Share News

అద్దె తడిసి మోపెడు

ABN , Publish Date - Feb 20 , 2026 | 11:20 PM

ప్రభుత్వానికి మైనారిటీ గురుకులాల అద్దె తడిసి మోపెడవుతోంది. విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయిలో విద్య అందించాలన్న ఉద్దేశంతో గత ప్ర భుత్వం ఉమ్మడి జి ల్లా వ్యాప్తంగా మైనారిటీ గురుకులాలను ప్రారంభించింది.

అద్దె తడిసి మోపెడు
బోయపల్లి శివారులో 80 శాతం పనులు పూర్తయిన మైనారిటీ గురుకుల పాఠశాల భవనం

మైనారిటీ గురుకులాల అద్దె నెలకు రూ.52లక్షలు

నిధులు మంజూరైనా పూర్తి కాని భవనాల నిర్మాణం

బోయపల్లి సమీపంలో 80 శాతం పూర్తి

నాలుగేళ్లుగా నిర్మాణంలోనే బిల్డింగులు.. తప్పని ఆర్థిక భారం

మహబూబ్‌నగర్‌ అర్బన్‌, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వానికి మైనారిటీ గురుకులాల అద్దె తడిసి మోపెడవుతోంది. విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయిలో విద్య అందించాలన్న ఉద్దేశంతో గత ప్ర భుత్వం ఉమ్మడి జి ల్లా వ్యాప్తంగా మైనారిటీ గురుకులాలను ప్రారంభించింది. కొన్ని చోట్ల 5వ తరగతి నుంచి పదో తరగతి వరకు ఉం డగా, ఆ తర్వాత కొన్ని పాఠశాలలను ఇంటర్‌ వరకు అప్‌గ్రేడ్‌ చేసింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో బాల,బాలికల గురుకులాలు 20 వరకు ఉన్నాయి. వాటి పరిధిలో సుమారుగా 10 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆ గురుకులాలన్నీ అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. నెలకు వా టికి అద్దె రూపంలో రూ.52.43 లక్షలు చెల్లిస్తున్నారు. సొంత భవనాలకు ప్రభుత్వం స్థలం కేటాయించి, ని ధులు విడుదల చేసినా అవి నాలుగైదేళ్లుగా నిర్మాణంలోనే ఉన్నాయి. ఫలితంగా ప్రభుత్వానికి నెలకు రూ.52 లక్షల చొప్పున సంవత్సరానికి రూ.6.29 కోట్లు అద్దె భారం పడుతోంది. భవన నిర్మాణాలు పూర్తయితే ఈ భారం తగ్గనుంది.

అన్నీ అద్దె భవనాల్లోనే..

మహబూబ్‌నగర్‌ జిల్లాలో 6 మైనారిటీ గురుకులాలకు భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం 2016లో ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో గురుకులానికి రూ.20 కోట్ల చొప్పున రూ.120 కోట్లు మంజూరు చేసింది. బోయపల్లి శివారులో బాలికల భవనానికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. 2019లో పనులు ప్రారంభించారు. 80 శాతానికిపైగానే పనులు పూర్తయ్యాయి.

వీరన్నపేట డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కాలనీ వద్ద రెండు బాలికలు, మూడు బాలుర గురుకుల భవనాలకు 15 ఎకరాల స్థలం కేటాయించారు. 2022లో పనులు మొదలు పెట్టారు. పిల్లర్ల వరకు నిర్మించి, వదిలేశారు.

జడ్చర్లలో ఒకటి, దేవరకద్రలో రెండు గురుకులాలు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తిలలో ఒక్కో గురుకులం నిర్మాణానికి స్థలాలు కేటాయించారు. వనపర్తిలో రెండు, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ఒక్కో గురుకులానికి కూడా స్థలాలు ఇచ్చారు. కానీ పనులు ఎప్పుడు మొదలు పెడతారో తెలియని పరిస్థితి ఏర్పడింది.

అద్దె చెల్లించలేదని తాళాలు..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 మైనారిటీ గురుకులాలూ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. గత ఏడాది అక్టోబరు వరకు 11 నెలల అద్దె పేరుకపోవడంతో యజమానులు పలు చోట్ల భవనాలకు తాళాలు వేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని న్యూటౌన్‌లో ఉన్న బాలుర-2 గురుకులంతో పాటు పలు భవనాలకు తాళాలు వేశారు. దాంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

బోయపల్లి గురుకులాన్ని త్వరలో ప్రారంభిస్తాం

జిల్లా కేంద్రంలోని బోయపల్లి వద్ద నిర్మిస్తున్న బాలికల గురుకుల భవనం పనులు తుది దశకు చేరుకున్నాయి. కలెక్టర్‌ ఆదేశాలతో పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ నెల 25 లేదా, మార్చిలో తరగతులు ప్రారంభించాలని ఆలోచిస్తున్నాం. ఇవి అందుబాటులోకి వస్తే అద్దె భారం తగ్గుతుంది.

-ఇందిర, జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి

Updated Date - Feb 20 , 2026 | 11:20 PM