Share News

పునరావాసం.. వివాదాస్పదం

ABN , Publish Date - Apr 17 , 2026 | 11:29 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లా, నల్లమలలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టు నుంచి చెంచులను మైదాన ప్రాంతాలకు తరలింపు ప్రక్రియ క్రమంగా వివాదాస్పదం అవుతోంది.

పునరావాసం.. వివాదాస్పదం
నల్లమల నుంచి మైదాన ప్రాంతంలో పునరావాసానికి తరలించనున్న వటవర్లపల్లి గ్రామం

- నల్లమల నుంచి మైదాన ప్రాంతాలకు చెంచులు

- పెద్దకొత్తపల్లి మండలం బాచారంలో శాశ్వత ఆవాసం

- గిరిజనుల తరలింపుపై పార్టీలు, ప్రజా సంఘాల అభ్యంతరం

- అడవి బిడ్డలపై కుట్రలను సహించబోమని ప్రకటనలు

నాగర్‌కర్నూల్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్‌ జిల్లా, నల్లమలలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టు నుంచి చెంచులను మైదాన ప్రాంతాలకు తరలింపు ప్రక్రియ క్రమంగా వివాదాస్పదం అవుతోంది. ఒకవైపు మౌలిక వసతులతో కూడిన ఆవాసాలు, ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని ఇవ్వడంతో పాటు దాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూడా తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. మరో వైపు వందల ఏళ్లుగా నల్లమలనే నమ్ముకొని జీవనం గడుపుతున్న అడవి బిడ్డలను మైదాన ప్రాంతాలకు తరలించడాన్ని పర్యావరణవేత్తలు, ప్రజాసంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అడవితో ముడిపడిన చెంచుల జీవితాలను వేరు చేసి, తల్లీ బిడ్డల వంటి పేగు బంధాన్ని తెంచేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని భారత రాష్ట్ర సమితి, తెలంగాణ జాగృతి ప్రకటించాయి. ఈ నేపథ్యంలో చెంచుల భవిష్యత్తు నల్లమలలోనా, మైదాన ప్రాంతాల్లోనా అన్నది సందిగ్ధంగా మారింది. పునరావాసానికి వెళ్లడంపై చెంచు సంఘాల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో మున్ముందు పరిస్థితి ఎలా మారబోతోందన్న అంశం ప్రశ్నార్థకమైంది.

5 గ్రామాలు 1,088 కుటుంబాలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని నాగర్‌కర్నూల్‌, కర్నూల్‌, నల్గొండ, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో దాదాపు 2.75 లక్షల హెక్టార్లలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. పులులు, చిరుతలకు ఈ ప్రాంతం అనువుగా ఉంటోంది. నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ గణాంకాల ప్రకారం ప్రతీ ఏటా పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అభయారణ్యం పరిధిలోని చెంచు పెంటలు, శ్రీశైలం ప్రధాన రహదారి వెంట ఉన్న గ్రామాల్లో నివసిస్తున్న వారిని మైదాన ప్రాంతాలకు తరలించి, వన్యప్రాణుల స్వేచ్ఛా జీవనానికి ఆటంకం లేకుండా చూడాలని అటవీశాఖ అనేక ప్రణాళికలను రూపొందించింది. దాదాపు పదేళ్ల నుంచి ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. పులుల సంచారం అధికంగా ఉన్న తాటిగుండాల, కొల్లంపెంట, వటవర్లపల్లి, కుడిచింతలబైలు ప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు 1,088 కుటుంబాలకు మైదాన ప్రాంతాల్లో పునరావాసం కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయించాయి. ఆ కుటుంబాలకు ఫేజ్‌-1 కింద శాశ్వత పునరావాసం కల్పించేందుకు కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం, బాచారం సోషల్‌ ఫారెస్టును ఎంపిక చేశారు. ఇక్కడ మౌలిక సదుపాయాలతో పక్కా ఇళ్లు, ప్రతీ చెంచు కుటుంబానికి ఐదెకరాల భూమి ఇచ్చేందుకు కార్యాచరణను రూపొందించారు. ఇప్పటికే 70 శాతం పనులను దాదాపు పూర్తి చేశారు. మొదటి విడతలో తాటిగుండాల, కొల్లంపెంట, గ్రామాల నుంచి 417 కుటుంబాలు, మిగతా గ్రామాలను కలుపుకొని మొత్తం 1,088 కుటుంబాలు గ్రామసభల ద్వారా పునరావాసానికి అంగీకారం తెలిపినట్లు అటవీశాఖ అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. అడవిని వీడేందుకు వారితో నిర్బంధంగా సంతకాలు చేయించుకున్నారని, చెంచుల సంతకాలను ఫోర్జరీ చేశారని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

పునరావాసానికి బాచారం సిద్ధం

అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టులోని ఐదు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించేందుకు పెద్దకొత్తపల్లి మండలం బాచారం ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ప్రస్తుత అక్కడ ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. పునరావాసం పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి త్వరలో అధికారిక పత్రాలు అందజేస్తారనే సమాచారంతో రెవెన్యూ శాఖ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. లబ్ధిదారులకు ఐదెకరాల చొప్పున అందించాల్సిన భూమిని చదును చేస్తున్నారు. నల్లమలలో వన్యప్రాణుల కారణంగా వ్యవసాయం సజావుగా సాగక అనేక కష్టనష్టాలు అనుభవించామని మైదాన ప్రాంతాలకు తరలించేంత వరకు తమను ఉత్సాహపరిచి ఆ తర్వాత విస్మరిస్తే తమ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతుందని పునరావాస గ్రామాల ప్రజలు తమ ఆవేదనన వ్యక్తంచేస్తున్నారు.

ఎన్నాళ్లీ అడవి బతుకులు

నల్లమల అటవీ ప్రాంతంలో జీవిస్తున్న చెంచులకు ప్రభుత్వపరంగా విద్య, వైద్యం అందడం లేదు. రోగాల బారినపడి ఎందరో చెంచులు 30 ఏళ్లకే కాటికి చేరుతున్నారు. ఈ ప్రాంతంలో సరైన వైద్యం కడా అందడం లేదు. ఇప్పటివరకూ మా జీవితం అడవిలోనే గడిచిపోయింది. మా పిల్లల బతుకులైనా బాగుపడతాయని మైదాన ప్రాంతాలకు వెళ్లేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చాం.

- మండ్లి బౌరమ్మ, మాజీ సర్పంచ్‌, కుడిచింతలబైలు

ఉపాధి అవకాశాలు లేవు

వటవర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతలబైలు గ్రామాల్లో ప్రభుత్వపరంగా ఉపాధి అవకాశాలు లభించడం లేదు. సరైన విద్య, వైద్యం అందడం లేదు. దీంతో చాలా మంది యువకులు బతుకుదెరువు కోసం పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారు. గ్రామాల్లో ఉన్న రైతులు వ్యవసాయం చేయడానికి అటవీ జంతువుల నుంచి ఆటంకాలు ఏర్పాడుతున్నాయి. అందుకే స్వచ్ఛంద పునరావాసం కోరుకుంటున్నాం.

- ఆప్పిషు సాయిబాబు, సంయుక్త పునరావాస గ్రామాల అధ్యక్షుడు

Updated Date - Apr 17 , 2026 | 11:29 PM