ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు
ABN , Publish Date - Nov 13 , 2026 | 11:24 PM
మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో తీవ్ర జాప్యం నెలకొంది.
- రోడ్లపైనే ధాన్యం ఆరబోత.. రైతుల వద్దకే వస్తున్న దళారులు
మిడ్జిల్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో తీవ్ర జాప్యం నెలకొంది. పంట కోసి దాదాపు 20 రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. మండల వ్యాప్తంగా 9,983 ఎకరాల్లో వరి సాగు చేయగా.. ఇప్పటికే సగం మేర రైతులు పంట కోతలు చేపట్టారు. మరోవైపు రహదారులపైనే ధాన్యం ఆరబోయడంతో రైతులకు ఇబ్బందులతో పాటు రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోంది.
కేంద్రాల కోసం ఎదురుచూపులు..
మండలంలోని మిడ్జిల్, వెలుగొమ్ముల, చిల్వేరు, మున్ననూరు, వాడ్యాల, వేముల గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో, దోనూర్లో డీసీఎంఎస్ ద్వారా, అయ్యవారిపల్లి, మల్లాపూర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కేంద్రాలు అందుబాటులోకి రాకపోవడంతో రైతులు ధాన్యాన్ని ఎక్కడ విక్రయించాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ధాన్యాన్ని ఆరబెట్టి పూర్తిస్థాయిలో తేమ శాతం వచ్చినప్పటికీ కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రోజుల తరబడి కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రైతుల వద్దకే దళారులు..
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడాన్ని ఆసరాగా చేసుకుని గ్రామాల్లోకి దళారులు వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. పంట కోసిన వెంటనే ధాన్యం ఆరబెట్టుకపోయినా కొనుగోలు చేస్తామంటూ రైతులను సంప్రదిస్తున్నట్లు సమాచారం. తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గన్నీ బ్యాగులు వచ్చాకే ప్రారంభం
ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి అవసరమైన గన్నీ బ్యాగులు వచ్చిన తర్వాత, రైస్ అలాట్మెంట్ పూర్తైన వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం.
- బాల్రెడ్డి, సీఈవో, పీఏసీఎస్