Share News

రాష్ట్రంలో ప్రజాపాలన

ABN , Publish Date - Sep 18 , 2026 | 12:04 AM

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

రాష్ట్రంలో ప్రజాపాలన
జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, చిత్రంలో కలెక్టర్‌ ఖుష్బూగుప్తా, ఎస్పీ డీ జానకి, మేయర్‌ జీ మమత, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌; మాట్లాడుతున్న మంత్రి జూపల్లి

- ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం

- అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యం

- పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

- ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌ కార్యాలయ ఆవరణలో గురువారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు జాతీయ పతకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయ కత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబరు 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోందన్నారు. పాలనలో పారదర్శకత, సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పిం చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజలకు ఇచ్చిన హమీ మేరకు ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ, సంక్షేమం, అభివృద్దికి సమాన ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ రాష్ట్ర సర్వోతోముఖాభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మహాలక్ష్మి, అర్హులైన వారికి రూ. 500కు గ్యాస్‌ సిలిండర్‌ గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్‌ రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు తదితర అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతీ ఒక్కరి సహకారం అవసరమని కోరారు. ఉత్సవాల్లో భాగంగా పలు పాఠశాలల విద్యార్థులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్తూ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కలెక్టర్‌ ఖుష్బూగుప్తా, ఎస్పీ డి. జానకి, నగర మేయర్‌ జి.మమత, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, అదనపు కలెక్టర్లు మధుసూదన్‌నాయక్‌, జేఎల్‌బీ హరిప్రియ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాయిశివాని, డీఆర్‌వో ఎ. నిర్మల, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2026 | 12:04 AM