సవాళ్లెన్నో..!
ABN , Publish Date - Feb 19 , 2026 | 11:29 PM
డివిజన్‌ల సంఖ్య కూడా పెరిగింది. రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఒకే ఒక్క డంపింగ్ యార్డ్‌తోనే ఏళ్లతరబడి నెట్టుకువస్తున్నారు.
- నగర పాలక మండలి ముందు సమస్యల దండు
- పారిశుధ్య నిర్వహణపై దృష్ఠి సారించాల్సిందే
- పెరిగిన డివిజన్‌లకు అనుగుణంగా సిబ్బందిని పెంచుకోవాలి
- నగరానికి మరోవైపున డంపింగ్‌యార్డ్ ఏర్పాటు చేస్తే తగ్గనున్న నిర్వహణ భారం
- అండర్‌గ్రౌండ్ డ్రైనేజీతో తీరనున్న ప్రధాన సమస్య
- ప్రతిరోజు నగరంలో 106 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఏడాది ప్రత్యేక పాలన అనంతరం కొత్త నగరపాలక సంస్థ ఏర్పాటైంది. పాలక మండలి కొలువుదీరింది. కొత్తగా పగ్గాలు చేపడుతున్న పాలకమండలి ముందు సవాళ్లు ఎన్నో ఉన్నాయి. ముందుగా కార్పొరేషన్ అంటేనే పారిశుఽధ్యం.. తాగునీరు గుర్తుకు వస్తాయి. ఏడాదిగా ప్రత్యేక పాలన కొసాగడం.. ఎన్నికల హడావిడితో పారిశుధ్య నిర్వహణ కాస్త అస్తవ్యస్తంగానే మారింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన పాలక మండలి పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్ఠి సారించాల్సిన అవసరం ఉంది. ఇదివరకు మునిసిపాలిటీలో 49 వార్డులు ఉండగా, కార్పొరేషన్ అయిన తరువాత 60 డివిజన్‌లకు పెరిగాయి. 49 వార్డులు ఉన్నపుడే చాలీచాలని పారిశుధ్య సిబ్బందితో నెట్టుకురాగా, ఇప్పుడు 60 డివిజన్‌లకు అదే సిబ్బందిని పంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం నగరపాలికలో రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది అంతా కలిసి 415 మంది మాత్రమే ఉన్నారు. నిబంధనల ప్రకారం ప్రతీ 10 వేల జనాభాకు 28 మంది సిబ్బంది ఉండాలి. ఈ లెక్కన దాదాపుగా 2.70 లక్షల జనాభాకు దాదాపు 780 మంది పారిశుధ్య సిబ్బంది అవసరం అవుతారు. సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో రకరకాల విభాగాలు పనిచేస్తాయి. ట్రాక్టర్‌లకు కొంతమంది సిబ్బందిని, తడిపొడి చెత్త సేకరణకు కొందరు, రహదారులు ఊడ్చేందుకు కొందరు, మురుగు కాలువలు క్లీనింగ్‌కు కొందరు ఇలా రకరకాల విభాగాల సిబ్బంది ఇందులో పని చేస్తుంటారు. ఒక్కో డివిజన్‌ను 10-15 మంది పనిచేయాల్సి ఉంటుంది. సిబ్బందిని పెంచుకోవడంతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో చాలామంది పనిచేయకుండానే జీతాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అందులో ఎంతమంది ఆక్టివ్‌గా పని చేస్తున్నారు? అనారోగ్య సమస్యలతో ఎందరు బాధపడుతున్నారు? ఎంతమంది వయస్సు ఇబ్బందికరంగా మారుతుందో వంటి వివరాలు తీసుకుని సెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
విస్తరిస్తున్న నగరానికి మరో డంపింగ్‌యార్డ్ అవసరం
