Share News

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

ABN , Publish Date - May 14 , 2026 | 11:24 PM

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు.

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
రేవల్లిలో ఇందిరమ్మ ఇంటిని పరిశీలిస్తున్న కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి

- నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

- ఎమ్మెల్యేతో కలిసి ఊర్కొండ మండలంలో పర్యటన

- అభివృద్ధి పనులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

ఊర్కొండ, మే 14 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డితో కలిసి మండలంలోని రాచాలపల్లి, రేవల్లి, గుడిగానిపల్లి గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. అభివృద్ధి పనుల పురోగతితో పాటు ఇందిరమ్మ గృహాలను పరిశీలించారు. రాచాలపల్లిలో ధాన్యాన్ని ఆరబెడుతున్న రైతుతో మాట్లాడారు. పంట దిగుబడి, ధాన్యం నాణ్యత, కొనుగోలు కేంద్రాలకు తరలింపు తదితరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. గుడిగానిపల్లిలో శిథిలావస్థకు చేరిన పాఠశాలను పరిశీలించారు. నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు. రేవల్లిలో కర్రోళ్ల మైసమ్మ అనే మహిళ తనకు పింఛను ఇప్పించాలని కోరగా, ఆమె భర్తకు వృద్దాప్య పింఛను ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇందిరమ్మ గృహాల నిర్మాణం వేగవంతం చేయాలని లబ్ధిదారులకు సూచించారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు మహేశ్‌, బంగారు, రుక్మారెడ్డి అదనపు కలెక్టర్‌ దేవసహయం, హౌసింగ్‌ పీడీ సగప్ప, డీపీవో శ్రీరాములు, కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్‌రెడ్డి, తహసీల్దార్‌ యూసుఫ్‌ అలీ, ఎంపీడీవోలు సత్యపాల్‌రెడ్డి, కృష్ణయ్య, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు అయూబ్‌పాషా పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2026 | 11:24 PM