ప్రారంభంకాని కొనుగోలు కేంద్రాలు
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:01 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్నదాతలు
- దిక్కుతోచని స్థితిలో దళారులను ఆశ్రయిస్తున్న రైతులు
మహబూబ్‌నగర్ రూరల్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కోసి కల్లాలు లేకపోవడంతో మాచన్‌పల్లి, పోతన్‌పల్లి, బొక్కలోనిపల్లి, కోటకదిర, కోడూర్, ధర్మాపూర్ తదితర గ్రామ శివారులో బీటీ రోడ్డుపై ధాన్యం రాశులుగా పోసి కొనుగోలు కేంద్రాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్, దేవరకద్రలో ప్రైవేటు వ్యాపారులు దీన్ని ఆసరాగా చేసుకొని రూ.3,200 పచ్చి ధాన్యం, ఆరబెట్టిన ధాన్యం రూ.3,800 వరకు రైతు దగ్గరకే వచ్చి తీసుకెళ్తున్నారు. ధాన్యం ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేయకముందే ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, మధ్దతు ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.