Share News

శరవేగంగా పంపింగ్‌ ప్రక్రియ

ABN , Publish Date - Oct 16 , 2026 | 11:45 PM

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా బాహుబలి మోటార్ల ద్వారా కృష్ణా జలాలతో నార్లాపూర్‌ రిజర్వాయర్‌ను నింపే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నది.

 శరవేగంగా పంపింగ్‌ ప్రక్రియ
నార్లాపూర్‌ రిజర్వాయర్‌లో కృష్ణా జలాల పంపింగ్‌ ప్రక్రియ కొనసాగుతున్న దృశ్యం

- పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా..

- నార్లాపూర్‌ రిజర్వాయర్‌లో 4.5 టీఎంసీల నీటి నిల్వ

- మూడు రోజుల్లో ఆరు టీఎంసీలకు చేరుకోనున్న కృష్ణా జలాలు

- తొలి ప్రాధాన్యతగా మిషన్‌ భగీరథకు కృష్ణా జలాల మళ్లింపు

- నవంబరు చివరి వరకు కేఎల్‌ఐ ద్వారా సాగునీరందించేందుకు ప్రత్యేక కార్యాచరణ

నాగర్‌కర్నూల్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి) : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా బాహుబలి మోటార్ల ద్వారా కృష్ణా జలాలతో నార్లాపూర్‌ రిజర్వాయర్‌ను నింపే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నది. మరో మూడు రోజుల్లో రిజర్వాయర్‌లలో నీటి నిల్వ 6 టీఎంసీలకు చేరుకోనుంది. దీంతో నార్లాపూర్‌ రిజర్వాయర్‌ వద్ద ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు కేఎల్‌ఐ రైతుల్లో భరోసా ఏర్పడింది. అయితే, ఎల్‌నినో ప్రభావం కారణంగా మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి ఇబ్బందులు నివారించడానికి ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తూనే కేఎల్‌ఐ ఆయకట్టు కింద పంటలను కాపాడేందుకు కూడా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతుండడం గమనార్హం.

మరో మూడు రోజుల్లో 6టీఎంసీలకు చేరుకోనున్న నీటి నిల్వ

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా ఉన్న నార్లాపూర్‌ రిజర్వాయర్‌లో మరో మూడు రోజుల్లో నీటి నిల్వ ఆరు టీఎంసీలకు చేరుకోనుంది. ఒక్కొక్కటి 145 మెగావాట్ల సామర్థ్యం గల బాహుబలి మోటార్ల ద్వారా ఇప్పటికే 4.5 టీఎంసీల కృష్ణా జలాలను నార్లాపూర్‌ రిజర్వాయర్‌కు పంపింగ్‌ చేశారు. మూడు రోజుల్లో రోజుకు 0.5టీఎంసీల నీటిని నార్లాపూర్‌కు పంపింగ్‌ చేసే విధంగా ఇరిగేషన్‌ అధికారులు అవసరమైన కార్యాచరణను అమలు చేస్తున్నారు.

మిషన్‌ భగీరథకు తొలి ప్రాధాన్యం

ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం భూగర్భ జలాలు కూడా క్రమంగా తగ్గుతుండడంతో నార్లాపూర్‌ రిజర్వాయర్‌లో చోటు చేసుకున్న కృష్ణా జలాలను మిషన్‌ భగీరథ పథకానికి తరలించేందుకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యతనిస్తోంది. ఎల్లూరు సమీపంలో మిషన్‌ భగీరథ గ్రిడ్‌ వద్ద తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్‌, వనపర్తి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, వికారాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల పరిధిలోని 780 ఆవాసాలకు తాగునీటిని సరఫరా చేసే ప్రత్యేక వ్యవస్థ ఉండడం తెలిసిందే.

నవంబరు చివరి వరకు కేఎల్‌ఐ ఆయకట్టుకు సాగునీరందించేలా యాక్షన్‌ ప్లాన్‌

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో దాదాపు 4.52 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. వానాకాలం సీజన్‌లో నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 2.4లక్షల ఎకరాల్లో పత్తి, లక్షా 46వేల ఎకరాల్లో వరి పండించారు. మిగతా విస్తీర్ణంలో మినుములు, వేరుశనగ పంటలను కూడా జిల్లాలో సాగు చేశారు. మృగశిర కార్తెలో తొలకరి పలకరింపుతో పత్తి పంట వేసిన రైతులకు నిరాశే మిగిల్చింది. రెండవ సారి కూడా పత్తి విత్తనాలు వేయాల్సి రావడంతో పెట్టుబడి భారం పెరిగింది. ఈ క్రమంలో బోర్లు, బావుల కింద నీటి వసతి ఉన్న రైతులకు దాదాపు 10-13క్వింటాళ్ల దిగుబడి రాగా వర్షాలు, కేఎల్‌ఐని నమ్ముకున్న రైతులకు ఆశించినంత దిగుబడి రాలేదు. ఎకరాకు 5-6క్వింటాళ్లు దిగుబడి మాత్రమే వస్తుండటంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఉత్పన్నమైంది. జిల్లాలో లక్షా 46వేల ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేయగా, పంట చేతికందే వరకు నవంబరు చివరి వారం దాకా సమయం పడుతుంది. అయితే, శ్రీశైలం ప్రాజెక్టులో రోజు రోజుకు తగ్గుతున్న నీటి నిల్వల నేపథ్యంలో అత్యవసరమైన పరిస్థితిలో నార్లాపూర్‌ నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌ వరకు ఉన్న ఫ్లూయిస్‌ ద్వారా వరి పంట చేతికొచ్చే వరకు కృష్ణా జలాలను పంట పొలాలకు మళ్లించే విధంగా ఇరిగేషన్‌ అధికారులు యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించడం గమనార్హం. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఎల్లూరు రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థ్యం 0.36, సింగోటం 0.56, జొన్నలబొగుడ 2.14, గుడిపల్లి గట్టు రిజర్వాయర్‌ నీటి నిల్వ సామర్థ్యం 0.9గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శ్రీశైలంలో నీటి లభ్యత 843 అడుగులు ఉంది. 804కు చేరిన కేఎల్‌ఐ ద్వారా నీటిని రిజర్వాయర్లకు తరలించే అవకాశం ఉంది. అయితే, ఉభయ తెలుగు రాష్ట్రాలు కృష్ణా జలాలను వ్యవసాయ లేదా విద్యుత్‌ అవసరాల కోసం వినియోగించుకునే అంశాన్ని బట్టి ఆయకట్టుకు నీరందే పరిస్థితి ఆధారపడి ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైన ఆయకట్టు రైతులకు వరి కోతలు పూర్తయ్యే దాకా నీరందించే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్తల్లో భాగంగా పాలమూరు-రంగారెడ్డి పథకంలో నార్లాపూర్‌ రిజర్వాయర్‌లోని రెండు పంపులను వినియోగించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Updated Date - Oct 16 , 2026 | 11:45 PM