నగరం వేగంగా విస్తరిస్తోంది. డివిజన్‌ల సంఖ్య కూడా పెరిగింది. రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఒకే ఒక్క డంపింగ్ యార్డ్‌తోనే ఏళ్లతరబడి నెట్టుకువస్తున్నారు. కోయిలకొండ ఎక్స్‌రోడ్ దగ్గర గుట్టలో అప్పట్లో 25 ఎకరాల స్థలంలో డంపింగ్ యార్డ్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇక్కడ చెత్తగుట్టల్లా పేరుకుపోయింది. అప్పన్నపల్లి, ఎదిర, క్రిష్ఠియన్‌పల్లి, మర్లు, పాలకొండ వంటి ప్రాంతాల నుంచి ఇక్కడికే చెత్త తీసుకురావాల్సి ఉంటుంది. అంత దూరం నుంచి చెత్తను తీసుకురావాలంటే సమయం వృధా కావడంతో పాటు డీజిల్ వ్యయం ఎక్కువగా అవుతోంది. దూరప్రాంతాల నుంచి రోజుకు ట్రాక్టర్‌ల ద్వారా రెండు ట్రిప్పుల చెత్తనే తరలిస్తున్నారు. అదే సగం ప్రాంతాలకు పాలకొండ, క్రిష్ఠియన్‌పల్లి వైపు మరో డంపింగ్ యార్డ్‌ను ఏర్పాటు చేస్తే 20 డివిజన్‌లకు సంబంధించిన చెత్తను కొత్త డంపింగ్ యార్డ్‌కు చేరవేస్తే చాలావరకు సమయంతో పాటు ఖర్చుభారం తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇదివరకు మౌలాలి గుట్టపై 10 ఎకరాల స్థలం చూసినా అది అనువుగా ఉండటం లేదని మానేశారు. నగరంలో ప్రతిరోజు 106 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. ఆ చెత్తనంతా ప్రతిరోజు డంపింగ్‌కు తరలించాల్సి ఉంటుంది.
72 ఆటోలు.. 23 ట్రాక్టర్‌లు
తడిపొడి చెత్తద్వారా ఇళ్ల నుంచి ఉత్పత్తి అయ్యే చెత్తను స్వచ్ఛ ఆటోల ద్వారా తరలిస్తున్నారు. ఇందుకోసం 72 ఆటోలు పనిచేస్తున్నాయి. తడిపొడి చెత్తను వేరుచేసి డీఆర్‌సీ కేంద్రాల ద్వారా సెగ్రిగేషన్ చేయిస్తున్నారు. అదేవిధంగా కార్పొరేషన్‌కు సంబంధించిన 11 ట్రాక్టర్‌లతో పాటు ప్రైవేట్ ట్రాక్టర్‌లు మరో 12 పని చేస్తున్నాయి. ప్రైవేట్ ట్రాక్టర్లకు నెలకు ఒక్కో ట్రాక్టర్‌కు రూ.1.15 లక్షలు చెల్లిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు నలుగురు సిబ్బంది, డ్రైవర్, డీజిల్ ఖర్చులన్నీ ట్రాక్టర్ యజమానే చూసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం వాహనాల సంఖ్య సరిపోయేంతగానే ఉంది.
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీతో మెరుగుపడనున్న పారిశుధ్యం
నగరంలో అండర్‌రగ్రౌండ్ డ్రైనేజీ విధానం వస్తే పారిశుధ్య సమస్య చాలావరకు తీరనుంది. ప్రభుత్వం ఇప్పటికే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.623 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులు ప్రారంభమై పూర్తి అయితే ఓపెన్ డ్రైనేజీల సమస్య, రోడ్లపైకి మురుగుపారడం వంటి సమస్యలు తొలగనున్నాయి. దుర్ఘంధం, పందులు, దోమల బెడద చాలావరకు తీరడంతో పాటు నగరం స్మార్ట్‌సిటీగా మారేందుకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఎంతగానో దోహదపడుతుంది. మునిసిపల్ వర్కర్స్‌కు శ్రమ కూడా చాలావరకు తగ్గడంతో పాటు కార్పొరేషన్‌కు నిర్వహణ భారం తగ ్గనుంది.