వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:28 PM
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందితేనే రైతుకు లాభం చేకూరుతోందని, గతంలో విద్యుత్ సమస్యలు ఎక్కువగా ఉండేవని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని బలోపేతం చేస్తూ కొత్త సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తోందని పశుసంవర్ధక, స్పోర్ట్ అండ్ యూత్ సర్వీసెస్ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.
- పశుసంవర్ధక, స్పోర్ట్ అండ్ యూత్ సర్వీసెస్ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
- రెండేళ్లలో జడ్చర్లకు 22 సబ్‌స్టేషన్లు మంజూరు : ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
మిడ్జిల్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందితేనే రైతుకు లాభం చేకూరుతోందని, గతంలో విద్యుత్ సమస్యలు ఎక్కువగా ఉండేవని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని బలోపేతం చేస్తూ కొత్త సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తోందని పశుసంవర్ధక, స్పోర్ట్ అండ్ యూత్ సర్వీసెస్ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు రైతులకు సరైన మద్ధతు ఇవ్వలేదని విమర్శించిన మంత్రి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వరికి మద్ధతు ధరతో పాటు బోనస్ ప్రకటించి రైతులకు భరోసా కల్పించిందన్నారు. ఆదివారం మండలంలోని బోయిన్‌పల్లి గ్రామంలో రూ.3.05 కోట్ల వ్యవయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, కలెక్టర్ ఖుష్బూగుప్తాతో కలిసి ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ శశికళ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడారు. జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధికి పనులు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటానన్నారు. నియోజకవర్గంలో 31 సబ్‌స్టేషన్లు ఉండగా, రెండేళ్లలో ఎమ్మెల్యే కృషితో 22కు పైగా సబ్‌స్టేషన్లు మంజూరు కావడం అభినందనీయం అన్నారు. ముదిరాజ్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. పాఠశాలకు ప్రహరీ, బాలికలకు ఇబ్బంది లేకుండా మరుగుదొడ్డి సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో చర్చించి నియోజకవర్గంలో 22 సబ్‌స్టేషన్లు మంజూరు చేయించామని, వాటిలో మొదటిది బోయిన్‌పల్లిలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గ అభివృద్ధికి రూ.213 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చినట్లు తెలిపారు. అంతకుముందు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. బల్క్‌మిల్క్ చిల్లింగ్ సెంటర్‌ను పరిశీలించారు. వెలుగొమ్ము గ్రామంలోని పెదిరెడ్డి సంధ్యబాల్‌రెడ్డి ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. బోయిన్‌పల్లిలో గుంతలో పడి మృతి చెందిన బాలుడి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చెక్కు అందజేశారు. మార్కెట్ ఛైర్మన్ జ్యోతిఅల్వాల్‌రెడ్డి, సూపరిండెంట్ ఇంజనీర్ మహబూబ్‌నగర్ భీమానాయక్, డీఈ చంద్రమౌళి, ప్రసాదరావు, దినేష్ మోహన్‌రావు, ఏడీఈ చంద్రశేఖర్, ఏఈ నరేందర్‌గౌడ్, తహసీల్దార్ స్వప్న, ఎంపీడీవో గీతాంజలి, ఆర్‌ఐ అంబిక, ఉప సర్పంచ్ రామస్వామి, సర్పంచులు శంకర్, రాజునాయక్, రాములు, ఉప సర్పంచ్ శ్రీనివాస్‌నాయక్ పాల్గొన్నారు.