ముందుచూపు!
ABN , Publish Date - Jan 19 , 2026 | 11:44 PM
ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే మునిసిపాలిటీల్లో ఆశావాహుల సందడి మొదలయ్యింది.
- మునిసిపాలిటీల్లో ఆశావహుల సందడి
- షెడ్యూలు వెలువడక ముందే హడావిడి
- ఇంటింటికీ నాయకులు, కార్యకర్తలు
- సమస్యలపై ఆరా, పరిష్కారానికి యత్నం
వనపర్తి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే మునిసిపాలిటీల్లో ఆశావాహుల సందడి మొదలయ్యింది. ఎన్నికల బరిలో నిలవడానికి సిద్ధమైన వారిలో చాలా మంది వారం, పది రోజులుగా గల్లీగల్లీ తిరుగుతున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను అప్యాయంగా పలుకరిస్తూ, వారిని ప్రసన్నం చేసుకోవడానికి యత్నిస్తున్నారు. మరి కొందరు కొంతకాలంగా వార్డుల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లు స్పష్టమైన నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపునకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. మహిళలకు రిజర్వు అయిన స్థానాల్లో కుటుంబ సభ్యులను బరిలో దించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందుకోసం ముందస్తుగానే ప్రచారం మొదలు పెట్టారు. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వెలవడినా, రంగంలోకి దిగేందుకు అవసరమైన డబ్బును సమీకరణలో నిమగ్నమయ్యారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కోసం పొటోలు, వీడియోలను సిద్ధం చేసుకుంటున్నారు.
పలకరిస్తూ, పనులు చేస్తూ..
వనపర్తి జిల్లాలోని ఐదు మునిసిపాలిటీల్లో ఓటరు తుది జాబితాలను ప్రకటించారు. ఇప్పటికే వార్డుల పాటు, మునిసిపల్ చైర్మన్ల రిజర్వేషన్లపై స్పష్టత వచ్చింది. ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉన్నాయి. ఈ నేపథ్యంలో బరిలో నిలవడానికి ఆసక్తితో ఉన్న వారంతా జనం బాట పట్టారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. పలుకరిస్తూ, పనులు చేయిస్తున్నారు. కొందరు మాజీ కౌన్సిలర్లు వార్డులోని ఖాళీ స్థలాల్లో పెరిగిన కంప చెట్లు, పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయిస్తున్నారు. కొందరు డ్రైనేజీలు శుభ్రం చేయించగా, మరికొందరు విద్యుత్ దీపాలు, పైపులైన్ల మరమ్మతులపై దృష్టి సారించారు.
సొంత ఖర్చుతో సమస్యల పరిష్కారం
గత కొన్ని సంవత్సరాల నుంచి కాలనీల్లో పేరుకుపోయిన చిన్న చిన్న సమస్యలను ఆశావాహులు సొంత డబ్బు వెచ్చించి పరిష్కరిస్తున్నారు. మునిసిపాలిటీల్లో అభివృద్ధి పనులకు వారం రోజుల క్రితం నిధులు మంజూరయ్యాయి. దీంతో కొత్తకోట, పెబ్బేరు, వనపర్తి మునిసిపాలిటీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసి, పనులను ప్రారంభించారు. కొన్ని చోట్ల సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టారు. అధికార పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్ల కనుసన్నల్లోనే ఈ పనులు జరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
అప్పుడే తాయిలాలు షురూ
వనపర్తి జిల్లా కేంద్రంలో కొందరు ఆశావాహులు సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గులు, రంగుల ప్యాకెట్లను ఇంటింటికీ పంపిణీ చేశారు. మరికొందరు వార్డుల్లో ముగ్గుల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించారు. కొందరు నాయకులు మాంసం, మందు కూడా పంపిణీ చేసినట్లు తెలిసింది. విలీన గ్రామాల్లో పండుగకు వచ్చిన యువకులు, ప్రజలతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఓటు వేసేందుకు తప్పకుండా రావాలని మర్యాదలు చేశారు. షెడ్యూల్ వచ్చిన వెంటనే మళ్లీ వారిని కలిసేందుకు అవసరమైన సమాచారం, ఫోన్ నెంబర్లను సేకరించుకున్నారు. వార్డుల్లో వివిధ వర్గాలకు చెందిన సంఘాలు, కుల సంఘాలు, సంక్షేమ సంఘాలు, అభివృద్ధి సంఘాలు, కాలనీ సంఘాల వారీగా నాయకులు, సభ్యులను కలుస్తూ మద్దతు కూడగట్టుకునేందుకు యత్నిస్తున్నారు.