గం యూనిట్‌గా వచ్చిన నిధులు, పథకాల పంపిణీ కష్టతరంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే పునర్విభజన అంశంలో ఒత్తిడి వస్తోందని చెప్పవచ్చు.

జిల్లా యూనిట్‌గా ఉండేలా..

కేంద్ర ప్రభుత్వం 2027 మార్చిలో జనగణన పూర్తి చేసిన తర్వాత.. దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ మేరకు సంకేతాలు కూడా వస్తున్నాయి. దీనిప్రకారం రాష్ట్రంలో 2028 చివరిలో కాకుండా 2029 మేలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పార్లమెంట్‌ పరిధిలో రెండేసి నియోజకవర్గాలు పెం చే ప్రతిపాదనలు ఉన్నాయి. ఎక్కువ జనాభా ప్రకారం విభజన చేస్తే హైదరాబాద్‌ మహానగరంలోని నియోజకవర్గాల పెంపు జరుగుతుంది. అయితే నియోజకవర్గాల పెంపునకు ముందే జిల్లాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేస్తే ఒక్కో పార్లమెంట్‌ పరిధిలో రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు.. కొత్త పార్లమెంట్‌ నియోజకవర్గాలు సరైన పద్ధతిలో చేసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత ఆలోచన ప్రకారం ఒక జిల్లాలో కనీసం మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు కనిష్ఠంగా ఉండాలి. అలాగే గరిష్ఠంగా అయిదు నియోజకవర్గాలకు మించకూడదు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో అంతకంటే ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పటికే రేర్‌, క్యూర్‌, కేర్‌ విధానాన్ని అవలంభిస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీలో భారీ విలీనం చేసింది. ఇప్పుడు జోనల్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రస్తుతం వనపర్తి జిల్లాలో ఒకే ఒక నియోజకవర్గం పూర్తిగా ఉంది. దేవరకద్ర, మక్తల్‌, కొల్లాపూర్‌ నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గాలు పూర్తిగా ఉండగా.. కొల్లాపూర్‌, కల్వకుర్తి నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌లలో దేవరకద్ర, జడ్చర్ల, పరిగి, నారాయణపేట ఇలా చాలా నియోజకవర్గాలకు చెందిన మండలాలు ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క నియోజకవర్గం పూర్తిగా ఉండగా.. మిగతా రెండు నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గం వికారాబాద్‌, నారాయణపేట జిల్లాల్లో ఉంది. నియోజకవర్గాల పునర్విభజనను ఆసరాగా చేసుకుని జిల్లాల పునర్విభజన అంశం చేపట్టే అవకాశం కచ్చితంగా ఉందని చెప్పవచ్చు.

షాద్‌నగర్‌ కేంద్రంగా జిల్లా..

గతంలో ఉమ్మడి జిల్లాలో భాగంగా ఉన్న షాద్‌నగర్‌.. పునర్విభజన తర్వాత రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వెళ్లిపోయింది. మహబూబ్‌నగర్‌కు తలమానికంగా ఉన్న నియోజకవర్గం మొత్తం అర్బన్‌ పరిధిలోకి వెళ్లడంతో కొంత ఇబ్బందులు పడ్డారు. అయితే ఇప్పుడు అదే షాద్‌నగర్‌ కేంద్రంగా కొత్త జిల్లా ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కల్వకుర్తి పార్ట్‌ ఉండగా.. మిగతా ఏడు పూర్తిగా జిల్లా పరిధిలో ఉన్నాయి. అయితే ఓఆర్‌ఆర్‌ బయట.. భారత్‌ ప్యూచర్‌ సిటీని ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. రీజనల్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో రంగారెడ్డి జిల్లాలో ఉన్న నియోజకవర్గాలను కుట్టేసి.. ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వంలో చర్చ వచ్చినట్లు తెలుస్తోంది. అందులో ఉమ్మడి జిల్లాలో భాగంగా ఉన్న కల్వకుర్తి, అమనగల్లు, తలకొండపల్లి, మాడుగుల, షాద్‌నగర్‌ నియోజకవర్గంతోపాటు చేవెళ్ల తదితర ప్రాంతాలతో కలిసి ఒక నియోజకవర్గం షాద్‌నగర్‌ కేంద్రంగా ఏర్పాటు చేస్తారనే చర్చ నడుస్తోంది. అప్పుడు ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌లో ఉన్న కల్వకుర్తి పూర్తిగా వేరే జిల్లాలోకి వెళ్లిపోతుందనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఇందుకు దివంగత పార్లమెంట్‌ సభ్యుడు ఎస్‌. జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం. జనగణన పూర్తయిన తర్వాత.. నియోజకవర్గాల పునర్విభజనకు మధ్యలో జిల్లాల పునర్విభజన చేపట్టే అవకాశం ఉంది.

Updated Date - Jan 09 , 2026 | 10:50 PM